హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 29న ఢిల్లీ వెళ్లనున్నారు. అధికారం చేపట్టాక ఆయన 78వసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఓట్ చోరీ అంశంపై కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సీడబ్ల్యూసీ ప్రత్యేక సమావేశానికి సీఎం హాజరవుతున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘సర్’ విషయంలో ఎన్నికల కమిషన్ తీరుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఆ పార్టీ ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ ఢిల్లీలో పోరుబాట పట్టారు.
ఈ క్రమంలో ‘సర్’, ఓట్ల చోరీ తదితర అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే అధ్యక్షత వహించనున్న ఈ సమావేశంలో పాల్గొనేందుకు 29వ తేదీ ఉదయం సీఎం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక లేఖను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తాజాగా విడుదల చేశారు.