రంగారెడ్డి, జూలై 26 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం తమ కండ్లముందే విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా చేష్టలుడిగి చూస్తున్నదే తప్పా.. కాపాడటంలేదని సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు భూములను కాపాడాల్సిన బాధ్యత గల అధికారులు పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ప్రభుత్వ భూములను అధికార పార్టీ నేతల అండదండలతో పైరవీకారులు, రియాల్టర్లు యథేచ్ఛగా దోచేస్తున్నారు. అయినప్పటికీ అడ్డుకోవల్సిన ఉన్నతాధికారులు నోరు మెదపడం లేదని ప్రజలు వాపోతున్నారు. మరోవైపు విలువైన సర్కారు భూములను సైతం కొంతమంది అధికారులు ఏకంగా పట్టాలు చేస్తున్నారు. అధికారుల తప్పిదాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నప్పటికీ ఉన్నతాధికారులు వారి పట్ల ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.
జిల్లా పరిధిలోని హైదరాబాద్ శివారులో విస్తరించి ఉన్న పలు మున్సిపాలిటీలు, మండలాల్లో విలువైన ప్రభుత్వ భూములపై ప్రైవేటు వ్యక్తులు రికార్డులను తారుమారు చేసి పాగా వేస్తున్నారు. దీనిపై బాధ్యతగల అధికారులు పట్టించుకోకపోగా కండ్లప్పగించి చూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వివిధ ప్రజా ప్రయోజనాల పేరుతో పెద్దఎత్తున సర్కారు భూములను, పట్టా భూములను బలవంతంగా సేకరిస్తున్నారు. ప్రభుత్వ భూముల కబ్జాలపై పెద్దఎత్తున అధికారులకు ఫిర్యాదులు అందుతున్నప్పటికీ వాటిపై ఎలాంటి విచారణ జరపడంలేదనే ఆరోపణలున్నాయి.
హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న అబ్దుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట్, ఆదిబట్ల, తుర్కయాంజాల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, రాజేంద్రనగర్, బాలాపూర్, శంషాబాద్, గండిపేట్, కోకాపేట్, బండ్లగూడ వంటి ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువ చేసే సర్కారు భూములను కొంతమంది అధికారుల అండదండలతో రికార్డులు తారుమారు చేసి కోట్ల రూపాయల భూములను కొల్లగొడుతున్నారు. రాత్రికి రాత్రే భూములపైకి వెళ్లి బౌన్సర్లను ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా భూముల చుట్టూ రేకుల షెడ్లు వేసి ఆ తర్వాత కట్టడాలను ప్రారంభిస్తున్నారు. ఈ విషయంపై ఎవరైనా అడగడానికి వెళ్లినా బౌన్సర్లతో భౌతిక దాడులు చేయిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. భూముల కబ్జాలపై పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు.
బాలాపూర్ మండలంలోని నాదర్గుల్ గ్రామంలో సర్వే నం.613లో ప్రభుత్వ భూమిని రికార్డుల తారుమారుతో చుట్టూ రేకులతో ఫెన్సింగ్ వేసి అందులోకి ఎవరినీ రానివ్వడంలేదు. గ్రామస్తులు బలవంతంగా అందులోకి వెళితే బౌన్సర్లతో దాడులు చేయిస్తున్నారు. అలాగే, ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల గ్రామపంచాయతీ పరిధిలోగల అనేక ముస్లిం, మైనార్టీల భూములను సైతం రాత్రికి రాత్రే రికార్డులు తారుమారు చేశారు. ఈ భూములు గతంలో సర్కారు భూములైనప్పటికీ ఎలాంటి సంబంధంలేని కొంతమంది వ్యక్తులు తమ పూర్వీకుల ఆస్తులని.. రికార్డుల తారుమారుతో విలువైన వందల ఎకరాల భూముల భూములకు చుట్టూ రేకుల కంచె వేసి బౌన్సర్లను ఏర్పాటు చేశారు. జిల్లా పరిధిలోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములపై ఎన్ఓసీలు జారీ అవుతున్నాయి. తాజాగా, శంషాబాద్ మండలంలోని బహదూర్‌గూడ భూముల వ్యవహారంలో కూడా అధికారులు రికార్డులను తారుమారు చేశారని ఆరోపణలున్నాయి.
