హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీ ఉన్నతాధికారుల తీరుతో సీవోఈలు, పలు గురుకులాల్లోని విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెరుగైన శిక్షణ పొందలేని దుస్థితి నెలకొన్నది. ఉన్న అనుభవజ్ఞులైన రెగ్యులర్ పురుష సిబ్బందిని జీవో1274 సాకుతో డిప్యుటేషన్‌పై వేరొకచోటికి పంపారు. కానీ మళ్లీ వారిస్థానంలో పార్ట్‌టైమ్ ప్రతిపాదికన పురుష అభ్యర్థులనే నియమించడం సొసైటీ అనాలోచిత నిర్ణయాలకు అద్దం పడుతున్నది. ఉత్తర తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఐఐటీ, నీట్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసేందుకు 2007లో కరీంనగర్ జిల్లా అలుగునూరులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ)ను ఏర్పాటు చేశారు.
గురుకుల వ్యవస్థలోనే మొదటిసారి కో ఎడ్యుకేషన్ విధానాన్ని 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్య వరకు ఇక్కడ నెలకొల్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కో ఎడ్యుకేషన్ ఎత్తివేసింది. సీవోఈ కళాశాలను కేవలం బాలికలకే పరిమితం చేసింది. అనంతరం జీవో 1274, తెలంగాణ సబార్డినేట్ సర్వీసు నిబంధనల విషయంలోని రూల్ 22(ఏ) (3) ప్రకారం బాలికల సూళ్లు, విద్యా సంస్థల్లో అన్ని పోస్టుల్లో మహిళా సిబ్బందిని మాత్రమే భర్తీ చేయాలని నిర్దేశిస్తుంది.
ఆ జీవో అమలును సాకుగా చూపుతూ గతంలో రాష్ట్రవ్యాప్తంగా బాలికల గురుకులాల్లో విధు లు నిర్వర్తిస్తున్న 57మంది పురుష సిబ్బందిని డిప్యుటేషన్‌పై వేరొక గురుకులానికి పంపించారు. అల్గునూర్ సీవోఈలోని దాదాపు 14మంది రెగ్యులర్ పురుష సిబ్బందిని సైతం ఏడాది క్రితం డిప్యుటేషన్‌పై వేరొకచోటికి పంపించారు. సరే వారిస్థానంలో అనుభవజ్ఞులైన, మహిళా సిబ్బందిని నియమించిందా.. అంటే అదీ లేదు.
జీవో పేరిట పంపించిన పురుషసిబ్బంది స్థానంలో పార్ట్‌టైం ప్రాతిపదికన మళ్లీ ప్రైవేట్ విద్యాసంస్థల్లో బోధించే పురుష సిబ్బందినే నియమించడం సర్కార్ తీరుకు అద్దం పడుతున్నది. ప్రభుత్వ నిర్ణయంతో ఏడాది కాలంగా మెరుగైన శిక్షణ అందకుండా పోతున్నదని సీవోఈలోని విద్యార్థినులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అనుభవమే లేని ప్రైవేట్ వ్యక్తులను సబ్జెక్టు ఎక్స్‌పర్ట్‌లుగా నియమించి వారికి లక్ష ల రూపాయల హానరోరియం చెల్లిస్తున్నట్టు చూపుతూ ప్రభుత్వ పెద్దలే లబ్ధి పొందుతున్నారని ఆరోపణలున్నాయి.