Ram Pothineni | ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు హీరో రామ్. ఈ సినిమా నిర్మాణం తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తున్నది. ఇక తన తదుపరి సినిమా కోసం గౌతమ్ మీనన్ కథను ఇప్పటికే రామ్ ఓకే చేశారు.‘డబుల్ ఇస్మార్ట్’ తర్వాత తను చేసేది ఈ సినిమానే అనే వార్తలు కూడా బలంగా వినిపించాయి. అయితే.. ఇప్పుడు అనుకోకుండా త్రివిక్రమ్ ఎంటరయ్యారు. ప్రస్తుతం రామ్ కోసం మంచి కథను వండే పనిలో ఉన్నారట త్రివిక్రమ్. ఆయన దర్శకత్వం వహించే నెక్ట్స్ సినిమా ఇదేనని ఫిల్మ్‌వర్గాలు చెబుతున్నాయి.
మహేశ్ ‘గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్ సినిమా బన్నీతో ఉంటుందని గతంలో వార్తలొచ్చాయి. అయితే.. అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్ దాదాపుగా ఖరారైపోయింది. దర్శకుడు అట్లీ చెప్పిన కథ నచ్చడంతో ‘పుష్ప-2’ తర్వాత అట్లీ సినిమానే పట్టాలెక్కించేందుకు బన్నీ సిద్ధమయ్యారు. దాంతో ఇప్పుడు త్రివిక్రమ్‌కి హీరోల సమస్య వచ్చిపడింది. పనిలోపనిగా మాతృ సంస్థ స్రవంతి మూవీస్ రుణం తీర్చుకునే అవకాశం కూడా వచ్చింది. అందుకే రామ్ కోసం ఓ మంచి క్యూట్ లవ్‌స్టోరీని సిద్ధం చేస్తున్నారు త్రివిక్రమ్. మరి రామ్.. గౌతమ్‌మీనన్ కథను హోల్డ్‌లో పెట్టి త్రివిక్రమ్ సినిమా చేస్తాడా? లేక గౌతమ్‌మీనన్‌కి ఇచ్చిన మాటకోసం త్రివిక్రమ్ సినిమాను పక్కనపెట్టేస్తాడా?. ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.