చిన్నంబావి, జూలై 27 : శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి తమ భూములును అప్పగించినా ఈ ప్రభుత్వాలు తమను ఆదుకోకపోవడంతో నరకం అనుభవిస్తున్నామని శ్రీశైలం ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని పెద్దమారూర్‌లో అలంపూర్, చిన్నంబావి మండలాల పరిధిలోని కృష్ణానది పరివాహక ప్రాంతల ముంపు బాధితుల సమాఖ్య ఆధ్వర్యంలో ఉద్వేగపూరిత ఆవేదన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముంపు బాధితులు మాట్లాడుతూ కృష్ణానదిపై శ్రీశైలం డ్యాం కడతామంటే ఉన్న వారు వదిలిపెట్టి తరాలుగా నమ్ముకున్న భూములను త్యాగం చేసి నలభై ఏండ్లు అవుతున్నా ఈ పాలకులు మా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం వచ్చి చేతులు ఎత్తి మొక్క డం బాసలు చేయడం గెలిచాక మా గోడును గాలికొదిలేయడం పరిపాటిగా మారిందన్నారు.
ఎన్టీ రామారావు తెచ్చిన జీవో 98 నుంచి నిన్నటి జీవో 68 వరకు అన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని బాధితులు మండిపడ్డారు. ముంపు బాధితులకు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూసి ఇప్పటికే 400 మంది మృతి చెందారని, ఇంకా న్యాయం జరుగుతుందని రెండే వేల మంది నిర్వాసితులు ఎదురుచూస్తున్నారని, నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా కనికరించడం లేదని నిప్పులు చెరిగారు. ఏడాది కిందట పెంట్లవెల్లి మండలం జటప్రోలుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు బిడ్డగా మీ బాధ నాకు తెలుసు ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా తగిన నష్టపరిహారమైనా ఇప్పించి ఆదుకుంటాం అని సభాముఖంగా ఇచ్చిన హామీ కూడా ఏడాది దాటినా ఒక్క అడుగు ముందుకు పడడం లేదన్నారు. అధికారులైతే సాంకేతిక సాకులు చెబుతూ మా ఫైళ్లను పక్కన పడేస్తున్నారని ఆరోపించారు.
ఇక మాకు ఓపిక నశించిందని అధికారులను బతిమిలాడే రోజులు పోయాయని పోరాడేందుకు సిద్ధమవుతున్నామని ప్రకటించారు. పెద్ద మరూరు సభ వేదికగా ప్రకటిస్తున్నాం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామాన్ని ఏకం చేస్తామని, ఓట్ల కోసం వచ్చే నాయకులను గడపగడపన నిలదీసేందుకు ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రమత్తు వీడి తమ 40 ఏళ్ల మా సమస్యల పరిష్కారానికి ముగింపు పలకాలని లేకపోతే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేయకతప్పదని హెచ్చరించారు.
కార్యక్రమంలో ముంపు బాధితుల సం ఘం జిల్లా అధ్యక్షుడు డాకోజీరావు, నాయకులు సులగిరి శ్రీనివాసులు, రాఘవేంద్రశెట్టి, సుగ్రీవుడు, చాంద్‌పాషా, కుమ్మ డి రాజు, సహదేవుడు, అమీర్, గుమ్మడం విష్ణు, దామోదరెడ్డి, శాంతయ్య, రంగస్వా మి, వీరశేఖర్, బాలస్వామి, ఊశన్ననాయు డు, జహంగీర్‌తోపాటు వివిధ గ్రామాలకు చెందిన ముంపు బాధితులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.