మబ్బుల్లో నీళ్లు చూసి, ముంత ఒలకబోసుకున్నట్టున్నది కాంగ్రెస్ సర్కార్ వ్యవహారం. కాళేశ్వరం మీద కక్షతో వరద నీటిని ఒడిసిపట్టకుండా ఇన్నాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కాలయాపన చేసింది. ఒక్క మేడిగడ్డ నుంచే సుమారు 600 టీఎంసీల నీళ్లు దిగువకు వెళ్లిపోయాయి. ఇప్పుడు ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని, ఉన్ననీటినీ సాగుకు పూర్తిగా ఇవ్వలేమని చేతులెత్తేస్తున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్18 (నమస్తే తెలంగాణ) : గోదావరి జలాలను దిగువకు చేజేతులా కాంగ్రెస్ సర్కార్ జారవిడుస్తున్నది. కృష్ణాజలాలు యథేచ్ఛగా ఏపీ కొల్లగొడుతున్నది. ప్రధాన జలాశయాల్లో నీటినిల్వలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు సగానికి పైగా వెలవెలబోతున్నాయి. ఫలితంగా భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. నీటి సంరక్షణపై రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రాబోయే రోజుల్లో నీటిసంక్షోభం తలెత్తక తప్పదని అధికార వర్గాలే హెచ్చరిస్తున్నాయి. పట్టణాలు, పల్లెలని తేడాలేకుండా బోర్లు వట్టిపోతుండటంతో రానున్న కొన్నిరోజుల్లోనే తాగునీటికి కటకట ఏర్పడే ప్రమాదం ఉన్నదని నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితులు ఉంటాయని కేంద్ర, రాష్ట్ర వాతావరణ శాఖలు మార్చి నెలాఖరు నుంచే గుర్తుచేస్తున్నాయి.
నివేదికలను విడుదల చేస్తూ ప్రభుత్వాలను హెచ్చరిస్తూ వస్తున్నాయి. నీటి సంరక్షణపై దృష్టి సారించాలని సూచనలు చేస్తున్నాయి. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వాటిని పెడచెవిన పెట్టింది. గోదావరి జలాలను ఒడిసిపట్టుకొని పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిపోయి ఉద్దేశపూర్వకంగానే కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులను వినియోగించుకోకుండా పడావుగా పెడుతూ, తెలంగాణలోని సాగు భూములను ఎండబెట్టింది. స్వ‘హస్తాల’తో కరువు కోరల్లోకి తెలంగాణను నెట్టింది. ఈ ఏడాది ఇప్పటివరకు గోదావరిలోకి మొత్తంగా 1,045 టీఎంసీలు రాగా, అందులో ఒక్క ప్రాణహిత నుంచే దాదాపు 610 టీఎంసీలకు పైగా జలాలు దిగువకు తరలిపోయాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కీలకమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ ఎగువ కన్నెపల్లి పంపులను ఆన్‌చేస్తే ప్రాణహిత జలాలను ఒడిసిపట్టుకొనే వెసులుబాటు తెలంగాణకు ఉన్నది.
మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అక్కడి నుంచి నందిమేడారం, లక్ష్మీపూర్, రాజరాజేశ్వర జలాశయం, అనంతగిరి (అన్నపూర్ణ) రిజర్వాయర్, రంగనాయకసాగర్‌కు, తద్వారా కొమురవెళ్లి మల్లన్నసాగర్, అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్ వరకు గోదావరి జలాలను తరలించుకోవచ్చు. అందుకు కావాల్సిన నీటిసరఫరా వ్యవస్థ మొత్త సంసిద్ధంగా ఉన్నది. అంతేకాదు ఎస్సారెస్సీ, నిజాంసాగర్‌ను సైతం నింపుకొనే అవకాశం ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు రాడార్‌లోని దాదాపు 10 వేలకు పైగా చెరువులను నింపుకొనే సౌలభ్యమూ ఉన్నది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయనేలేదు. కావాలనే ప్రాజెక్టును పడావు పెట్టింది. కేవలం ఎల్లంపల్లి నుంచి 15 టీఎంసీలను మాత్రమే.. అదీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పంపుల