హుస్నాబాద్ టౌన్, జూలై 26: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో స్విమ్మింగ్ పూల్ లేక ఈత నేర్చుకోవడానికి ఇక్కడి యువతతో పాటు పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది జూలై 7న హుస్నాబాద్ మినీ స్టేడియాన్ని పరిశీలించిన సందర్భంగా పట్టణానికి స్విమ్మింగ్‌పూల్ మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖమంత్రి వాకాటి శ్రీహరి ప్రకటించారు. హుస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ స్పందిస్తూ స్విమ్మింగ్ ఫూల్ లేక అనేక మంది యువకులు, విద్యార్థులు ఈతకోసం చెరువుల్లోకి వెళ్లిప్రాణాలు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
నియోజకవర్గంలో కాకుండా హుస్నాబాద్ పట్టణంలోని స్టేడియంలోనే స్విమ్మింగ్‌పూల్ మంజూరు చేయడం సంతోషకరమని అన్నారు. కానీ, ఇద్దరు మంత్రుల మాటలకు ఏడాది గడిచినా నేటికీ హామీ నెరనేర్చలేదు. హుస్నాబాద్ పట్టణానికి స్విమ్మింగ్ పూల్ లేక ఈతకొట్టడం కోసం వ్యవసాయ బావులు, చెరువుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. స్థానికంగా ఈతనేర్పే వారు లేక పలువురు ప్రమాదాల అంచుకు వెళ్లి బతికిబయటపడ్డ సంఘటనలు ఉన్నాయి.
హుస్నాబాద్ పట్టణ వాసుల కోసం స్విమ్మింగ్‌పూల్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి శ్రీహరి ప్రకటించడంతో పాటు ఇందుకు రూ.9.03 కోట్ల మంజూరుకు ఆర్థికశాఖకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు జీవోసైతం జారీచేశారు. ఇందులో ఈత నేర్పేకోచ్లు, పనిచేసే సిబ్బంది, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు ప్రతిపాదనలు పంపారు. స్విమ్మింగ్‌పూల్‌ను స్థానిక మినీస్టేడియంలోనే నిర్మిస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఆర్థికశాఖనుంచి నిధులు రాకపనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ చొరవ తీసుకుని స్విమ్మింగ్‌పూల్ నిర్మించేందుకు చొరవ చూపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.