KTR : తెలంగాణ సిరుల మాగాణి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయొద్దని, కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) లేఖ రాశారు. లక్షలాది కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుండటం, సింగరేణి కార్మికుల హక్కులను, సంక్షేమాన్ని కాలరాస్తుండటం తీవ్ర ఆక్షేపణీయమని కేటీఆర్ పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఆ హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని కార్మికులు గమనిస్తున్నారని కేటీఆర్ తెలిపారు.
సింగరేణి కార్మికులకు చెల్లించాల్సిన దసరా బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కేటీఆర్ అన్నారు. కార్మికులు తమ రక్తాన్ని, చెమటను ధారపోసి సంస్థకు వేల కోట్ల రూపాయల లాభాలు తీసుకొస్తే, ఆ లాభాల్లో వారికి న్యాయంగా దక్కాల్సిన వాటాను ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి నికర లాభం రూ. 4,701 కోట్లు రాగా.. అందులో 33 శాతం అంటే రూ.1,551 కోట్లు. కానీ కార్మికులకు చెల్లించింది రూ.796 కోట్లు మాత్రమేనని.. అంటే కార్మికులకు రావాల్సిన మొత్తంలో భారీగా కోత పెట్టారని కేటీఆర్ వెల్లడించారు.
అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6,394 కోట్ల లాభాలు వచ్చినప్పటికీ, బోనస్ రూపంలో కార్మికులకు చెల్లించింది రూ.819 కోట్లు మాత్రమేనని కేటీఆర్ తెలిపారు. బోనస్ శాతం ఒకటి ప్రకటించి, వాస్తవంగా మరో విధంగా చెల్లించడం ద్వారా కార్మికులను మోసం చేస్తున్నారనే ఆందోళన కార్మికుల్లో ఉందని ఆయన స్పష్టం చేశారు.
‘2023 నుంచి 2025 సంవత్సరాల వరకు సింగరేణి లాభాల బోనస్‌కు సంబంధించిన కార్మికుల బకాయిలు మొత్తం రూ.2,342 కోట్లు ఉన్నాయని పేర్కొంటున్నాం. ఈ బకాయిలను వెంటనే కార్మికులకు చెల్లించాలి. కార్మికుల కష్టార్జితాన్ని వారికి దక్కకుండా చేయడం సరికాదు. అలాగే సింగరేణి కార్మికులకు సంబంధించిన పెర్క్స్ పై ఆదాయపు పన్ను సమస్య కూడా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంది. 2010-11, 2011-12 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పెర్క్స్‌పై ఆదాయపు పన్నును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించలేదు. 2023 ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికుల పెర్క్స్ పై ఆదాయపు పన్నును కంపెనీ చెల్లించేలా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లు గడిచినా ఆ హామీని అమలు చేయలేదు. కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాబట్టి ఇప్పటికైనా పెర్క్స్ సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలి.
సింగరేణి సంస్థ విషయానికి వస్తే, 2023 వరకు 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి, రూ.37 వేల కోట్ల టర్నోవర్ సాధించి, దేశంలోనే అగ్రగామి ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి నిలిచింది. అలాంటి సింగరేణి సంస్థకు ట్రాన్స్‌కో, జెన్కో నుంచి రావాల్సిన సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల సంస్థ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జీతాల చెల్లింపుల కోసం కూడా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే పరిస్థితి వస్తే, సింగరేణి భవిష్యత్తు ఏంటి? అనే ప్రశ్న తలెత్తుతోంది. సింగరేణి కార్మికుల రక్షణకు అవసరమైన పరికరాలు, విడిభాగాలు, యంత్రాల కొనుగోళ్లు, వైద్య సేవలు, రోజువారీ కార్యకలాపాలకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడితే, దాని ప్రభావం నేరుగా కార్మికులపై పడుతుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టి సింగరేణిని మరింత అభివృద్ధి చేయాల్సిన సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టడం సరికాదు. కాబట్టి సింగరేణికి రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
మారు పేర్ల బాధితుల సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదు. మరోవైపు యాజమాన్యం కార్మిక వ్యతిరేక సర్క్యులర్లు జారీ చేస్తున్నా ప్రభుత్వం వాటిని నిలుపుదల చేయడం లేదు. మారు పేర్ల బాధితులకు న్యాయం చేయాలి. వారికి ఒక అవకాశం కల్పించాలి. డిస్మిస్ అయిన కార్మికులకు కూడా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని అమలు చేయకపోగా వందలాది మంది కార్మికులను యాజమాన్యం డిస్మిస్ చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. డిస్మిస్ కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలి.
