YS Jagan | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చంద్రబాబు మనిషని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు కోసమే పనిచేస్తున్నదని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం కడప జిల్లాలో మాట్లాడారు. చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్కు ఓటేస్తే టీడీపీని గెలిపించడమేనని చెప్పారు. గత ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాని కాంగ్రెస్కు ఎవరైనా ఓటు వేస్తారా అని ప్రశ్నించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో టీడీపీ ఎలా జతకట్టిందని నిలదీశారు.
మైనార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పిన ఎన్డీయేలో చంద్రబాబు ఎలా కొనసాగుతున్నారని మండిపడ్డారు. పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్తో బాబు కాపురం చేస్తారని విమర్శించారు. తెలుగుదేశాన్ని గెలిపించేందుకు.. ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రరాష్ట్రంలో రంగప్రవేశం చేసిందని అన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే.. మన కండ్లను మనం పొడుచుకున్నట్టేనని హెచ్చరించారు.