Nani |నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ఒక రోజు ముందుగానే, సెప్టెంబర్ 23 రాత్రి ప్రీమియర్ షోలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ప్రీమియర్ షోలకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో.. నాని చేసిన ఓ ప్రత్యేక విజ్ఞప్తి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన కొత్త సినిమాను అభిమానులతో కలిసి హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో చూడాలని ఉందని నాని వెల్లడించారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పోలీసు శాఖ అధికారులను ఆయన సోషల్ మీడియా వేదికగా కోరారు.
సినిమాను ప్రేమించే వ్యక్తిగా, చిన్నప్పటి నుంచి ప్రేక్షకుడిగా సినిమాలను ఆస్వాదించిన తనకు.. థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూడటం ఎంతో ప్రత్యేకమైన అనుభూతి అని నాని తన పోస్టులో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సినిమా అభిమానులకు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని ఆయన అన్నారు. అందుకే సెప్టెంబర్ 23న అక్కడి ఓ థియేటర్లో ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోను సాధారణ ప్రేక్షకులతో కలిసి చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎవరి కోసం ఈ చిత్రాన్ని రూపొందించారో.. అదే ప్రేక్షకులతో కలిసి సినిమా చూడటం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని నాని పేర్కొన్నారు.
తన విజ్ఞప్తిని పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరిన నాని.. అక్కడ అమల్లో ఉన్న అన్ని భద్రతా నిబంధనలు, అవసరమైన మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తామని స్పష్టం చేశారు. భద్రతకే తమ మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ పోలీసు శాఖకు చెందిన అధికారులను నాని తన సామాజిక మాధ్యమ పోస్టులో ప్రస్తావించారు. నాని చేసిన ఈ విజ్ఞప్తి ఇప్పుడు చర్చకు రావడానికి మరో కారణం ఉంది. గతంలో ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సినిమా ప్రీమియర్‌కు అల్లు అర్జున్ హాజరైన సమయంలో భారీగా అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ఆ ఘటన తర్వాత ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రత్యేక ప్రీమియర్ షోలు, హీరోల థియేటర్ సందర్శనల విషయంలో భద్రతా ఏర్పాట్లపై మరింత దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే నాని ఇప్పుడు అదే ప్రాంతంలో సినిమా చూడటానికి అనుమతి కోరడం ఆసక్తికరంగా మారింది. నాని చేసిన విజ్ఞప్తిపై సామాజిక మాధ్యమాల్లో భిన్న స్పందనలు కనిపిస్తున్నాయి. అభిమానులతో కలిసి సినిమా చూడాలనే నాని కోరికను కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు మాత్రం గతంలో చోటుచేసుకున్న ఘటనను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతంలో భారీగా అభిమానులు గుమిగూడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.