చందుర్తి, సెప్టెంబర్ 29: రేపు (బుధవారం) సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభకు భారీగా జనసమీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. సభ హాజరయ్యే సభ్యులు తినుబండారాలతో పాటు వాటర్ బాటిళ్లను వెంట తెచ్చుకోవాలని ఓ అధికారి హుకుం జారీ చేశారు. ఆయన మాటలకు సంబంధించిన వాయిస్ కాల్ రికార్డ్ చందుర్తి మండలంలోని ఎన్గల్ గ్రామ సోషల్ మీడియా గ్రూపులో చెక్కర్లు కొడుతోంది.
బుధవారం సిరిసిల్లలో నిర్వహించే సీఎం సభ నేపథ్యంలో అధికారి చేసిన సంభాషణ వివరాలు ఇలా ఉన్నాయి. ‘మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే సభకు బస్సు అందుబాటులో ఉంటుంది. సభ్యుల సంఖ్య, వివరాలను వెల్లడించిన అనంతరం భోజన సదుపాయం ఏర్పాట్లు కల్పిస్తాం.’ అని సదరు అధికారి తెలిపిన ఆడియో గ్రూపులో వైరలైంది.
ఇదిలా ఉండగా.. మండలంలోని ఓ గ్రామంలోని మహిళ సంఘాల నుండి ఒక్కో సంఘానికి ఇద్దరు చొప్పున హాజరుకావాలని ఓ సీఏ హెచ్చరించింది. ఒక్కో గ్రూప్ నుంచి ఇద్దరు సీఎం సభకు రావాలి. లేనిచో రూ.500 జరిమానా ఉంటుందని హెచ్చరిస్తూ సీఏ వాట్సాప్ మెసేజ్ పెట్టడంపై పలువురు మహిళలు అసహనం వ్యక్తం చేశారు.