ద్వారానే తరలించింది. ఎల్లంపల్లి నుంచి సైతం దాదాపు 40 టీఎంసీలను దిగువకు వదిలేసింది. దేవాదుల ప్రాజెక్టులో పంపులను సైతం పూర్తిస్థాయిలో నడుపలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో మరోవైపు కృష్ణా జలాలను ఏపీ యథేచ్ఛగా కొల్లగొడుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఆగస్టు మొదటి వారం నుంచే వరదనీటి ప్రవాహాలు మొదలయ్యాయి. ఆ జలాలను విద్యుదుత్పత్తి ద్వారా దిగువన నాగార్జునసాగర్‌కు విడుదల చేసే అవకాశం ఉన్నది. ఆ అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేజేతులా నిర్వీర్యం చేసింది. బీఆర్ఎస్ నేతలు నిలదీయడంతో తేరుకొని ప్రారంభించినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా కల్వకుర్తి లిఫ్ట్‌ను పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు. జూరాల ప్రాజెక్టుతోపాటు, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా లిఫ్ట్‌లను సామర్థ్యం మేరకు ప్రభుత్వం నిర్వహించడం లేదు. పగటిపూట మాత్రమే కరెంటు ఇస్తూ, రాత్రిపూట నిలుపుదల చేస్తున్నది. ఫలితంగా నీటి ఎత్తిపోతలు మందకొడిగా సాగుతున్నాయి. ఈ ఏడాది కృష్ణాలో ఇప్పటివరకు మొత్తంగా 320 టీఎంసీలు వచ్చాయి. అందులో ఇప్పటివరకు రెండు రాష్ర్టాలు కలిపి 129 టీఎంసీలను వినియోగించుకున్నాయి. అందులో ఏపీ ఒక్కటే దాదాపు 83 టీఎంసీలను వినియోగించుకొన్నది. ప్రస్తుతం ఆ రెండు రిజర్వాయర్లలో 185 టీఎంసీలు ఉండగా, అందులో వినియోగానికి అందుబాటులో ఉన్నది కేవలం 100 టీఎంసీలు మాత్రమే. మరోవైపు ఏపీ ఇప్పటికీ యథేచ్ఛగా కృష్ణా జలాలను మళ్లించుకుపోతూనే ఉన్నది. అయినా రేవంత్ సర్కార్ అడ్డుకున్నది లేదు. జలాలను తెలంగాణకు మళ్లించిందీ లేదు. పొరుగున ఏపీ మాత్రం గోదావరి, కృష్ణా జలాలను ఒడిసిపడుతున్నది. ఎల్ నినో నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమై వరద ప్రవాహాలు ప్రారంభంకాగానే గోదావరి, కృష్ణా నుంచి జలాలను మళ్లించడం ప్రారంభించి, ఇప్పటికీ కొనసాగిస్తున్నది.
రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటినిల్వలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. సగానికి పైగా చెరువులు వెలవెలబోతున్నాయి. దీంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటు భూగర్భ జలమట్టం 9.34మీటర్లుగా ఉండగా, 13 జిల్లాల్లో 10 మీటర్లు కంటే ఎక్కువ లోతుకు పడిపోయాయి. ఇప్పుడే బోరుబావులు వట్టిపోతున్న ప్రమాదకర పరిస్థితులు పట్టణప్రాంతాల్లో నెలకొన్నాయి. ఈ పరిస్థితులన్నీ తాగునీటి అవసరాలను గణనీయంగా పెంచే అవకాశం ఉన్నది. సాధారణ రోజులతో పోల్చితే ప్రాజెక్టుల నుంచి తాగునీటి అవసరాలు రెట్టింపయ్యే అవకాశం ఉన్నది. కానీ ప్రస్తుతమున్న నిల్వలు ఆ డిమాండ్‌ను తీర్చే పరిస్థితి లేదని తేలిపోతున్నది. ఈ నేపథ్యంలో మున్ముందు తెలంగాణకు గడ్డుకాలమే ఎదురయ్యే ప్రమాదం నెలకొన్నది. శ్రీశైలంపై మహబూబ్‌నగర్‌తో సహా 7 జిల్లాలు, సాగర్‌పై నల్లగొండ జిల్లా, హైదరాబాద్ నగరం తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. తెలంగాణకు కృష్ణా బేసిన్లో, ఆయా జిల్లాల్లో ఎక్కడా పెద్దపాటి రిజర్వాయర్లు సైతం అందుబాటులో లేవు. కేవలం శ్రీశైలం, సాగర్‌లోనే నిల్వ చేసుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నీళ్లన్నీ ఏపీ ఖాళీ చేసుకుపోతే మున్ముందు ఆయా జిల్లాలకు తాగునీటి సంకటం తప్పదు.
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ నుంచి ఏపీకి కేవలం తెలుగుగంగ 15, ఎస్ఆర్బీసీ (శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్) 19 టీఎంసీలు కలిపి మొత్తంగా 34టీఎంసీల కేటాయింపులు మాత్రమే ఉన్నాయి. ఆ జలాలను తరలించుకోవాలన్నా కూడా బోర్డు నీటి విడుదల ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగానే, అనుమతులేవీ లేకుండానే ఈ సీజన్లో ఏపీ జలాలను మళ్లించుకుంటూ పోతున్నది. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వమట్టం 885 అడుగులు కాగా, ఆగస్టు 6వ తేదీ నాటికి 870 అడుగులకు చేరుకొన్నది. అదే తడువుగా ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి పెన్నా బేసిన్‌కు కృష్ణాజలాల మళ్లింపును ప్రారంభించింది. పోతిరెడ్డుపాడుకు చెందిన 5, 6వ నంబర్ గేట్లను ఎత్తి 4,000 క్యూసెకులతో ప్రారంభించి అంతకంతకూ పెంచుతూ పోయింది. ఇప్పటికీ జలాలను మళ్లించుకుపోతున్నది. అదీగాక వెలిగొండ ప్రాజెక్టు అనేది కూడా కేవలం వరదజలాల ఆధారంగానే నిర్మించింది.
కృష్ణాలో ప్రాజెక్టులన్నీ నిండి పొంగిపొర్లుతున్న సమయంలో వరద జలాలను తరలించాలి. కానీ ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు ఫేస్-1ను ప్రారంభించారు. 11.43 టీఎంసీలను నల్లమల సాగర్‌కు నీటి తరలింపును చేపట్టారు. ఎల్ నినో నేపథ్యంలోనూ నిబంధనలన్నీ తుంగలో తొక్కి, వాటాలు ఖరారు కాకముందే, అంతకు రెట్టింపుస్థాయిలో కృష్ణా జలాలను కొల్లగొడుతూ ఏపీ సీఎం చంద్రబాబు వాటర్మ్యాన్గా అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. కలెక్టర్ల చేతే కీర్తించుకుంటున్నారు. ఏపీ అక్రమంగా జలాలను తరలిస్తున్నా.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం చోద్యం చూస్తున్నారు. ఏపీని కట్టడి చేయకుండా, బోర్డుపై ఒత్తిడి చేయక బాబు అడుగులకే మడుగులు ఒత్తుతున్నారు. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టును, మరోవైపు పాలమూరు-రంగారెడ్డి, తదితర ఎత్తిపోతల పథకాలను పడావు పెడుతూ నీటిని ఎత్తిపోయకుండా బేకార్మ్యాన్గా విమర్శల పాలవుతున్నారు. రేవంత్ సర్కార్ ఉదాసీనత ఫలితంగా నిరుడు సైతం ఏపీ ఒక్క శ్రీశైలం నుంచే దాదాపు 240 టీఎంసీలను యథేచ్ఛగా మళ్లించుకుపోయింది. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతున్నది.

ఎల్ నినోను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఎన్డీఆర్ఎఫ్ నుంచి తగిన సాయం, పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ, తాగునీరు, పశుగ్రాసం, పశుసంపద పరిరక్షణ, భూగర్భ జలాల పునురద్ధరణ, చెరువులను పునరుద్ధరించేందుకు కేంద్రం సాయం అందించాలని తీర్మానంలో కోరారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు 70శాతం మేర వాటా కేటాయించాలని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ సర్కార్ వాదనలు వినిపించింది. కేంద్రం జారీచేసిన సెక్షన్-3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీకి సంబంధించి ఢిల్లీలో శుక్రవారం విచారణ చేపట్టింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర ఎదుట తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. తదుపరి విచారణ అక్టోబర్ 28 నుంచి 30వ వరకు కొనసాతుందని పేర్కొన్నారు.
అమరచింత, సెప్టెంబర్ 18 : ‘పంటలకు సాగునీరు విడుదల చేస్తారా? మమ్మల్ని చావమంటారా’? అని రైతులు అధికారులను ప్రశ్నించారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని శుక్రవారం వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుపై రైతులు పురుగులమందు డబ్బాలు పట్టుకొని ఆందోళనకు దిగారు. రూ.లక్షల్లో అప్పులు చేసి వరి, కంది, ఆముదం, ఇతర పంటలు సాగు చేశామని.. ఐదు రోజులుగా జూరాల డ్యాం ఎడమ కాలువ నుంచి సాగునీరు విడుదల నిలిచిపోవడంతో పంటలు ఎండుమొఖం పట్టాయని వాపోయారు. ధర్నాతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ఎస్సై స్వాతి సిబ్బందితో చేరుకొని రైతులు, ప్రాజెక్టు అధికారులతో మాట్లాడారు. నీళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ప్రాజెక్టు అధికారులు చెప్పడంతో రైతులు శాంతించారు. వెంటనే నీళ్లు ఇవ్వకుంటే శనివారం మక్తల్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
