AP News : ఏపీలో ఇప్పటికే కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు వాతావరణ విభాగం అధికారులు తుఫాను హెచ్చరికలు చేశారు. దాంతో ప్రభుత్వం ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో విద్యాసంస్థలకు ఇవాల (బుధవారం) సెలవు ప్రకటించింది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లా యంత్రాంగాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
కాగా, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా బలపడింది. ఇది ఈ రోజు రాత్రికి ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల మధ్య, విశాఖపట్నం-గోపాల్పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. ఈ ప్రభావంతో అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్), పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
ఈ ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తరాంధ్రలో ఆకస్మిక వరదలు సంభవించవచ్చని హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని మంత్రి లోకేశ్ సూచించారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభం కాగా.. కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.