భూత్పూర్, ఆగస్టు 14 : హైదరాబాద్ నుంచి తమిళనాడులోని అరుణాచలం ఆలయానికి వెళ్తుండగా పట్టణ కేంద్రానికి సమీపంలో 44వ జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి 12గంటల సమయంలో శ్రీకృష్ణ ట్రావెల్ ప్రైవేట్ బస్సు వేగంగా వచ్చి బోల్తా పడిన ఘటన స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దైవదర్శనార్థం వెళ్తూ బస్సులో అం దరూ నిద్రిస్తున్న సమయంలో డ్రైవర్ రామాంజనేయులు నిర్లక్ష్యంగా వ్యవరించడంతో బస్సు బోల్తాపడి దాదాపు 50 ఫీట్ల దూరం రోడ్డుపై వె ళ్లింది.
దీంతో బస్సులో ఎడమ వైపున కూర్చున్న వాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. బస్సులో 36మంది ఉండగా 16 మందికి గాయాలయ్యా యి. ఇందులో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యా యి. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాకు చెందిన లక్ష్మీదుర్గకు ఎడమ చేయి, సాయితేజకు కుడి చేయి, మహేశ్వరీ కుడిచేయి, శరణప్ప ఎడమ చేయి కోల్పోయినట్లు ఎస్సై నాగన్న తెలిపారు. బస్సుబోల్తా అనే విషయం తెలిసిన వెంటనే ఎస్పీ జానకి, భూత్పూర్ సీఐ రామకృష్ణ, ఎస్సై నాగన్న అప్పటికప్పుడే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
వెంటనే పరిస్థితులను పరిశీలించి రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సును జేసీబీ సాయం తో పక్కకు తప్పించారు. గాయపడ్డ వారిని 4 అంబులెన్స్ వాహనాలలో చికి త్స నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. పోలీస్స్టేషన్ సమీపంలో ఘటన జరగడంతో పెట్రోలింగ్ పోలీసుల సమాచారం మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం హుటాహుటిన తరలి వచ్చారని పలువురు అనుకుంటున్నారు. తీవ్రంగా గాయపడ్డ దుర్గా, సాయితేజ, మహేశ్వరి, శరణప్పలను జిల్లా వైద్యుల సలహా మేరకు హైదరాబాద్ దవాఖానకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలుగలేదు.