RIMS Hospital | ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో ప్రమాదంలో చిన్నారుల మృతుల సంఖ్య ఐదుకు చేరింది. మరో 20 మంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిన్న(మంగళవారం) హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్‌కు తరలిస్తుండా ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అయితే విషయం బయటకు రాకుండా రిమ్స్ యాజమాన్యం దాచి పెట్టింది. చికిత్స పొందుతున్న మరోచిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.
కాగా, ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో ఓ పసికందు మరణించింది. చిన్నపిల్లల వార్డులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఏసీ పేలడంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే వార్డులోని చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. వార్డులో సుమారు 30 మంది చిన్నారులు ఉండగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఈ ఘటనతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.