సిద్దిపేట, సెప్టెంబర్ 18( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు. పర్యటనలో భాగంగా రాజీవ్ రహదారి వెంట ఎక్కడచూసినా పోలీసులే కనిపించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు. పకజిల్లాల నుంచి సైతం పోలీస్ బలగాలను రప్పించి మరి ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
ఎంపీల పర్యటన పేరుతో ఐజీ, డీఐజీ, కమిషనర్, అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్), డీఎస్పీలు, సీఐలతో కలిపి సుమారు 3,000 మంది పోలీసులు, డ్రోన్ కెమెరాలు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో ఏదో యుద్ధానికి సిద్ధమై ఉన్నట్టుగా పరిస్థితులు దర్శనమిచ్చాయి. ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం పర్యటించే ప్రాంతాలతోపాటు ప్రధాన రహదారులు, కీలక కూడళ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. సాధారణంగా ప్రజాప్రతినిధుల పర్యటనకు భద్రతా ఏర్పాట్లు చేయడం సహజమే అయినా ఈ స్థాయిలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించడంపై స్థానికంగా చర్చ మొదలైంది. చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం, ఇతర జిల్లాల నుంచి బలగాలను తరలించడం, ఉన్నతాధికారులను బందోబస్తులో భాగస్వామ్యం చేయడంపై పలువురు స్థానికులు ఆసక్తిగా చర్చించుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించడంపై స్థానికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల అవసరాలకు వినియోగించాల్సిన ప్రభుత్వ వనరులను ఒక రాజకీయ పర్యటనకు ఇంత భారీగా వినియోగించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనవసరంగా ప్రభుత్వ వనరులు, ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నదంటూ స్థానికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ బృందం పర్యటన కంటే.. దానికి కల్పించిన భారీ భద్రతే సిద్దిపేటలో ప్రధాన చర్చగా మారింది. ఈ పర్యటనతో ఒనగూరింది ఏం లేదు.. ప్రజాధనం వృథా తప్ప అని స్థానికులు చర్చించుకున్నారు. ప్రభుత్వాలు వాస్తవాలను దాచిపెట్టినప్పుడు ప్రతిపక్షాలు నిజనిర్ధారణకు వెళ్తాయి. కానీ అధికారంలో ఉండి ప్రభుత్వమే యాత్రలకు రావడం విడ్డూరంగా ఉన్నదని పెదవి విరుస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం శుక్రవారం సిద్దిపేట జిల్లాలో పర్యటించింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ బృందం తొలుత కొండపాక మండలం వెలికట్ట గ్రామ పరిధిలో 271 సర్వేనంబర్‌లోని భూములను పరిశీలించింది. అనంతరం చిన్నకోడూరు మండలం రామంచ గ్రామ శివారులో ఉన్న రంగనాయక సాగర్ వద్ద మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యవసాయ తోటను పరిశీలించారు. భూముల సర్వేనంబర్లు, విస్తీర్ణం, రిజిస్ట్రేషన్లు తదితర వివరాలపై అధికారుల ద్వారా ఆరాతీసింది.
ఈ సందర్భంగా ఆ భూములకు సంబంధించిన రికార్డులు, అందుబాటులో ఉన్న వివరాలను కాంగ్రెస్ నేతల బృందానికి స్థానిక ఆర్డీవో వివరించారు. రికార్డుల్లో ఉన్న వివరాలను పరిశీలించిన నేతలు.. భూముల రిజిస్ట్రేషన్లపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయంటూ ఆరోపణలు చేశారు. భూముల వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉన్నా, నిబంధనలు ఉల్లంఘించి ఉంటే పూర్తి స్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కాంగ్రెస్ నేతలు పేరొన్నారు. ఈ బృందంలో ఎంపీలు చామల కిరణ్‌కమార్‌రెడ్డి. మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, కడియం కావ్య, బలరాంనాయక్, సురేశ్‌షెట్కార్, గడ్గం వంశీ, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, నవీన్ యాదవ్, బల్మూరి వెంకట్ తదితరులు ఉన్నారు.
నేను రక్షణ శాఖలో ఉండగానే 1992-93లో భూమికోసం దరఖాస్తు చేసుకున్న. రక్షణ శాఖ ద్వారానే నా అప్లికేషన్ ఫార్వర్డ్ అయింది. 1995లో భూమి కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. తర్వాత భూమి హద్దుల విషయంలో పకవారితో ఇబ్బందులొచ్చాయి. దానిపై నేను కోర్టుకెళ్లా. 2007-08లో కోర్టు ఆదేశాలతో అధికారులు క్షేత్రస్థాయిలో భూమిని కొలిచి వెరిఫికేషన్ చేశారు. ఇరు వర్గాలకు లొకేషన్ మ్యాప్‌తో సహా భూమిని కేటాయించారు. తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్వోసీకి దరఖాస్తు చేశా. 2010లో ఎన్వోసీ వచ్చింది. అది నకిలీది కాదు. కోర్టు ద్వారా భూమి హద్దులు నిర్ధారించబడి అప్పటి రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఎన్వోసీ. దానిని నకిలీ అని ఎలా అంటారు. అది వచ్చాకే మారెట్లో భూమిని అమ్మకానికి పెట్టా. నిబంధనల ప్రకారం ఎక్స్ సర్వీస్‌మెన్‌కు ఇచ్చిన భూమిని పదేండ్ల తర్వాత అమ్ముకోవచ్చు. కానీ నేను 13 ఏండ్ల తర్వాత భూమిని అమ్ముకొన్నా.
-పెన్సి సత్యనారాయణ, ఎక్స్ సర్వీస్‌మెన్, సిద్దిపేట జిల్లా
మా నాన్న శానంగారి బ్రహ్మయ్యచారి స్వాతంత్ర సమరయోధుడు. ఆయనకు 1962లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధుల కోటాలో 10 ఎకరాల భూమిని కేటాయించింది. అప్పటి నుంచి మా ఆధీనంలోనే ఆ భూమి ఉన్నది. మా పకన సత్యనారాయణకు ప్రభుత్వం భూమి కేటాయించడంతో మా మధ్య హద్దుల తగాదా ఏర్పడింది. దీంతో కోర్టుకెళ్తే కమిషన్ ఏర్పాటుచేసింది. దీంతో కోర్టు నిర్ణయించిన ప్రకారం హద్దులతో కూడిన భూమిని మ్యాప్‌తో సహా మాకు కేటాయించారు. మేము ఎన్వోసీ తీసుకొని భూమిని అమ్ముకున్నాం. కానీ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చిన భూమిని వివాదాల్లోకి లాగడం ఎంతవరకు సమంజసం. ఇందిరమ్మ ఇచ్చిన భూమిని వివాదాల్లోకి లాగడం ఇందిరమ్మను అవమానించినట్టే కదా. ప్రభుత్వం ఇప్పటికైనా స్వాతంత్ర సమరయోధులకు సమచితమైన గౌరవాన్ని ఇవ్వాలి.
-శానంగారి శ్రీనివాస్‌చారి, సిద్దిపేట జిల్లా