విచ్చలవిడిగా నిబంధనల ఉల్లంఘన.. అనుమతులను దారిమళ్లించి, అవకతవకలు.. మట్టి తవ్వకాలకుతోడు చెట్ల ధ్వంసం.. గుట్టలకు గుట్టలు గుట్టుగా మాయం చేస్తున్న వైనం.. నాగ్‌పూర్- విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సృష్టిస్తున్న విధ్వంసమిది. రిజర్వ్ ఫారెస్టులోనే సాగుతున్న వనమేధమిది. పెద్లపల్లి జిల్లాలో 15 గ్రామాల మీదుగా వెళ్లే జాతీయ రహదారి-163జీ కోసం అటవీ భూముల్లో మేఘా తవ్వకాలు కొనసాగిస్తున్నది. అనుమ తులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మించే ఈ రహదారి నిర్మాణ పనుల్లో అన్నీ ఉల్లంఘనలే. అన్నీ అవకతవకలే.
అసలు అనుమతులేవీ లేకుండానే రిజర్వ్ ఫారెస్ట్‌లో తవ్వకాలు మొదలుపెట్టింది ‘మేఘా’. ఆదివారంపేట శివారులోని సర్వే నంబర్ 190లో 15వేల మెట్రిక్ టన్నుల మట్టి తవ్వకాలకు అనుమతిపొంది, మరోచోట అడవుల మధ్యలో గుట్టలకు గుట్టులు చదును చేసేస్తున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఇప్పటి వరకు లక్ష మెట్రిక్ టన్నులకు పైగా మట్టిని తవ్వేశారు. చట్టాలు పట్టవు. నిబంధనలు గిట్టవు. ఒకరిద్దరు అధికారులు జరిమానా విధించినా, జంకూ గొంకూ లేదు. కొందరు ప్రభుత్వ పెద్దలను, ఉన్నతాధికారులను జేబులో పెట్టుకుని బుల్డోజర్లు తోలుతున్నది.

పెద్దపల్లి, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ)/ మంథని: జాతీయ రహదారి నిర్మాణం సాకుతో ‘మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్’ కంపెనీ యథేచ్ఛగా ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా రిజర్వుడ్ ఫారెస్ట్ (రక్షిత అటవీ ప్రాంతం) లో భారీ వృక్షాలను నేలకూల్చుతూ ఇష్టారీతిన మట్టిని తరలిస్తున్నా అన్ని విభాగాల అధికారులు కంపెనీ మోచేతి నీళ్లు తాగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తూతూమంత్రంగా జరిమానాలు విధించి.. తిరిగి అదే కంపెనీకి మళ్లీ అనుమతులు కట్టబెడుతూ అక్రమాలకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వేల ఏండ్ల చరిత్ర కలిగిన హనుమంతుడి గుట్ట, పీర్ పహాడ్ మేఘా కంపెనీ ధాటికి కండ్లముందే కరిగిపోతుంటే వాటితో అనుబంధం పెనవేసుకున్న స్థానికులు కన్నీళ్లు పెడుతున్నారు. ఇప్పటివరకు మెజారిటీ రిజర్వ్పారెస్ట్ పరిధిలో తవ్వకాలు జరిగినా, జరుగుతున్నా అధికారులు నోరు మెదపకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది.
నాగ్‌పూర్-విజయవాడ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే (ఎన్‌హెచ్-163 జీ) పనులు పెద్దపల్లి జిల్లాలో 15 గ్రామాల మీదుగా కొనసాగుతున్నాయి. మంథని మండలం ఉప్పట్ల నుంచి పోతారం, విలోచవరం, నాగారం, కన్నాల, పుట్టపాక, రామయ్యపల్లి, రామగిరి మండలంలోని ఆదివారంపేట, బేగంపేట, నవాబ్‌పేట, ముత్తారం మండలంలోని లక్కారం, కేశనపల్లి, ముత్తారం, అడవిశ్రీరాంపూర్, ఓడేడ్ గ్రామాల మీదుగా వరంగల్ జిల్లాలోకి జాతీయ రహదారి వెళ్తుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మించే ఎన్‌హెచ్-163జీ నిర్మాణానికి 2021 ఫిబ్రవరి 3న గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగా, అవసరమైన భూములను అధికారులు సేకరించడంతో పనులు జరుగుతున్నాయి. జాతీయ రహదారి మొత్తం 405 కిలో మీటర్లు కాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి మొదలై ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ముగుస్తుందని అధికారులు చెప్తున్నారు. 2027 వరకు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులను ప్యాకేజీలుగా విభజించి చేపడుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అసలు సినిమా ఇక్కడే మొదలైంది.

