నాగర్‌కర్నూల్, జూలై 27 : నాగర్‌కర్నూల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మత్స్యకారులు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అకారణంగా మత్స్యకారులపై దాడి చేసిన నాగర్‌కర్నూల్ మండలం నర్సాయిపల్లి గ్రామ సర్పంచ్ రాములు, ఇతర కులాలకు చెందిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మా హక్కులు మాకు కల్పించాలంటూ నినాదాలు చేశారు. ఈ వి షయంలో కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఇందు కు సంబంధించి మత్స్యకారులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
గుడిపల్లి రిజర్వాయర్‌లో చేపలు పట్టుకునే విషయమై గత కొంత కాలంగా నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లి, నర్సాయిపల్లి, రేవల్లి మండలం గౌరిదేవిపల్లి గ్రామాల మత్స్యకారులు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. నర్సాయిపల్లి గ్రామంలో మత్స్యకారులు లేకపోయినా వారికి సంబంధించి పంట పొలాలు కోల్పోయినందున అప్పట్లో అధికారులు ఇతర కులాల వారైనప్పటికీ రిజర్వాయర్‌లో చేపలు పట్టుకునేందుకు అవకాశం కల్పించారు. అయినప్పటికీ గత మూడు నాలుగేళ్లుగా వారి మధ్య పొత్తు కుదరక ప్రతి ఏడాది ఘర్షణ పడుతూనే ఉన్నారు.
ఈ క్రమంలో ఆదివారం నర్సాయిపల్లి గ్రామస్తులు చేపలు పట్టే విషయమై మాట్లాడుతామని గుడిపల్లి, గౌరిదేవిపల్లి గ్రామాలకు చెందిన మత్స్యకారులను పిలిపించారు. వారు వచ్చేలోగా డ్యామ్‌లోకి దిగి నర్సాయిపల్లి గ్రామస్తులు చేపలు పడుతుండడంతో ఏదీ మాట్లాడకుండా ఎలా చేపలు పడుతారంటూ ప్రశ్నించడంతో నర్సాయిపల్లి గ్రామ సర్పంచ్ రాములుతోపాటు మరికొందరు కర్రలతో మత్స్యకారులపై దాడికి దిగారు. విచక్షణా రహితంగా దాడి చేయడంతో గుడిపల్లికి చెంది న మత్స్యకారుడు రామకృష్ణతోపాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన మత్స్యకారులు మూకుమ్మడిగా నాగర్‌కర్నూల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని కేసు పెట్టారు.
ఇదే క్రమంలో దాడిచేసిన వ్యక్తి ని స్టేషన్లో కూర్చొబెట్టి మాట్లాడుతూ తాము ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించడం లేదంటూ మత్స్యకారులు కొద్దిసేపు ప్రధాన రహదారిపై దాడిచేసిన వారు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న నాగర్‌కర్నూల్ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన మత్స్యకారులు తమ సంఘం సభ్యులపై దాడులు చేస్తారా అంటూ, దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడమే కాకుండా అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. తమ హక్కులు తమకు కల్పించాలని, మత్స్యకారులపై దాడి చేసిన నర్సాయిపల్లి సర్పంచ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ నచ్చజెప్పి రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు.