The Paradise |నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు సెప్టెంబర్ 23 నుంచే ప్రత్యేక ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. ‘దసరా’ తర్వాత నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదలకు ముందు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారతీయ ప్రేక్షకుల కోసం రూపొందించిన థియేట్రికల్ వెర్షన్లో పలు కీలక సన్నివేశాలు, సంభాషణల్లో మార్పులు చేసినట్టు తెలుస్తుంది.
కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ మండలి ‘ది ప్యారడైజ్’కు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. సెప్టెంబర్ 21న జారీ చేసిన ధ్రువీకరణ పత్రం ప్రకారం సినిమాకు మొత్తం 21 మార్పులు సూచించగా, వాటిని అమలు చేసిన తర్వాత చిత్రానికి అనుమతి లభించింది. తుది నిడివి సుమారు 174 నిమిషాలుగా ఉంది. ఈ మార్పుల్లో హింసాత్మక సన్నివేశాల తీవ్రతను తగ్గించడం, కొన్ని సంభాషణలను మ్యూట్ చేయడం లేదా తొలగించడం, కొన్ని దృశ్యాలను మార్చడం వంటివి ఉన్నాయి. ‘ది ప్యారడైజ్’ కథకు యాక్షన్, హింసాత్మక అంశాలు కీలకంగా ఉంటాయని ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్ ద్వారా అర్థమైంది. అయితే భారతీయ థియేట్రికల్ వెర్షన్‌కు సంబంధించి కొన్ని రక్తపాతం, హింస, హింసాత్మక దృశ్యాల్లో మార్పులు చేయాల్సి వచ్చింది.
కత్తితో దాడి చేసే సన్నివేశాల నిడివిని తగ్గించడంతో పాటు, పలు చోట్ల రక్తస్రావం, హింస, చిత్రహింసలకు సంబంధించిన దృశ్యాలను మార్చినట్లు సెన్సార్ వివరాల్లో పేర్కొనబడింది. కొన్ని అభ్యంతరకర పదాలను మ్యూట్ చేయగా, ఒక పాత్ర చేతిపై ఉన్న అభ్యంతరకర పదంతో కూడిన పచ్చబొట్టును కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా కవర్ చేశారు. అలాగే ‘డీనోటిఫైడ్ ట్రైబ్’ అనే పదప్రయోగాన్ని తొలగించాలని సూచించారు. దేశానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి సంబంధించిన కొన్ని ప్రస్తావనలను కూడా మార్చడం లేదా మ్యూట్ చేయడం జరిగింది. సినిమాలో కాకి, జాతీయ జెండాకు సంబంధించిన ఒక దృశ్యాన్ని కూడా మార్చాలని సెన్సార్ సూచించింది. గర్భిణీ స్త్రీకి సంబంధించిన ఓ సన్నివేశంలో కూడా మార్పులు చేసినట్లు సమాచారం. అయితే భారతీయ వెర్షన్లో సెన్సార్ మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో, ఓవర్సీస్లో మాత్రం ఈ సన్నివేశాలు ఏ మేరకు ఉంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే ఓవర్సీస్ వెర్షన్లో ఈ మార్పులన్నీ లేవని చిత్ర బృందం అధికారికంగా అయితే ప్రకటించలేదు.