రిజర్వ్‌ఫారెస్టులో తవ్వకాలు!
రిజర్వ్‌ఫారెస్ట్ పరిధిలో సాధారణంగా మట్టి, మొరం లేదా మరే ఇతర ఖనిజాల తవ్వకాలు (మైనింగ్) చేయరాదు. 1927 భారత అటవీ చట్టం, 1967 తెలంగాణ అటవీ చట్టం, 1980 అటవీ సంరక్షణ చట్టం ప్రకారం రక్షిత అడవుల్లో వాణిజ్యపరమైన లేదా అనధికారిక తవ్వకాలు చేపట్టడం తీవ్ర నేరమని చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులు (రోడ్లు, రైల్వే లైన్లు, నీటి పారుదల ప్రాజెక్టులు) లేదా మరేదైనా అత్యవసర ప్రభుత్వ అవసరాల కోసం రిజర్వ్ ఫారెస్టులో మట్టి తవ్వకాలు లేదా అటవీ భూమిని ఉపయోగించాల్సి వస్తే, ముందస్తు అనుమతులు పొందాల్సి ఉంటుంది.
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, అటవీయేతర పనుల కోసం అటవీ భూమిని వినియోగించాల్సి వస్తే 1980 అటవీ సంరక్షణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి ‘ఫారెస్ట్ క్లియరెన్స్’ తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ అనుమతుల తర్వాత క్షేత్రస్థాయిలో నోడల్ అధికారి పరిశీలన చేసి.. సంబంధిత డివిజనల్ అటవీ అధికారి తవ్వకాలకు తగిన మార్గదర్శకాలతో తుది అనుమతులు జారీ చేయాలి. గనులు, భూగర్భ శాఖ మట్టి అనేది ‘మైనర్ మినరల్’ (చిన్న ఖనిజం) పరిధిలోకి వస్తుంది.
కాబట్టి అటవీ శాఖ అనుమతితోపాటు గనుల శాఖ నుంచి అనుమతి పొంది, నిర్దేశిత సీనరేజ్ ఫీజు చెల్లించి పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి స్థానిక పంచాయతీలకు, స్థానిక రెవెన్యూ అధికారులకు గానీ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో మట్టి తవ్వకాలకు అనుమతులు ఇచ్చే అధికారం ఉండదు. అనుమతులు లేకుండా రిజర్వ్ ఫారెస్ట్‌లో బుల్డోజర్లు, ఇతర క్రేన్లతో మట్టి తవ్వకాలు జరిపితే, ఆ వాహనాలను సీజ్ చేయడంతో పాటు అటవీ చట్టాల కింద జైలు శిక్ష, భారీ జరిమానా విధిస్తారు. కానీ ఈ నిబంధనలను పాటించకుండా మేఘా కంపెనీ రక్షిత అటవీ ప్రాంతం నుంచే జోరుగా మట్టి తవ్వకాలు చేపడుతున్నది.
నామమాత్రపు జరిమానాలతో సరి
రామగిరి ఖిల్లా అటవీ ప్రాంతంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్న మేఘా కంపెనీ సిబ్బంది అక్రమంగా రక్షిత అటవీ ప్రాంతం నుంచి మట్టి తవ్వి తరలించిన ఘటనలో రెండు నెలల క్రితం అటవీ శాఖ అధికారులు పొక్లెయిన్‌ను సీజ్ చేసి.. రూ.56 వేల జరిమానా విధించారు. ఆ తర్వాత ఆదివారం పేట శివారులోని అటవీ ప్రాంతంలో మేఘా తవ్వకాలు చేపడుతున్నట్టు విమర్శలు వస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పెద్ద కంపెనీ కావడంతో లాలూచీ పడి పెద్దల పేరు చెప్తూ అధికారులు సైతం తమ ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారనే విమర్శలున్నాయి.