జిల్లాలో కొంతమంది అధికారులు చేస్తున్న రికార్డుల తారుమారు, వివాదాస్పద భూములకు ఎన్ఓసీల జారీ వంటి పరిణామాలతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. బహదూర్‌గూడ భూములపై పేదలు తమవంతు ఆందోళన చేస్తుండగా.. మరోవైపు ప్రభుత్వం కొంతమంది వ్యక్తులకు చెందినవని రికార్డులు తారుమారు చేయడంతో పెద్దఎత్తున శాంతిభద్రతల సమస్య తలెత్తింది. ఈ ఘటనలో పోలీసులపై కూడా ఆందోళనకారులు దాడులు జరిపారు. మరోవైపు రికార్డులు తారుమారైన భూముల వద్ద కూడా పెద్దఎత్తున ఘర్షణలు తలెత్తుతున్నందున పలు చోట్ల పోలీసు పికెట్లను కూడా ఏర్పాటు చేశారు.
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునుగనూరు గ్రామంలోని సర్వే నం.44లో ఉన్న సర్కారు భూమిని అధికారులు రికార్డులను తారుమారు చేసి పట్టా భూమిగా మార్చారు. ఈ భూమిపై ఏకంగా లావాదేవీలు జరగడంతో గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించిందని, అన్ని ప్రచార మాధ్యమాల్లో బయటపడినప్పటికీ ఈ భూమిని స్వాధీనం చేసుకోవడానికి అధికారులు సాహసించడంలేదు. ఈ భూమి విలువ ప్రస్తుత మార్కెట్లో రూ.200 కోట్ల వరకు ఉంటుంది. ఇదే మున్సిపాలిటీ పరిధి మన్నెగూడలోని సర్వే నం.41లో 1.26 ఎకరాల సర్కారు భూమి ఉన్నది. ఈ భూమి హైదరాబాద్, నాగార్జునసాగర్ రహదారి పక్కనే ఉండటంతో సుమారు రూ.50 కోట్ల విలువ ఉంటుంది.
భూమిని కాపాడాల్సిన అధికారులు.. ఈ భూమిలో అక్రమంగా షెడ్లు వేసిన వారికి కేవలం నోటీసులిచ్చి సరిపెట్టారు. అలాగే, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని పిగ్లీపూర్ గ్రామంలో కూడా సర్వే నం.17లో సుమారు వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉన్నది. ఇదే సర్వే నంబర్లో మరో వంద ఎకరాల పట్టా, భూదాన్ భూములున్నాయి. కాని, ఈ భూమి మొత్తానికి పట్టా నంబర్లు వేసి రికార్డులు తారుమారు చేసి ఇతరులకు పట్టాలివ్వడంతో.. ఆ భూములు పూర్తిగా ప్లాట్లుగా మార్చి విక్రయించారు. ఈ భూముల విలువ కూడా సుమారు రూ.100 కోట్ల వరకు ఉంటుందని గ్రామస్తులు చెప్తున్నారు. సర్కారు భూమిలో నేటికీ ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలొస్తున్నాయి.
జిల్లాపరిధి మహేశ్వరం మండలంలోని మంఖాల్, ఇబ్రహీంపట్నం మండలంలోని ఖానాపూర్, కందుకూరు మండలంలోని కందుకూరు, మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామాల్లో ఉన్న విలువైన సర్కారు భూములను రికార్డులను తారుమారుచేసి కాజేసేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయా భూములపై కబ్జాలో ఉన్నవారికి డబ్బులు చెల్లించి.. వారిని భూముల నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ భూములపై గుట్టుచప్పుడు కాకుండా అగ్రిమెంట్లు సైతం చకచకా జరిగిపోతున్నాయి. మరోవైపు వక్ఫ్ బోర్డు భూములను సైతం కాజేసేందుకు సంబంధంలేని వ్యక్తులను వారసులుగా చిత్రీకరించి రంగంలోకి దింపుతున్నారు. ఆయా భూములను రాజకీయ నేతలు అధికారాన్ని ఉపయోగించి ఎన్ఓసీలు పొందేందుకు పైరవీలు ప్రారంభమయ్యాయి.
జిల్లాలోని ప్రభుత్వ భూములను కాజేసేందుకు బిగ్ బ్రదర్స్ పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వందల ఎకరాల సర్కారు భూములను స్వాధీనం చేసుకునేందుకు సంబంధంలేని వ్యక్తులను వారసులుగా ముందుంచి తెరవెనుక రికార్డులను తారుమారు చేయించి తద్వారా ఆ భూములను వారు స్వాధీనం చేసుకుంటున్నారు. తర్వాత ఆ భూములను వారి పేర్లపై మార్పించుకుంటున్నారు. జిల్లా పరిధిలోని అనేక మండలాల్లో భూములకు వారసులమంటూ పలువురు తెరమీదకు వస్తున్నారు. వారంతా బిగ్ బ్రదర్స్ కనుసన్నల్లో పనిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ తతంగమంతా జిల్లావ్యాప్తంగా జరుగుతున్నది. దీనిపై అధికారులు సైతం చేతులెత్తేస్తున్నారు. రాజకీయ ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వ భూములను పట్టాలుగా మార్చుతున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు.