కరీంనగర్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/రాజన్న సిరిసిల్ల(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ హత్యా రాజకీయాలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజకీయంగా తమను ఎదురోవాలంటే ఎన్నికల్లో తలపడాలని సూచించారు. ఇంకా కోపం ఉంటే కేసులు పెట్టుకోవాలని, అంతేకానీ స్వార్థ రాజకీయాల కోసం సామాన్య ప్రజలను బలి పశువులుగా మార్చాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్‌కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటకు తేవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని స్పష్టంచేశారు. బుధవారం ఆయన వెంకటేశం కుటుంబాన్ని పరామర్శించారు. వెంకటేశంపై విషప్రయోగం చేసి, హతమార్చిన తీరుపై కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు.
అతని భార్య, తల్లి, కుమార్తెను ఓదార్చారు. ఈ సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం కేటీఆర్ అక్కడే మీడియాతో మాట్లాడారు. తాను దాదాపు 20 ఏం డ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఇంత దిగజారిన, ఇంత దరిద్రపుగొట్టు రాజకీయాన్ని ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. వెంకటేశం మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఘటన వెనుక అసలు కారణాలు, బాధ్యులు, సూత్రధారులు ఎవరైనా సరే వెలుగులోకి తేవాలని పోలీసులకు సూచించారు. ‘నాన్న రాలేదని బాధపడుతూ వెంకటేశం కుమార్తె మూడు రోజులుగా తినలేదని చెప్తుంటే మనసున్న ఏ మనిషికైనా కండ్లల్లో నీళ్లు తిరగక, గుండె ద్రవించక మానదు’ అంటూ కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటనలో ఇద్దరిని రిమాండ్‌కు పంపించారని, మిగిలిన ముగ్గురికి బెయిల్ రావడం పై అనుమానం వ్యక్తంచేశారు. పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా ఉండాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకూడదని సూచించారు. ఈ విషయంలో స్థానిక కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
తాను కేవలం సిరిసిల్ల ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా, బాధిత కుటుంబానికి మాట ఇచ్చిన సోదరుడిగా బాధ్యత తీసుకుంటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. వెంకటేశం కుమార్తె ప్రస్తుతం 11 ఏండ్ల వయసులో, ఐదోతరగతి చదువుతున్నట్టు తెలిపారు. ఆ బాలిక పేరిట రూ.3 లక్షలు డిపాజిట్ చేసినట్టు చెప్పారు. ఆమె మేజర్ అయిన తర్వాత ఆ మొత్తం అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. బాలిక చదువుకు ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ తరఫున కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయాన్ని అందించినట్టు చెప్పారు. వెంకటేశం కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఉన్నారు.