ప్లేఆఫ్స్ ఆశలు అడుగంటినా ‘పోరాడితే పోయేదేమీ లేదు’ అన్న సూత్రాన్ని తూ..చా తప్పకుండా పాటించిన గుజరాత్ జెయింట్స్.. మోతేరాలో దుమ్మురేపే ప్రదర్శనతో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు షాకిచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన జెయింట్స్‌కు గిల్, సాయి..చెన్నై బౌలర్లపై ఆకలిగొన్న సింహాల్లా విరుచుకుపడి ఆ జట్టు ఎదుట కొండంత లక్ష్యాన్ని నిలిపారు. ఛేదనలో చెన్నై ఆరంభంలోనే చేతులెత్తేసి ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉన్న ఆ జట్టు రెంటికి రెండూ నెగ్గితేనే నాకౌట్ అవకాశాలుంటాయి.
IPL | అహ్మదాబాద్: ప్లేఆఫ్స్ రేసులో లేకున్నా గుజరాత్ జెయింట్స్ సొంత ఇలాఖాలో మాత్రం ఆకాశమే హద్దుగా రెచ్చిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను దెబ్బతీస్తూ ఆ జట్టును 35 పరుగుల తేడాతో ఓడించింది. దొరికిన బంతిని దొరికినట్టు బాదిన ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ శుభ్‌మన్ గిల్ (55 బంతుల్లో 104, 9 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (51 బంతుల్లో 103, 5 ఫోర్లు, 7 సిక్సర్లు) రికార్డు భాగస్వామ్యం (210)తో మోతేరాను మోతెక్కించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 20 ఓవర్లలో 231/3 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ ఛేదనలో చెన్నై పోరాడినా ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులే చేయగలిగింది. డారిల్ మిచెల్ (34 బంతుల్లో 63, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), మోయిన్ అలీ (36 బంతుల్లో 56, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడినా కీలక సమయంలో వికెట్లు కోల్పోయి ఓటమి వైపున నిలిచింది.
లేక లేక టాస్ గెలిచిన చెన్నై సారథికి ఆ ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. గుజరాత్ ఓపెనింగ్ ద్వయం గిల్-సాయి తొలి ఓవర్ నుంచే ధాటిగా ఆడారు. ఈ ఇద్దరి దూకుడుతో జెయింట్స్ 5.3 ఓవర్లలోనే 50 పరుగులు పూర్తిచేసింది. పవర్ ప్లే తర్వాత రెండు ఓవర్ల పాటు స్కోరువేగం కాస్త నెమ్మదించినా అది తుఫాను ముందు ప్రశాంతతే. జడేజా 9వ ఓవర్లో 4, 6 తో అర్ధ సెంచరీ పూర్తిచేసిన సాయి ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిమర్జిత్ 11వ ఓవర్లో 4, 6, 6 సాధించిన అతడు.. శాంట్నర్ 13వ ఓవర్లో ఫోర్, సిక్సర్‌తో 90లలోకి వచ్చాడు. 25 బంతుల్లో అర్ధ శతకం సాధించిన గిల్ కూడా సాయి దూకుడుకు తోడయ్యాడు. మిచెల్ 14వ ఓవర్లో 3 సిక్సర్లతో గేర్ మార్చడంతో గుజరాత్ స్కోరు వాయువేగాన్ని తలపించింది. 12.4 ఓవర్లకే ఆ జట్టు 150 మార్కు దాటింది. సిమర్జిత్ 17వ ఓవర్లో రెండో బంతిని స్కేర్ లెగ్ దిశగా మళ్లించిన గిల్ 50 బంతుల్లో శతకాన్ని పూర్తిచేశాడు. ఇదే ఓవర్లో ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచిన సాయి సైతం సెంచరీ సాధించాడు. ఐపీఎల్లో గిల్‌కు ఇది ఆరో శతకం కాగా సాయికి మొదటిది. తుషార్ 18వ ఓవర్లో ఈ ఇద్దరూ ఔట్ అయ్యారు. ఆఖర్లో మిల్లర్ (16) ఆశించిన స్థాయిలో హిట్టింగ్ చేయలేదు.
కొండంత లక్ష్యాన్ని కరిగించేందుకు క్రీజులోకి వచ్చిన చెన్నై బ్యాటర్లు ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి తడబడ్డారు. తొలి ఓవర్లోనే రచిన్ (1) రనౌట్ కాగా రహానే (1) మళ్లీ విఫలమయ్యాడు. రుతురాజ్ (0) క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద రషీద్ ఖాన్ అద్భుతంగా అందుకోవడంతో 3 ఓవర్లకు చెన్నై స్కోరు 10/3గా ఉంది. ఈ క్రమంలో మిచెల్, అలీ చెన్నైని ఆదుకున్నారు. ఈ జోడీ వికెట్ల పతనాన్ని అడ్డుకోవడమే గాక గుజరాత్ బౌలర్లను దీటుగా ఎదుర్కుని 57 బంతుల్లోనే 109 పరుగులు జోడించింది. 27 బంతుల్లోనే మిచెల్ ఫిఫ్టీ సాధించాడు. నూర్ అహ్మద్ 11వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టిన మోయిన్ అలీ చెన్నైని పోటీలోకి తెచ్చాడు. కానీ మోహిత్ శర్మ వరుస ఓవర్లలో ఈ ఇద్దరినీ పెవిలియన్‌కు పంపడమే గాక సీఎస్కే భారీ ఆశలు పెట్టుకున్న దూబే (21)ను ఔట్ చేసి ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. జడేజా (18), శాంట్నర్‌ను రషీద్ ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. ధోనీ (11 బంతుల్లో 26 నాటౌట్, 1 ఫోర్, 3 సిక్సర్లు) ఆఖరి దాకా క్రీజులో ఉన్నా అతడి మెరుపులు చెన్నై ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాయి.
1 తొలి వికెట్‌కు ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం. డికాక్-రాహుల్ (210) రికార్డును గిల్-సాయి సమం చేశారు. ఓవరాల్‌గా ఐపీఎల్లో ఏ వికెట్‌కు అయినా ఇది మూడో అత్యుత్తమ పార్ట్నర్షిప్.
2 ఒక మ్యాచ్‌లో ఇద్దరు భారత ఓపెనర్లు సెంచరీలు చేయడం ఈ లీగ్‌లో ఇదే ప్రథమం.
3 ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఐపీఎల్లో ఇది మూడోసారి. గతంలో ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ ఈ ఘనతలు సాధించాయి.
గుజరాత్: 20 ఓవర్లలో 231/3 (గిల్ 104, సాయి 103, తుషార్ 2/33)
చెన్నై: 20 ఓవర్లలో 196/8 (మిచెల్ 63, అలీ 56, మోహిత్ 3/31, రషీద్ 2/38)