తెలంగాణ సంస్కృతికి, అచ్చమైన పల్లె రుచులకు పెద్దపీట వేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ థియేటర్స్’ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం వెండితెరపై విజువల్ వండర్స్‌ను ఆస్వాదించడమే కాకుండా, తమ థియేటర్లలోనే కమ్మనైన తెలంగాణ పిండివంటలను ఆస్వాదించే సరికొత్త అనుభూతిని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఇందులో భాగంగా, తెలంగాణ ప్రజల అత్యంత ఇష్టమైన సాంప్రదాయ వంటకం ‘సర్వపిండి’ని ప్రత్యేకంగా మైత్రీ విమల్ మరియు మైత్రీ శివగంగ థియేటర్లలో అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
త్వరలో విడుదల కానున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రదర్శన సమయంలో, ఇంటర్వెల్ బ్రేక్‌లో ఈ సర్వపిండి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సినిమా చూస్తూ తెలంగాణ అచ్చమైన రుచిని ఆస్వాదించే ఈ సరికొత్త అనుభూతి సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకోనుంది. ఈ అరుదైన అవకాశం వెనుక సోషల్ మీడియాలో ఎంతో ఆదరణ పొందిన ‘బామ్మాస్టోరిస్’కు చెందిన 77 ఏళ్ల బామ్మ కృషి ఉంది. తన చేతివంటతో ఎంతో ప్రేమగా తయారు చేస్తున్న ఈ సర్వపిండి, ఒక చిన్న టిఫిన్ సెంటర్ నుంచి ఏకంగా తెలంగాణలోని బిగ్ స్క్రీన్ల వరకు ప్రయాణించడం విశేషం.