హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో చేసిన ప్రకటనకు అనుగుణంగా 22ఏకు సంబంధించిన అన్ని అంశాలను ఫాస్ట్‌ట్రాక్‌లో పరిష్కరించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసినట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. ఇందుకు సంబంధించి జీవోఆర్టీ నంబర్ 564ను జారీచేసినట్టు వెల్లడించారు. ఈ కమిటీకి చైర్మన్‌గా సీసీఎల్ఏ డీఎస్ లోకేశ్‌కుమార్, లా సెక్రటరీ పాపిరెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు సభ్యులుగా ఉంటారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి మలాజిగిరి ఎంపీగా నాడు ఎల్బీనగర్ నియోజక వర్గంలోని పలు కాలనీల్లో ఉన్న రెగ్యులరైజేషన్ సమస్యను పరిషరిస్తానని ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలో 118 జీవో ప్రకారం 9,700 ప్లాట్ల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన మెమోను శుక్రవారం జారీ చేశామని, శనివారం నుంచి రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని స్పష్టంచేశారు.
అకడ ప్లాట్లు తీసుకొని, ఇండ్లు నిర్మించుకొని దశాబ్దాలుగా నివాసం ఉంటున్న ఇండ్ల యజమానులు 118 జీవో ప్రకారం స్థానిక అధికారులను సంప్రదించి నిబంధనల మేరకు రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించారు. సింగరేణి ప్రాంతంలో ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జీవో-76 జారీ చేశారని, దానిని అనుసరించి శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఆధ్వర్యంలో సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి రెగ్యులరైజేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించారు. రెవెన్యూ రికార్డుల్లో ఉండి హెచ్ఎండీఎ, డీటీసీపీ, జీహెచ్ఎంసీ అనుమతులతో లేఅవుట్లు వేసిన ప్రాంతాలను 22ఏ నుంచి తొలగించే విషయంలో ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.