హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ప్రజాసమస్యలను పక్కదారి పట్టిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంలోని ప్రజలతోపాటు ముకోటి దేవతలను సైతం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకుల వ్యవహారశైలి చూస్తుంటే.. ‘దొంగే.. దొంగ.. దొంగ’ అని అరిచిన చందంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. 22ఏ నిషేధిత జాబితాలో ఏకంగా లక్షల ఎకరాలను చేర్చి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఫాసిస్ట్ సరార్ పేకమేడలా కూలిపోవడం ఖాయమని హెచ్చరించారు.
పవిత్రమైన శాసనసభను కౌరవసభలా మార్చి అభినవ దుశ్శాసన పర్వానికి తెరలేపారని, అకారణంగా బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసి ఏకపక్షంగా సభను నడిపించారని దుయ్యబట్టారు. మాజీ సీఎం కేసీఆర్‌కు ఎర్రవల్లిలో 62 ఎకరాలు ఉన్నదని, అందులో అంగుళం కూడా ప్రభుత్వ భూమి లేదని స్పష్టంచేశారు. అక్రమ భూమి ఉన్నట్టు నిరూపించలేకపోతే ముకు నేలకు రాస్తారా? అని సవాల్ విసిరారు. సీఎం తమ్ముళ్ల, మంత్రి పొంగులేటి భూదందాలను బయటపెట్టినందుకే ప్రభుత్వం బీఆర్ఎస్పై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. తప్పుడు సర్వేలు, అక్రమ కేసులతో బీఆర్ఎస్ బెదిరే ప్రసక్తే లేదని చెప్పారు.