హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు కోతలు.. వ్యవసాయ విద్యుత్తుకు కరెంట్ అందకపోవడంపై రాష్ట్ర అసెంబ్లీ హీటెక్కింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలువురు ఎమ్మెల్యేలు గళమెత్తారు. శుక్రవారం జీరో అవర్‌లో విద్యుత్తు కోతలను ప్రస్తావించారు. ప్రతిపక్ష సభ్యులకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం తోడయ్యారు. వ్యవసాయానికి 24గంటల కరెంట్ ఇవ్వడంలేదని ఆరోపించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారని ప్రస్తావించారు. రైతులు ఆందోళనకు దిగుతున్నారని, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తు అందించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కరెంట్ కోతలు తీవ్రంగా ఉన్నాయని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి జీరో అవర్‌లో ప్రస్తావించారు. రోజుకు ఐదారు గంటలకు మించి రైతులకు కరెంట్ ఇవ్వడం లేదని విమర్శించారు. మోటర్లు పనిచేయక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. డిప్యూటీ సీఎం ఈ అంశంపై సమీక్ష నిర్వహించాలని కోరారు. ఎల్ నినో సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కరెంట్ సరఫరా చేసి రైతులకు అండగా నిలువాలని సూచించారు.
విద్యుత్తు కోతల సమస్య తీవ్రంగా ఉన్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. రైతులు ధర్నాలకు దిగుతున్నారని, ఇది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారిందని తెలిపారు. విద్యుత్తు సర్దుబాటు చేసి అందించాలని కోరారు. కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి ప్రస్తావించారు. మంత్రి చొరవ తీసుకుని ఈ ఇబ్బందులను తొలగించాలని కోరారు. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్‌ను నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. కల్వకుర్తి మున్సిపాలిటీలోని ఇండ్లపై ఉన్న ఎల్టీ విద్యుత్తు లైన్లను తొలగించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు.

అప్రకటిత కరెంట్ కోతలతో పంటలు ఎండుతున్నాయి. దీంతో సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ పలుచోట్ల కర్షకులు నిరసనకు దిగారు. శుక్రవారం నల్లగొండ జిల్లా దామరచర్ల సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు
రాష్ట్రంలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉన్నదని సీపీఐఎల్పీ నేత కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో పీక్ డిమాండ్ సమయంలో రోజుకు 300 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతుండగా, రాష్ట్రంలో స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 130 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉన్నదని తెలిపారు. 170 మిలియన్ యూనిట్ల విద్యుత్తును బయటి నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉన్నదని చెప్పారు. కొత్తగూడెం (కేటీపీఎస్)లో స్థలమున్నదని, అన్ని రకాల వసతులున్నాయని 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను నిర్మించాలని డిమాండ్ చేశారు.
తన నియోజకవర్గంలోని ఓ మండల కేంద్రానికి వెళ్తే రాత్రిపూట కరెంట్ వస్తలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ఎల్ నినో ప్రభావంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరెంటు, నీటి సమస్య తీవ్రంగా ఉన్నదని, దీని నుంచి బయటపడేందుకు ప్రతిపక్షాలు సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కరెంట్ సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో వర్షాలు కురువాలని తాము పూజలు చేస్తే ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తున్నాయని అనిరుధ్‌రెడ్డి మండిపడ్డారు. దీనికి బీజేపీ నేతలు అభ్యంతరం తెలుపగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓట్ల కోసమే బీజేపీ నేతలు జైశ్రీరాం అంటారని, వర్షాల కోసం జైశ్రీరాం ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 18 : కరెంటియ్యకపోతే పంటలెట్ల పండుతాయని రైతులు సర్కార్‌ను నిలదీస్తున్నారు. ఓవైపు వర్షాలు లేక.. మరోవైపు సర్కారేమో కరెంటియ్యకపోతే నీరందక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. విద్యుత్తు కోతలను నిరసిస్తూ శుక్రవారం కూడా పలు జిల్లాల్లో రైతులు సబ్స్టేషన్లను ముట్టడించారు. రోడ్లపై ధర్నాలు, రాస్తారోకో చేపట్టారు. లోవోల్టేజీ సమస్య, అప్రకటిత కరెంటు కోతలను నిరసిస్తూ నల్లగొండ జిల్లా దామరచర్లలోని సబ్‌స్టేషన్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు.

సబ్‌స్టేషన్‌లో సిబ్బందిని నిలదీశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. 24 గంటల కరెంటు పోయింది.. 12 గంటలు అంటున్నరు అదీ ఐదారు గంటలే , ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారని మండిపడ్డారు. నాణ్యమైన కరెంటు రాక స్టాటర్లు, మోటర్లు కాలిపోయి ఆర్థికంగా నష్టపోతున్నామని ఆగ్రహం వ్యక్తంచేశారు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లిలోని సబ్‌స్టేషన్ ఎదుట రైతులు నిరసన తెలిపారు. విద్యుత్తు కోతలను నిరసిస్తూ కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు.