బర్మింగ్‌హామ్: భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ప్రతిష్టాత్మక ఆల్‌ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో టైటిల్ నెగ్గాలన్న అతడి ఆశలు మరోసారి అడియాసలే అయ్యాయి. 2022లో ఫైనల్ చేరి తుది మెట్టు వద్ద తడబడిన లక్ష్య.. ఆదివారం ముగిసిన 2026 ఎడిషన్ ఫైనల్లోనూ ఓడి రన్నరప్‌గా నిలిచాడు.
ఫైనల్లో 24 ఏండ్ల లక్ష్య.. 15-21, 20-22తో చైనీస్ తైపీ ఆటగాడు లిన్ చున్-యి చేతిలో ఓడిపోయాడు. టోర్నీ ఆసాంతం రాణించిన సేన్.. 57 నిమిషాల పాటు జరిగిన తుదిపోరులో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ ఓటమితో ప్రకాశ్ పదుకునే (1980), పుల్లెల గోపీచంద్ (2001) తర్వాత ఆల్‌ఇంగ్లండ్ గెలిచిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాలనుకున్న సేన్‌కు రెండోసారీ నిరాశ తప్పలేదు. కాగా చైనీస్ తైపీ నుంచి ఈ టైటిల్ గెలిచిన తొలి ఆటగాడిగా లిన్ రికార్డులకెక్కాడు.