డార్విన్: రెండు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్.. ఆతిథ్య జట్టుతో తొలి టెస్టులో అంచనాలకు మించి రాణిస్తున్నది. తొలి ఇన్నింగ్స్‌లో కంగారూలను 198 రన్స్‌కే ఆలౌట్ చేసిన బంగ్లా.. రెండో రోజు తంజిద్ హసన్ (197 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 101) శతకానికి తోడు కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ (84), మోమినుల్ హక్ (49) రాణించడంతో ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 351 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా గడ్డపై ఓ బంగ్లా బ్యాటర్ టెస్టుల్లో సెంచరీ చేయడం ఇదే ప్రథమం. ఓవర్ నైట్ స్కోరు 96/1తో ఆట కొనసాగించిన ఆ జట్టును అడ్డుకోవడంలో ఆసీస్ బౌలర్లు విఫలమయ్యారు. తంజిద్ రెండో వికెట్‌కు మోమినుల్తో 102, మూడో వికెట్‌కు నజ్ముల్‌తో 93 పరుగులు జోడించి బంగ్లాను తిరుగులేని స్థితిలో నిలిపాడు. చేతిలో మరో నాలుగు వికెట్లుండగా ఇప్పటికే పర్యాటక జట్టు 153 పరుగుల ఆధిక్యంలో ఉంది. మెహదీ హసన్ మిరాజ్ (32 బ్యాటింగ్), హసన్ మహ్మద్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.