Paddy Rice | హైదరాబాద్, మార్చి 8(నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు, గోదాముల్లో మూలుగుతున్న దొడ్డు రకం బియ్యం విక్రయానికి మరోసారి వేలం వేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. దీనికోసం వారంలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు గతం కంటే రూ.2.4 చొప్పున ధర తగ్గించారు. ఈ నేపథ్యంలో ఈ సారైనా దొడ్డు బియ్యం కథ కంచికి చేరుతుందా? లేక మళ్లీ మొదటికొస్తుందా? అన్న విషయంపై అనుమానాలు ఇంకా తొలగడం లేదు.
రేషన్ పంపిణీలో నిరుడు దొడ్డురకం బియ్యం స్థానంలో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో అప్పటికే రేషన్ షాపులు, గోదాముల్లో 1.4 లక్షల టన్నుల దొడ్డు రకం బియ్యం నిల్వలు నిలిచిపోయాయి. వాటిని వేలం వేయడానికి నిరుడు డిసెంబర్లో సర్కార్ వేలం వేసింది. కిలో కనీస ధరగా రూ.24 నిర్ణయించింది. ఈ దశలో టెండర్లలో ఒక్క బిడ్డర్ కూడా పాల్గొనలేదు. ఇందుకు కారణం కనీస రూ.24పై బిడ్డర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టుగా తెలిసింది.
దీంతోపాటు 1.4 లక్షల టన్నుల బియ్యాన్ని ఒకే లాట్ కింద టెండర్ వేయడంతో చిన్న, మధ్యస్థాయి బిడ్డర్లు వేలంలో పాల్గొనడానికి అవకాశం లేకుండా పోయింది. బిడ్డర్లు లేవనెత్తిన ఈ రెండు అభ్యంతరాలపై ఇటీవల జరిగిన క్యాబినెట్లో చర్చించారు. దీంతో బియ్యం వేలం కనీస ధరను తగ్గిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ముందు రూ.24 ఉన్న ధరను రూ.21.6గా నిర్ణయించారు. అంటే కిలోపై రూ.2.4 తగ్గించారు. దీంతో కనీసం ఇప్పుడైనా బిడ్డర్లు ముందుకొస్తారని సివిల్ సప్లయ్ అధికారులు అభిప్రాయ పడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.4 లక్షల టన్నుల బియ్యాన్ని గతంలో మాదిరిగానే ఒకే లాట్ కింద వేలం వేస్తారా? లేక విభజిస్తారా? అనేదానిపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఒకవేళ మళ్లీ ఒకే లాట్ కింద వేస్తే బిడ్డర్లు ముందుకొస్తారో? లేదో? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఒకవేళ వచ్చినా ఒకరిద్దరి కన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉండదని పేర్కొంటున్నారు. తద్వారా ధర కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాకాకుండా చిన్న చిన్న లాట్లుగా విభజించి వేలం వేయడం ద్వారా ఎక్కువ మంది బిడ్డర్లు పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని, తద్వారా ధర కూడా ఎక్కువగా వచ్చేందుకు ఆస్కారం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బియ్యం వేలం ఆలస్యం కావడంతో సవిల్సప్లయ్ శాఖకు భారీ నష్టం వాటిల్లుతున్నది. 10 నెలలుగా రూ.500 కోట్ల విలువైన బియ్యం గోదాముల్లోనే ఉండటంతో అందుకు సంబంధించిన వడ్డీ భారం ఆ శాఖపైనే పడుతున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకొని బియ్యం వేలం ప్రక్రియను మంచి ధరతో పూర్తి చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 1.4 లక్షల టన్నుల్లో 30 వేల టన్నుల వరకు రేషన్ షాపుల్లోనే ఉన్నట్టుగా తెలిసింది. ఆ బియ్యం మొత్తం పురుగులు పట్టినట్టు రేషన్డీలర్లు చెప్తున్నారు. పురుగు పట్టడం, పంది కొక్కుల బెడదతో బియ్యం పూర్తిగా పాడైపోయాయని చెప్తున్నారు. ఆ బియ్యానికి పురుగుతో సన్నబియ్యానికి కూడా పురుగు పడుతున్నదని ఆందోళన చెందుతున్నారు. దీంతో త్వరగా దొడ్డు బియ్యాన్ని తీసుకెళ్లాలని కోరుతున్నారు.