ఇదే మేఘా కంపెనీ గతంలో మంథని మండలం అడ్రియాలలో సింగరేణి ఓబీ మట్టి కుప్పల నుంచి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి మట్టి తరలించేందుకు అనుమతులు పొందింది. కానీ, అనుమతులకు మించి మట్టి తరలించింది. అక్రమాలపై మీడియా కథనాలు, ప్రైవేట్ కేసులతో రంగంలోకి దిగిన సింగరేణి సంస్థ ఈటీఎస్ (ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్) డ్రోన్ ద్వారా సర్వే నిర్వహించి మేఘాకు నోటీసులు జారీ చేసింది. అనుమతికి మించి తరలించిన మట్టికి డబ్బులు చెల్లించాలని నోటీసులిచ్చింది. ఈ విషయాన్ని అధికారయంత్రాంగం గోప్యంగా ఉంచుతున్నది. గతంలో అనుమతికి మించి మట్టి తరలించినట్టు లెక్కతేల్చినా.. తిరిగి తాజాగా వారం క్రితం సింగరేణిలోని అడ్రియాల ఓబీ కుప్పల నుంచి 17,500 మెట్రిక్ టన్నుల మట్టిని తరలించేందుకు అనుమతులివ్వడం అధికారుల దాసోహానికి నిదర్శమనే విమర్శలు వస్తున్నాయి.

ఫిర్యాదు వస్తే చర్యలు
గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం మట్టి తరలించేందుకు మేఘా సంస్థకు అనుమతులిచ్చాం. కానీ రక్షిత అటవీ ప్రాంతంలో మట్టి తీస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. గతంలో సింగరేణి సంస్థకు సంబంధించిన ఓబీ మట్టి తరలింపునకు సైతం అనుమతులు తీసుకున్నది. అనుమతికి మించి తరలింపు విషయంలో జరిమానాల సైతం చెల్లించింది. మళ్లీ కొత్తగా వారం క్రితం సింగరేణి ఓబీ మట్టి తరలింపునకు అనుమతులిచ్చాం. ఈ పర్మిషన్ నెల వరకు కొనసాగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తీస్తున్న అంశంపై ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటం.
– గోవిందరాజు, డీడీ మైనింగ్ (వరంగల్)
15 వేల మెట్రిక్ టన్నుల మట్టికే అనుమతి
రామగిరి మండలం ఆదివారంపేట శివారులోని సర్వే నంబర్ 190 నుంచి 15 వేల మెట్రిక్ టన్నుల మట్టి తీసుకునేందుకు భూగర్భ గనుల శాఖ అనుమతిచ్చింది. ఇందుకు విరుద్ధంగా ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. గ్రామస్తుల వివరాల ప్రకారం.. వేల ఏండ్ల చరిత్ర గల హనుమంతుడి గుట్ట, పీర్ పహాడ్ నుంచి పెద్ద ఎత్తున మట్టి తరలిస్తున్నారు. కంపెనీ ఇప్పటికే లక్ష మెట్రిక్ టన్నులకు పైగా మట్టి తరలించినట్టు తెలుస్తున్నది.
ఈ నెల 19తో భూగర్భ గనుల శాఖ ఇచ్చిన గడువు పూర్తయినా తవ్వకాలు కొనసాగుతున్నాయి. ప్రతి మెట్రిక్ టన్నుకూ రూ.57 నుంచి రూ.60 చొప్పున మైనింగ్ శాఖకు సీనరేజ్ చెల్లించాల్సి ఉండగా, కేవలం 15 వేల మెట్రిక్ టన్నులకే చెల్లించి మిగిలిన మట్టిని అక్రమంగా తరలిస్తూ సర్కార్ ఆదాయానికి గండి కొడుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. 20 మీటర్ల ఎత్తు గుట్టలను 20 మీటర్ల లోతు వరకు తవ్వుతున్నారు. పెద్ద వృక్షాలను సైతం కూకటివేళ్లతో పెకిలిన్నారు. భారీగా ఎక్స్కవేటర్లను మోహరించి రోజుకు వేలాది ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నారు.