Singareni Tenders | సింగరేణి టెండర్లలో సిండికేట్ గుట్టు రట్టయింది. కొత్త నిబంధనల ముసుగులో సాగించిన అక్రమాల దందా బట్టబయలైంది. బీఆర్ఎస్ నిరంతర పోరాటంతో దిగొచ్చిన సర్కార్ తాజాగా ఎస్సార్పీ(శ్రీరాంపూర్) ఓపెన్‌కాస్ట్-2 ఫైనాన్షియల్ బిడ్‌ను మైనస్ 12శాతానికి సుశీ హైటెక్ ప్రాజెక్ట్స్ కంపెనీకి కట్టబెట్టింది.
ఎట్టకేలకు సిండికేట్ ప్రమేయం లేకుండా పారదర్శకంగా బిడ్లు తెరవడం వల్లే ఈ టెండర్ ఏకంగా మైనస్ 12 శాతానికి క్లోజ్ అయ్యింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కొత్త నిబంధనలు తెచ్చాక ఫైనాన్షియల్ బిడ్ మైనస్‌కు ఖరారు కావడం ఇదే మొదటిసారి. దీంతో రెండేండ్ల పాలనలో సింగరేణి టెండర్లను +7 నుంచి +10 శాతానికి కట్టబెట్టి కాంగ్రెస్ సర్కార్ ఎంత ప్రజాధనాన్ని లూటీ చేసిందో తేల్చాల్సి ఉన్నదనే డిమాండ్ వ్యక్తమవుతున్నది.
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణి పరిరక్షణ కోసం గత బీఆర్ఎస్ సర్కార్ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా టెండర్ల ఖరారులో పారదర్శక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఆన్లైన్ ద్వారా ప్రక్రియను నిర్వహించి అర్హులకు అది కూడా మైనస్ 9శాతం నుంచి 20శాతం వరకు ఖరారు చేసింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సింగరేణిని కొల్లగొట్టేందుకు స్కెచ్ వేసింది. ముఖ్యంగా కోలిండియా సహా దేశంలో మరెక్కడా లేనివిధంగా సైట్ విజిట్ సర్టిఫికెట్ సిస్టంను అమల్లోకి తెచ్చింది.
తద్వారా అధికార పార్టీ ముఖ్య నేత సమీప బంధువులకు కట్టబెట్టే కుట్రలకు తెరలేపింది. టెండర్ దాఖలు చేయబోయే కాంట్రాక్టర్లు సంబంధిత గనులను సందర్శించిన తర్వాత సింగరేణి అధికారుల ద్వారా సైట్ విజిట్ సర్టిఫికెట్ పొందాలనే నిబంధన పెట్టింది. దీంతో టెండర్లు దాఖలు చేయబోయే కాంట్రాక్టర్ల వివరాలు తెలిసేలా ఈ విధానాన్ని తెచ్చింది. అర్హత కలిగిన కాంట్రాక్టర్ల వివరాలు తెలిసిన వెంటనే అధికార పార్టీ ముఖ్యనేత బంధువు రంగంలోకి దిగుతాడు. వారిని తన అనుచరుల ద్వారా నయానో భయానో బెదిరించి దారికి తెచ్చుకొనేవాడని ఆరోపణలు వెల్లువెత్తాయి.