సింగరేణి కార్మికులకు బోనస్‌ను గణనీయంగా పెంచిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పది సంవత్సరాల కాలంలో సింగరేణి కార్మికులకు బోనస్ పెద్ద ఎత్తున చెల్లించిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. అందుకే ఇప్పటికైనా కార్మికుల కష్టాన్ని, వారి శ్రమను గుర్తించి ఈ సంవత్సరం ప్రకటించబోయే బోనస్‌ను నికర లాభాల ఆధారంగా నిర్ణయించాలి. ప్రాజెక్టుల కోసం, సంస్థ విస్తరణ కోసం అంటూ నికర లాభాల్లో పెద్ద మొత్తాన్ని పక్కన పెట్టి, మిగిలిన మొత్తాన్ని మాత్రమే లాభంగా చూపించి బోనస్ చెల్లించే విధానాన్ని కార్మికులు అంగీకరించరు.
సింగరేణిలో కారుణ్య నియామకాల విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మెడికల్ బోర్డులను క్రమం తప్పకుండా నిర్వహించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నెలకు సగటున రెండుసార్లు మెడికల్ బోర్డులను నిర్వహించి, అన్‌ఫిట్ అయిన కార్మికుల కుటుంబ సభ్యులకు వారసత్వ ఉద్యోగాలు కల్పించాం. కేసీఆర్ హయాంలో దాదాపు 16 వేల మందికి పైగా వారసత్వ ఉద్యోగాలు కల్పించిన విషయం అందరికీ తెలుసు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ బోర్డులను క్రమం తప్పకుండా నిర్వహించడం లేదు. నిర్వహించిన సందర్భాల్లో కూడా వివిధ కారణాలు చూపుతూ కార్మికులను అన్‌ఫిట్ చేయడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల వేలాది కుటుంబాలు వారసత్వ ఉద్యోగాలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెలా మెడికల్ బోర్డులను క్రమం తప్పకుండా నిర్వహించాలి. అలాగే ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీని కూడా ప్రభుత్వం మర్చిపోవద్దు. కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు సొంతింటి పథకాన్ని అమలు చేయాలి.
మరోవైపు సింగరేణి సంస్థలో ప్రభుత్వ వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే సమాచారం మా దృష్టికి వచ్చింది. సింగరేణి సంస్థను బలోపేతం చేయాల్సిన సమయంలో వాటాలను విక్రయించాలనే ఆలోచన ఎందుకు? సింగరేణి కేవలం ఒక సంస్థ కాదు. అది తెలంగాణ ప్రజల ఆస్తి. వేలాది మంది కార్మికుల జీవనాధారం. తరతరాలుగా తెలంగాణ అభివృద్ధికి సింగరేణి కార్మికులు తమ శ్రమను అందిస్తున్నారు. అలాంటి సింగరేణిని బలహీనపరిచే ఏ చర్యనైనా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సింగరేణి సంస్థ వాటాలను విక్రయించే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. సింగరేణిని మరింత బలోపేతం చేయాలి. కార్మికుల హక్కులను కాపాడాలి. వారికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. కార్మికుల హక్కుల కోసం, సింగరేణి భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుంది అని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.
1. వాస్తవ లాభాలపై సింగరేణి కార్మికులకు 36 శాతం పైగా లాభాల వాటా చెల్లించాలి
2. మెడికల్ బోర్డు కోసం వేచి చూస్తున్న 2,500 పైచిలుకు కార్మికులకు 3 నెలల మెడికల్ బోర్డుల చొప్పున పెట్టి అన్‌ఫిట్ చేసి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి
3. ఎన్నికల వాగ్ధానాల ప్రకారం పెర్క్స్ పై ఇన్కమ్ టాక్స్‌ను కార్మికులకు తిరిగి చెల్లించాలి
4 సొంతింటి పథకం అమలు చేస్తూ కార్మికులకు 250 గజాల స్థలం, 20 లక్షల రుపాయల వడ్డీలేని రుణం ఇవ్వాలి
5. మారు పేర్ల సమస్య పరిష్కరిస్తూ డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి
6. సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ రూ.60,000 వేల కోట్లను వెంటనే చెల్లించాలి
7. సింగరేణి సంస్థలో వాటాల ఉపసంహరణ, ప్రైవేటీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలి