మెదక్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మెదక్ జిల్లా రామాయంపేట రెవెన్యూ డివిజన్ ( Revenue division ) ను ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దానిని కొనసాగించడం లేదని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ( Padma Devender Reddy ) ఆరోపించారు. మంగళవారం రామాయంపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
రెవెన్యూ డివిజన్ కోసం దసరా ( Dussehra ) తర్వాత మలి విడత ఉద్యమాన్ని చేపడుతామని వెల్లడించారు. 2023 ఆగస్టులో మెదక్‌లో జరిగిన బహిరంగ సభలో రామాయంపేట రెవెన్యూ డివిజన్‌తో పాటు డిగ్రీ కళాశాల ఏర్పాటును కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. డివిజన్ ఏర్పాటును కేసీఆర్ ప్రకటించిన వెంటనే అప్పటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను ప్రారంభించామని తెలిపారు.
ఇన్చార్జి ఆర్డీవోను నియమించి ఆర్డీవో కార్యాలయాన్ని కూడా ప్రారంభించామని చెప్పారు. మూడు నెలలకే ఇన్చార్జి ఆర్డీవోను తొలగించడంతో డివిజన్ కార్యకలాపాలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. రామాయంపేటతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు పరిపాలనా సేవలు అందుబాటులో ఉండేందుకు రెవెన్యూ డివిజన్ కొనసాగింపు అవసరమని అన్నారు.
ప్రజల ఆకాంక్షను దృష్టిలో ఉంచుకుని పరిపాలనా సౌలభ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బాదే చంద్రం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, నాయకులు సుప్రభాతరావు, ఉమామహేశ్వర్, శ్రీకాంత్ సాగర్, అస్నుద్దీన్, దోమకొండ శ్రీను, గణపురం కృష్ణగౌడ్, రొయ్యల నవీన్, మధ్యల రమేష్, కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.