కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్ సమావేశాల్లో పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం వేతన సవరణ సంఘాల సిఫారసులను అమలు చేసేటప్పుడు, పెన్షనర్లను వారి రిటైర్మెంట్ తేదీ ఆధారంగా వేర్వేరుగా వర్గీకరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. గతంలో పెన్షనర్లు అందర్నీ ఒకే వర్గంగా పరిగణించాలని, వివక్ష చూపకూడదని సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన కొన్ని తీర్పుల చట్టబద్ధమైన అధికారాన్ని అధిగమించడానికి కేంద్రం ఈ చట్టాన్ని రూపొందించింది. పైగా ఈ చట్టాన్ని 1 జూన్ 1972 నుంచి వెనుకటి తేదీతో వర్తింపజేశారు. దీని ద్వారా గతంలో ఆర్టికల్ 309 కింద చేసిన సీసీఎస్ పెన్షన్ నియమాలు 1972, 2021, 2023 నిబంధనలకు చట్టబద్ధమైన రక్షణ లభిస్తుంది. ఈ చట్టం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల పెన్షనర్లలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. అందుకే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు.
ప్రస్తుతం ఎనిమిదో వేతన సంఘం నిబంధనలో పాత పెన్షనర్ల పెన్షన్ల సవరణ ప్రస్తావనను సరిగ్గా చేర్చలేదని, అందుకు వ్యాలిడేషన్ చట్టమే కారణమని పెన్షనర్లు భయపడుతున్నారు. ఒకే హోదాలో రిటైర్ అయినప్పటికీ ఒక నిర్దిష్ట తేదీ కంటే ముందు రిటైర్ అయిన వారికి భవిష్యత్తులో వచ్చే వేతన సవరణ (పీఆర్సీ), కరువు భత్యం (డీఆర్) ప్రయోజనాలు నిలిచిపోయే ప్రమాదం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి రాష్ర్టాల్లోని వివిధ జిల్లాల వరకు పెన్షనర్ల సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ చైర్‌పర్సన్‌గా ఉన్న కేంద్ర ఎనిమిదో వేతన సంఘం పరిధిపై, పెన్షనర్ల వేతన సవరణలపై పెన్షన్ రూల్స్ వ్యాలిడేషన్ యాక్ట్ -2025 ప్రభావం చూపనున్నది. గత 5వ, 6వ, 7వ వేతన సంఘాల నిబంధనల్లో పాత పెన్షనర్ల పెన్షన్ల సవరణ, పాత, కొత్త పెన్షనర్ల సామర్థ్యం మధ్య సమానత్వాన్ని కాపాడడం అనే వాఖ్యాలు స్పష్టంగా ఉండేవి. కానీ, 2025 నవంబర్ 3న కేంద్రం నోటిఫై చేసిన 8వ వేతన సంఘం నిబంధనలలో కేవలం ‘పెన్షన్, ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాల నిర్మాణాన్ని నియంత్రించే సూత్రాలను పరిశీలించడం’ అని మాత్రమే పేర్కొన్నారు. వ్యాలిడేషన్ యాక్ట్-2025 ప్రకారం, ఒక పెన్షనర్ ఏ తేదీన రిటైర్ అయ్యారనే అంశాన్ని బట్టి వారిని వేర్వేరు వర్గాలుగా విభజించే హక్కు ప్రభుత్వానికి లభించింది.
దీనివల్ల, 8వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేసేటప్పుడు 1 జనవరి 2026 కంటే ముందు రిటైర్ అయిన వారికి, ఆ తర్వాత రిటైర్ అయ్యే వారికి వేర్వేరు ఫిట్మెంట్ ఫ్యాక్టర్లు లేదా సవరణ సూత్రాలను ప్రభుత్వం వర్తింపజేసే ప్రమాదం ఉన్నది. గతంలో ఇలాంటి విభజనను కోర్టులు కొట్టివేసే అవకాశం ఉండేది, కానీ కొత్త చట్టం వల్ల 8వ వేతన సంఘం సిఫారసుల్లో ప్రభుత్వం ఎలాంటి వ్యత్యాసాలు చూపించినా దానికి చట్టబద్ధమైన రక్షణ లభిస్తుంది.
