హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ)/ శంకర్పల్లి రూరల్ : బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చెందిన ఫామ్‌హౌస్ అంటూ కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి ఆ ప్రాపర్టీ యజమాని ప్రదీప్‌రెడ్డి తెరదించారు. ఈ ప్రాపర్టీకి ఏకైక చట్టబద్ధమైన యజమానిని తానేనని స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ తనకు బాల్య స్నేహితుడని, ఆ కారణంతోనే ఈ స్థలాన్ని ఆయనకు లీజుకు ఇచ్చానని తెలిపారు.
కేటీఆర్‌కు తనకు మధ్య ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని, ఇది కేవలం లీజు ఒప్పందం మాత్రమేనని తేల్చిచెపుతూ ఈ స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. మొత్తం నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తి ప్రస్తుతం తన పేరు మీదే ఉన్నదని చెప్పారు. గతంలో ఇది ఇద్దరు, ముగ్గురి చేతులు మారిందని, ఆ తర్వాత తాను ఓ రియల్టర్ ద్వారా చట్టబద్ధంగా నిబంధనల ప్రకారం కొనుగోలు చేశానని పేరొన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని కొనుగోలు దస్తావేజులు తనవద్ద ఉన్నాయని తెలిపారు.
రెండు రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలపై ప్రదీప్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. కొన్ని రాజకీయ బృందాలు ఈ ఫామ్‌హౌస్‌ను పరిశీలించేందుకు వస్తున్నట్టు వార్తలు విన్నానని చెప్పారు. ప్రైవేట్ ఆస్తిలోకి అనుమతి లేకుండా రావడం ఎవరూ సహించరని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బలవంతంగా ప్రవేశించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అనుమతి లేకుండా లోపలికి చొరబడేందుకు (ట్రెస్పాసింగ్) ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అలాంటి ప్రయత్నాలు జరిగితే చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే ఆస్తి పరిరక్షణ కోసం పోలీసు రక్షణను కూడా కోరుతామని వెల్లడించారు.
ప్రాపర్టీలో ఏవైనా అక్రమాలు ఉన్నాయని భావిస్తే ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తానని ప్రదీప్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఎలాంటి అనుమానాలున్నా తనకు చట్టబద్ధంగా నోటీసులు జారీ చేయవచ్చని చెప్పారు. ప్రభుత్వం నుంచి నోటీసు వస్తే అధికారులతో సంపూర్ణంగా సహకరిస్తానని స్పష్టంచేశారు. తన దగ్గర పత్రాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం లేదా అధికారులు చట్టప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు.