మెదక్ అర్బన్, జూలై 26: మెదక్ జిల్లా మెదక్-రామాయంపేట రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో చిరుత మృతిచెందింది. ఆదివారం మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలంలోని గంగాపూర్ రాజేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని రోడ్డుపై ప్రమాదం జరిగింది. గంగాపూర్ శివారులో అటవీ ప్రాంతం ఉండడంతో చిరుత రోడ్డు పైకి వచ్చినట్లు అటవీశాఖ అధికారు లు తెలిపారు. అటవీలో నీటి సౌకర్యం లేక తాగునీటి కోసం రోడ్డు పైకి రావడంతో గుర్తు తెలియ ని వాహనం ఢీకొని ప్రమాదం జరిగి ఉంటుందని తెలిపారు.
గంగాపూర్ చౌరస్తా సమీపంలో చెరువు ఉండటంతో అక్కడ నీటి కోసం వచ్చిన చిరుత మృతి చెందినట్లు పలువురు తెలిపారు. ఈ విష యం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ప్రమాద స్థలానికి చేరుకొని మృతిపై విచారణ చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిరుత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రామాయంపేట మండలంలోని అక్కన్నపేట అర్బన్ అటవీ పార్కుకు తరలించారు. మెదక్ డీఎఫ్వో జోజీ చిరుత మృతదేహాన్ని పరిశీలించి మృతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.