సదరు కాంట్రాక్టర్లతో సిండికేట్‌గా మారి తనకో, తన అనుయాయులకో టెండర్లు దక్కేలా స్కెచ్ వేసి సక్సెస్ సాధించేవాడని తెలిసింది. ఈ క్రమంలో సింగరేణికి సంబంధించిన వందల కోట్లను కొల్లగొట్టినట్టు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఆరోపించడమే గాక పక్కా ఆధారాలను కూడా బహిర్గతం చేసింది. ముఖ్యంగా నైనీ బ్లాక్ టెండర్ల వ్యవహారంలో భారీగా అక్రమాలకు తెరలేపారని ఆధారాలతో బట్టబయలు చేసింది. దీంతో అధికార కాంగ్రెస్ సర్కార్ ఆత్మరక్షణలో పడింది. ఈ క్రమంలో శ్రీరాంపూర్ ఎస్సార్పీ ఓపెన్‌కాస్ట్-2 ఫైనాన్షియల్ బిడ్ మైనస్ 12శాతానికి సుశీ కంపెనీకి కట్టబెట్టింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సైట్ విజిట్ సర్టిఫికెట్ సిస్టం తెచ్చి అనేక టెండర్లను తన అనుయాయులైన బిడ్డర్లకు కట్టబెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు 11 కంపెనీలకు వేలాది కోట్ల కాంట్రాక్టులను గరిష్ఠంగా +10.35 శాతానికి కట్టబెట్టారు. ఈ రూపంలో వందలాది కోట్లను కమీషన్ల రూపంలో దండుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎస్సార్పీ ఓపెన్‌కాస్ట్-2 ఫైనాన్షియల్ బిడ్ మైనస్ 12శాతానికి ఖరారైన నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల కాంట్రాక్టుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు తెలుస్తున్నది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది.
హైదరాబాద్, మార్చి 8(నమస్తే తెలంగాణ) : సింగరేణిలో అధికార పార్టీ అసలు రంగు బయటపడ్డదని, రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో +7 నుంచి +10 శాతానికి కట్టబెట్టి ప్రజాధనాన్ని లూటీ చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు సంచలన ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ వచ్చిన తర్వాత, కొత్త నిబంధనలు తెచ్చాక మైనస్‌కు ఖరారైన తొలి టెండర్ ఇదేనని ఆదివారం ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. టెండర్ల వివరాలను పోస్ట్ ద్వారా బహిర్గతం చేశారు. టెండర్ల మాటున కాంగ్రెస్ చేస్తున్న అక్రమాలపై బీఆర్ఎస్ సాగించిన పోరాటం ఫలించిందని, ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ ముసుగులో కాంట్రాక్టర్లను రింగ్ చేసి సింగరేణిని ఎలా లూటీ చేస్తున్నారో బీఆర్ఎస్ ప్రజల కండ్లకు కట్టిందని ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ పార్టీ నిరంతర ఒత్తిడికి తలొగ్గి, ఎట్టకేలకు సిండికేట్ ప్రమేయం లేకుండా పారదర్శకంగా బిడ్లు తెరవడంతో మైనస్ 12 శాతానికి క్లోజ్ అయ్యిందని పునరుద్ఘాటించారు.
కాంగ్రెస్ గద్దెనెక్కి తర్వాత సృజన్‌రెడ్డి కనుసన్నల్లో భారీ దోపిడీకి స్కెచ్ వేశారని హరీశ్‌రావు ఆరోపించారు. టెండర్ల పారదర్శకతను దెబ్బతీసేందుకే సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన తెచ్చారని ధ్వజమెత్తారు. ‘ఈ నిబంధన ప్రకారం టెండర్ వేయకముందే కాంట్రాక్టర్ అధికారుల వద్ద సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుందని, టెండర్లు వేసేదెవరో అధికార పార్టీ నాయకులు ముందే తెలుసుకొని బెదిరించి, పోటీలేకుండా చేసి తమకు అనుకూలమైన వారికే టెండర్లు దక్కేలా సిండికేట్ ఏర్పాటు చేసేందుకు ఇది బ్రహ్మాస్త్రంగా మారిందని విమర్శించారు.
కాంగ్రెస్ సర్కార్ కమీషన్ల కక్కుర్తితో బొగ్గు ఉత్పత్తి పడిపోయి జెన్కోలో ఉత్పత్తి తగ్గించి అనివార్యంగా మార్కెట్లో అధిక ధరలకు కరెంట్ కొనుగోలు చేయాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. ఫలితంగా జెన్కోకు అపార నష్టం జరిగి, విద్యుత్ చార్జీల రూపంలో సామాన్యుల నెత్తిపై పడుతుందని పేర్కొన్నారు. రెండేండ్ల పాలనలో జరిగిన కాంట్రాక్టర్ల సిండికేట్ బాగోతంపై విచారణ జరిపించాలని, సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిని కమీషన్లకు అడ్డాగా మారిస్తే బీఆర్ఎస్ ఊరుకోదని హెచ్చరించారు.