హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి సర్కార్‌కు శుక్రవారం ఒకే రోజు ఐదు ఎదురుదెబ్బలు తగిలాయి. కేటీఆర్ పీఆర్వో మహేశ్‌తోపాటు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలన్న రేవంత్ ప్లాన్ విఫలమైంది. వారికి రిమాండ్ అవసరం లేదని న్యాయస్థానాలు చెప్పడంతో ప్రభుత్వం నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది. మరోవైపు, పార్టీ ఫిరాయింపు కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో పార్టీ ఫిరాయించిన మరో ఎనిమిది మందిలో భయాందోళన మొదలైంది. ఎర్రవెల్లి వైపు రాజకీయ దండయాత్ర తలపెట్టిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలకు భారీ పోలీసు బందోబస్తు మాత్రమే ఎదురైంది. ఆశించిన ఏదో ఫలితం రాకుండానే పథకం ఎదురుతన్నింది. ఖమ్మంలోని శ్రీనివాసనగర్‌లో పేదల ఇండ్లను కూల్చవద్దని బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి న్యాయస్థానంలో మద్దతు లభించింది. శ్రీనివాసనగర్‌లోని ఇండ్లను కూల్చవద్దని హైకోర్టు ఆదేశించడం కాంగ్రెస్ సర్కార్‌కు చెంపపెట్టుగా మారింది. ఈ పరిణామాలను రేవంత్ ప్రభుత్వానికి ఒకేరోజు ఐదు వరుస ఎదురు దెబ్బలుగా బీఆర్ఎస్ నేతలు అభివర్ణించారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఇంటి వద్ద శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు భారీగా మోహరించడం మరో వివాదానికి దారితీసింది. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన కేసుకు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు మొదట నోటీసు ఇవ్వడానికి వచ్చామని చెప్పి, అనంతరం ఇం టి తలుపులు, గేటు బద్దలు కొట్టి మరీ క్రిశాంక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన క్రిశాంక్ భార్య, బిడ్డ ఏడుస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. క్రిశాంక్ కుటుంబంపై ప్రభుత్వ, పోలీసుల దమనకాండ తీరుపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
న్యాయస్థానంలో క్రిశాంక్‌ను హాజరుపరిచిన పోలీసులు 14 రోజులపాటు రిమాండ్ విధించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఏడేండ్లకు పైబడిన శిక్షకాదు కాబట్టి రిమాండ్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. క్రిశాంక్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులపై రెచ్చగొట్టే, తప్పుడు సమాచారం ప్రచారం చేశారన్నది ఫిర్యాదుదారుల ఆరోపణ. అయితే, తాను పోలీసులపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వెనుక ఉన్న అంశాలు సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఘటనలకు సంబంధించినవేనని క్రిశాంక్ తెలిపారు. ఆ వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని హైకోర్టు ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు కేసును విచారించిన హైకోర్టు.. ఆయనను అనర్హుడిగా ప్రకటించడం రేవంత్ ప్రభుత్వానికి రాజకీయంగా తీవ్ర ఎదురుదెబ్బగా మారింది. ఈ తీర్పుతో ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. తమపై సైతం వేటు తప్పదేమోననే ఆందోళన వారిని కలవరపెడుతున్నది. పార్టీ మారినా పదవిని కాపాడుకోవచ్చనే ధీమాకు కోర్టు తీర్పు అడ్డుకట్ట వేసిందనే అభిప్రాయం నాయకుల్లో ఏర్పడింది.
ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్‌లో ఇండ్ల తొలగింపు అంశం కూడా ప్రభుత్వానికి రాజకీయంగా సవాల్‌గా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు పేదలు నిర్మించుకున్న ఇండ్లను క్రమబద్ధీకరించింది. అయితే, రోడ్డు విస్తరణ కోసం వారి నివాసాలను తొలగించాలంటూ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆయా కుటుంబాలకు నోటీసులు ఇచ్చారు. దీంతో బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ప్రత్యామ్నాయం చూపకుండా పేదల ఇండ్ల జోలికి వెళ్లొద్దని హైకోర్టు శుక్రవారం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీనిని బీఆర్ఎస్ విజయంగా అక్కడ 30 ఏండ్లుగా ఉంటున్న నివాసితులు అభివర్ణిస్తున్నారు.
కేసీఆర్ ఎర్రవెల్లి నివాసం చుట్టూ రాజకీయ ఉద్రిక్తత గత కొన్ని రోజులుగా కొనసాగుతున్నది. కేసీఆర్ కుటుంబానికి చెందిన భూములపై విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతోపాటు.. ఎర్రవెల్లి నివాసం పరిసరాల్లో సుమారు 700 ఎకరాల భూమిపై దర్యాప్తు అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎర్రవెల్లిలో కేసీఆర్ భూములతోపాటు సిద్దిపేటలో హరీశ్‌రావు భూములను పరిశీలిస్తామంటూ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు ఏసీ బస్సులో శుక్రవారం రాజకీయ యాత్ర చేపట్టారు. రెండు రోజులుగా రెవెన్యూ అధికారులు ఎర్రవెల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నిర్వహించారు. ప్రాథమిక నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించారు.
ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనట్టుగా ఆధారాలు లభించకపోవడం, మరోవైపు యాత్ర చేపడితే అభాసుపాలు అవుతామనే ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయ యాత్రను రంగనాయకసాగర్‌కు మళ్లించారు. అక్కడ పరిసరాలను కాసేపు పరిశీలించి మళ్లీ హైదరాబాద్ బాటపట్టారు. అయితే, కాంగ్రెస్ నేతల పర్యటన కోసం ఆయా ప్రాంతాల్లో భారీఎత్తున పోలీసులను మోహరించారు. పోలీసులు ప్రజలను అడ్డుకోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో మహేశ్ అరెస్టు వ్యవహారం శుక్రవారం ఉదయం రాజకీయ దుమారం రేపింది. విచారణ నిమిత్తం గురువారం సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో హాజరైన మహేశ్‌ను అకడి నుంచి బొల్లారం పోలీసులు మరో కేసులో తీసుకెళ్లారు. రాత్రంతా విచారించిన అనంతరం శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4.30 గంటలకు బీఎన్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసు ఇచ్చి విడుదల చేశారు. సెప్టెంబర్ 8న బీఆర్ఎస్ నేతలు ఎర్రవెల్లి వైపు వెళ్తున్న సమయంలో బొల్లారం చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో మహేశ్ పోలీసు అధికారితో వాగ్వాదానికి దిగారని, విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్లోని 132, 223 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హడావుడిగా అరెస్టు చేసి రాత్రంతా విచారించిన తరువాత చివరికి నోటీసు ఇచ్చి విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, కేటీఆర్ సన్నిహితులను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.