T20 World Cup : టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. గత రికార్డులను తిరగరాస్తూ ఏకంగా రూ.131 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించింది. ఇది ఇప్పటివరకు వరల్డ్ కప్ విజేతలైన భారత జట్టుకు ఇచ్చిన అత్యధిక నజరానా. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రెటరీ దేవ్జిత్ సైకియా మంగళవారం వెల్లడించారు. గతంలో 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే.
అప్పట్లో ఈ జట్టుకు రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ అందించగా, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా బహుమతి ప్రకటించింది బీసీసీఐ. రూ.6 కోట్లు పెంచి రూ.131 కోట్లను బహమతిగా ఇవ్వనుంది. ఇక టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు అందించే ప్రైజ్‌మనీగా ఇండియాకు ఐసీసీ నుంచి రూ.27.48 కోట్లు దక్కిన సంగతి తెలిసిందే. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు రూ.14.65 కోట్లు అందాయి. బీసీసీఐ ప్రకటించిన రూ.131 కోట్లను జట్టులోని 15 మంది సభ్యులకు అందజేస్తారు. అలాగే కోచింగ్ స్టాఫ్, ఇతర సపోర్టింగ్ స్టాఫ్‌కు కూడా ఇందులో వాటా ఉంటుంది. ఈ నగదు బహుమతికి సంబంధించిన బ్రేక్‌డౌన్‌ను బీసీసీఐ అధికారికంగా వెల్లడించదు. కానీ, అత్యధిక అమౌంట్ ఆటగాళ్లకు సమంగా అందుతుంది. ఆ తర్వాత కోచింగ్ స్టాఫ్‌కు దక్కుతుంది.
చివరగా సపోర్టింగ్ స్టాఫ్‌కు అందజేస్తారు. వీరికి ఎంత ఇవ్వాలి అనేది బీసీసీఐ పెద్దలు నిర్ణయిస్తారు. ఇక కెప్టెన్ సూర్య కుమార్‌కు అందరికంటే ఎక్కువగా భారీగా ప్రోత్సాహం అందుతుంది. ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్‌పై ఇండియా భారీ విజయం సాధించింది. అందులోనూ సొంతగడ్డపై ఇలా తొలిసారి టోర్నీ గెలిచింది. దీంతో దేశవ్యాప్తంగా జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.