జూలూరుపాడు, సెప్టెంబర్ 29 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన ఇంద్రవెల్లి హరిణి దారుణ హత్యకు గురై ఎనిమిది రోజులు గడుస్తున్నా హంతకుడిని పట్టుకోవడంలో పోలీసుల తాత్సారాన్ని నిరసిస్తూ బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జూలూరుపాడు మండల కేంద్రంలోని చండ్రుగొండ క్రాస్ రోడ్డు వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనతో ఆ మార్గంలో రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.
ఈ సందర్భంగా బాధ్యత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఈ నెల 22వ తేదీన హరిణి అత్యంత కిరాతకంగా హత్యకు గురైనప్పటికీ, ఇప్పటివరకు నిందితుడి ఆచూకీ కనిపెట్టక పోవడం శోచనీయమన్నారు. కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఉన్నతాధికారులు ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిందితుడిని పట్టుకుని చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి తక్షణ న్యాయం చేయాలని కోరారు.