పెన్షన్ అనేది ప్రభుత్వ దాతృత్వం కాదని, అది ఉద్యోగి హక్కు అని భావించే ఉద్యోగ సంఘాలు.. ఈ చట్టం వల్ల సీనియర్ సిటిజన్ల ఆర్థిక భద్రత, సమానత్వ హక్కు దెబ్బతింటుందని దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. రైల్వే ఉద్యోగుల పెన్షన్లు కేంద్ర ప్రభుత్వ ‘సంచిత నిధి’ నుంచి చెల్లిస్తారు. కనుక ఈ చట్టం వీరికి వర్తిస్తుంది. భవిష్యత్తులో వేతన సంఘాలు వచ్చేటప్పుడు, పాత పెన్షనర్లకు, కొత్త పెన్షనర్లకు వేర్వేరు నిబంధనలు లేదా పెన్షన్ సవరణ ఫార్ములాలు వర్తింపజేసే వీలుంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం నుంచి బీఎస్ఎన్ఎల్లోకి విలీనమై, సీసీఎస్ రూల్స్ కింద కేంద్ర సంచిత నిధి నుండి పెన్షన్ పొందుతున్న అబ్సార్డ్స్ ఉద్యోగులపై ఇది ప్రభావం చూపుతుంది. రక్షణ రంగానికి ఇప్పటికే వన్ ర్యాంక్-వన్ పెన్షన్ వంటి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఫైనాన్స్ యాక్ట్ 2025 ప్రస్తుత డిఫెన్స్ పెన్షన్ నిర్మాణాన్ని నేరుగా మార్చదు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వ్యాలిడేషన్ యాక్ట్ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ సీసీఎస్ రూల్స్, 1972/2021 కిందకి వచ్చే పెన్షనర్లకు మాత్రమే ఉద్దేశించినది. సాధారణ సివిల్ పెన్షన్ నిబంధనల ఆధారంగా పెన్షన్ పొందే డిఫెన్స్ సివిలియన్లపై ఈ వర్గీకరణ నిబంధనల ప్రభావం ఉండే అవకాశం ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత పెన్షన్ రూల్స్ కలిగి ఉంటాయి. కానీ, సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర వేతన సంఘం సిఫారసులను అమలు చేస్తాయి. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం తరహాలోనే రిటైర్మెంట్ తేదీ ఆధారంగా పెన్షన్ సవరణల్లో మార్పులు చేస్తే అప్పుడు రాష్ట్ర పెన్షనర్లపై ప్రభావం పడుతుంది.
‘అందరు పెన్షనర్లు ఒకటే’ అని కోర్టుల ద్వారా సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వ చట్టం హరిస్తున్నది. ప్రభుత్వం రిటైర్మెంట్ తేదీ ఆధారంగా పెన్షనర్లను విభజించవచ్చు. 8వ వేతన సంఘం పరిధిలో పెన్షన్ సవరణలు చేసేటప్పుడు ఈ వ్యాలిడేషన్ పాలసీని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నది. దీనిపై పెన్షనర్ల సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. పార్లమెంట్లో ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం.. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ మొత్తానికి ఎలాంటి కోతా పడదు. డియర్నెస్ రిలీఫ్ అలవెన్సులు యథావిధిగా కొనసాగుతాయి. ఈ చట్టం సమానత్వ హక్కును దెబ్బతీస్తున్నదని, రాజ్యాంగ విరుద్ధమని పెన్షనర్లు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీర్ఘకాల ప్రజాసేవకు వాయిదా వేతనమే పెన్షన్ అని పలు తీర్పులలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1983లో పెన్షన్ ప్రభుత్వ ఇష్టానుసారం ఇచ్చే బహుమతి కాదు, ఉద్యోగి సంపాదించిన విలువైన హక్కు అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం రిటైర్మెంట్ తేదీ ఆధారంగా పెన్షనర్లను విభజించడం చెల్లదు. 1971లో పెన్షన్ అనేది ఆస్తి హక్కు. పెన్షన్‌కు ఆర్టికల్ 300ఏ కింద రాజ్యాంగ రక్షణ ఉన్నది. కాబట్టి పెన్షన్ వాయిదా వేతనం, చట్టబద్ధ, రాజ్యాంగ హక్కు, ప్రజా సేవకు గుర్తింపు, సంక్షేమ రాజ్యంలో సామాజిక భద్రతలో ముఖ్య భాగం అని కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో 8వ పీఆర్సీ నిబంధనలు సవరించి, ప్రస్తుతం ఉన్న పెన్షనర్లందరి పెన్షన్ రివిజన్‌కు చేర్చాలని, బీఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు 01-01-2017 నుంచి పెన్షన్ రివిజన్ మంజూరు చేయాలని, బ్యాంక్, కోల్, ఇన్సూరెన్స్ తదితర ప్రభుత్వ రంగాల పెన్షనర్లకు పెన్షన్ అప్డేషన్ కల్పించాలని, స్వయం ప్రతిపత్తి సంస్థల పెన్షనర్లను కేంద్ర వేతన సవరణ, సీజీహెచ్ఎస్ పరిధిలోకి తీసుకురావాలని, ఇంకా పలు డిమాండ్లతో ఈ నెల 17, 18 తేదీల్లో దేశవ్యాప్తంగా ఆందోళనలు పెద్దఎత్తున జరిగాయి. నేడు కూడా పలు చోట్ల ధర్నాలు జరగనున్నాయి.
దీర్ఘకాల ప్రజాసేవకు వాయిదా వేతనమే పెన్షన్ అని పలు తీర్పులలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1983లో పెన్షన్ ప్రభుత్వ ఇష్టానుసారం ఇచ్చే బహుమతి కాదు, ఉద్యోగి సంపాదించిన విలువైన హక్కు అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం రిటైర్మెంట్ తేదీ ఆధారంగా పెన్షనర్లను విభజించడం చెల్లదు. 1971లో పెన్షన్ అనేది ఆస్తి హక్కు. పెన్షన్‌కు ఆర్టికల్ 300ఏ కింద రాజ్యాంగ రక్షణ ఉన్నది. కాబట్టి పెన్షన్ వాయిదా వేతనం, చట్టబద్ధ, రాజ్యాంగ హక్కు, ప్రజా సేవకు గుర్తింపు, సంక్షేమ రాజ్యంలో సామాజిక భద్రతలో ముఖ్య భాగం అని కోర్టు చెప్పింది.