హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : ఏఐ సాంకేతికత భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, పాలన, విద్య, వైద్య రంగాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నదని ఐటీ శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. నవీన ప్రపంచానికి ఏఐ సమగ్ర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు దిశానిర్దేశం చేస్తాయని చెప్పారు. గ్లోబల్ పరిశోధకులు, విధాన రూపకర్తలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌ల ఏర్పాటు అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, టెక్నాలజీ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, పాలసీ మేకర్లను ఒకే వేదికపైకి తేవాలనే లక్ష్యంతో రూపొందించిన ‘ఏఐ హబ్ స్విట్జర్లాండ్’ సమగ్ర డిజిటల్ ప్లాట్‌ఫామ్ అధికారిక వెబ్‌సైట్‌ను బుధవారం హైదరాబాద్‌లో కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగంలో ప్రతిరోజూ వేలాది కొత్త సాధనలు, పరిశోధనలు, నియంత్రణ మార్గదర్శకాలు వెలువడుతున్నాయని చెప్పారు. దీనివల్ల ఏర్పడుతున్న సమాచార గందరగోళానికి పరిషారం చూపేలా ఆవిష్కరణలు, కొత్త ఏఐ ఫ్లాట్‌ఫారాలు రావాలని ఆకాంక్షించారు.
టెక్నాలజీ ఆవిషరణలు ఎంత వేగంగా వస్తున్నాయో, వాటికి అనుగుణంగా నియంత్రణ వ్యవస్థలు కూడా రావాలని ఏఐ హబ్ స్విట్జర్లాండ్ వెబ్సైట్ వ్యవస్థాపకుడు శ్రీధర్గాండే తెలిపారు. ఆవిషరణలు, నియంత్రణకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఏఐ హబ్ స్విట్జర్లాండ్ సాంకేతిక రిఫరెన్స్ లేయర్‌ను, ఏఐ పాలసీ ల్యాబ్స్ గవర్నెన్స్ అనుసంధానం ద్వారా సంస్థలు, పరిశోధకులు, పాలసీ మేకర్లు సమర్థవంతంగా ఏఐను వినియోగించుకునేలా చేయాలనేదే తమ ఉద్దేశమని వెల్లడించారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్ పూర్తి వివరాలను ai-hub.host వెబ్సైట్లో పరిశీలించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీఆర్ఎస్ ఎన్నారై సెల్ అధ్యక్షుడు మహేశ్ బిగాల, ఏఐ రంగ ప్రముఖులు, అమెరికా, బ్రిటన్ ఎన్నారైలు పాల్గొన్నారు.