ఒకరు వాడిన దుస్తులు మరొకరు కొనుక్కుని వేసుకోవడం పేదరికం కాదు… పెద్దరికం అంటుంది హైదరాబాద్‌కు చెందిన గుడివాడ వైష్ణవి. ఎందుకంటే, అలా చేస్తున్న వారంతా ఈ పుడమిని కాపాడాలన్న పెద్దమనసు ఉన్నవాళ్లే అన్నది ఆమె మాట. ‘ఒక్కో వస్ర్తాన్ని, ఒక్కో వస్తువును మళ్లీ వాడుతున్నామంటే దాని తయారీకి అవసరమైన ప్రకృతి వనరుల్ని… తద్వారా ఆర్థిక వనరుల్ని కాపాడినట్టే కదా!’ అని చెబుతుంది. హైదరాబాదీ థ్రిఫ్టర్స్ పేరిట ఈమె నడుపుతున్న గ్రూపు కొన్ని వేల దుస్తులు, వస్తువులకు మళ్లీ ప్రాణం పోసింది. అంతేకాదు, రసాయన రహిత సౌందర్య ఉత్పత్తుల్ని తక్కువ ధరలో అందించాలన్న ఉద్దేశంతో ఇకో స్టూడియో అనే సంస్థనూ ప్రారంభించిన వైష్ణవి.. సిసలైన పర్యావరణ ప్రేమికురాలు!
Vyshnavi Gudivada | మనం మూడు చోట్ల జీవిస్తాం. మొదటిది శరీరం. రెండోది మనసు. మూడోది భూమి. ఈ మూడూ మనవే. కాబట్టి ఈ మూడిటినీ కాపాడుకోవాల్సిన బాధ్యతా మనదే. ఇందుకు అనుగుణంగా ఆలోచనలు, పనులు చేయడానికే నేను ఇష్టపడతా. థ్రిఫ్టింగ్ కూడా ఈ కోవలోదే. ఇందులో మనం ఒకరు వాడిన చుడిదార్నో, హ్యాండ్బ్యాగ్నో కొనుక్కుంటాం. మన దగ్గర ఉన్న అక్కర్లేని వస్తువుల్ని అవసరమైన వారికి అమ్ముతాం.
కాబట్టి ఇక్కడ మరో హ్యాండ్‌బ్యాగ్ తయారీకో, లేదా డ్రెస్ ఉత్పత్తికో అవసరమైన వనరుల్ని కాపాడినట్టే. అంతేకాదు, ముందే ఉపయోగించిన వనరులను రెండింతలు వినియోగించుకున్నట్టు కూడా. ఒకసారి వాడిన వస్తువుకు మళ్లీ విలువ కల్పించడమంటే మార్కెట్లోకి మళ్లీ ప్రవేశ పెట్టినట్టే. అందుకే మా థ్రిఫ్టింగ్ గ్రూప్‌లో ఉన్నవాళ్లంతా తమకు అవసరమైన వస్తువుల్ని ఇలానే కొనుగోలు చేస్తారు. అందుబాటు ధరకు కొంటున్నామనే కాదు, నేల మీది వనరుల్ని కాపాడేందుకు తమవంతు సాయం చేస్తున్నామన్న భావనా ఇందులోని ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. అయితే ఈ ఆలోచన రావడానికి నాకు ఎదురైన ఓ సందర్భమే ప్రేరణగా నిలిచింది.
ప్రాజెక్టు నేర్పింది…
చిన్నప్పుడు నాన్న ఉద్యోగ రీత్యా కొన్నాళ్లు గుజరాత్లో ఉన్నాం. మిగతా అంతా హైదరాబాద్‌లోనే. ఇక్కడి సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్స్ చేశాను. అప్పుడు ‘ట్రాష్ మేనేజ్మెంట్’ (చెత్త నిర్వహణ) అంశాన్ని ప్రాజెక్టుగా ఎంచుకున్నా! అందులో భాగంగా మేం కొందరం హైదరాబాద్‌లో చెత్త డంప్ చేసే ప్రాంతాల్లో ఒకటైన గుడిమల్కాపూర్ సందర్శించాం. దానికి సంబంధించిన రిపోర్టులు తయారు చేసుకున్నాం. చెత్త సేకరించే వాళ్లు కుప్పల్లోంచి వైర్లు, గాజు వస్తువులు, అట్టపెట్టెలు… వేరు చేస్తూ వాటిని అమ్ముకుంటున్నారు.
అంటే మనకు పనికిరావు అనుకున్నవి మరో చోట అవసరమవుతాయనే ఆలోచన వచ్చిందప్పుడు. కొన్నాళ్లు నా మనసులో అది అలాగే ఉండిపోయింది. నా దగ్గర నేను ఇక వాడను అనిపించిన మంచి డ్రెస్‌లు, ఫ్యాన్సీ నగలు, యాక్సెసరీల్లాంటివి చాలా పోగయ్యాయి. కొన్నిటిని చూసి నా ఫ్రెండ్స్ ‘భలే ఉన్నాయే!’ అనేవాళ్లు. నచ్చితే తీసుకోండి, బదులుగా మీ దగ్గరి వాటిలో నాకు ఏవైనా ఇవ్వండి అని చెప్పేదాన్ని.
అప్పుడు ఇద్దరం హ్యాపీ కదా! ఇదే ఉద్దేశంతో నా నేస్తాలతో హైదరాబాదీ థ్రిఫ్టర్స్ పేరిట ఓ వాట్సప్ గ్రూపు, ఇన్‌స్టా గ్రూపు, కమ్యూనిటీలను ప్రారంభించాను. నేను అప్పటికే సుస్థిరాభివృద్ధి, వ్యర్థాల నుంచి పర్యావరణాన్ని కాపాడుకోవడం లాంటి అంశాల మీద నా ఇన్‌స్టాలో పోస్టులు పెడుతూ ఉండేదాన్ని. అక్కడ నాకు రెండు వేల మంది దాకా ఫాలోవర్లు ఉన్నారు. వాళ్లలో ఎక్కువమంది పర్యావరణ స్పృహ ఉన్నవాళ్లే. దాంతో ఈ గ్రూపుల్లో వాళ్లు ఉత్సాహంగా చేరారు.
ఏమేం ఉంటాయంటే…
2019 మధ్యలో నేను ‘హైదరాబాదీ థ్రిఫ్టర్స్’ గ్రూపు ప్రారంభించినప్పుడు పదిమందిలోపే సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 600 పైచిలుకు ఉంది. దీన్ని చూసుకునేందుకు అయిదారుగురు పనిచేస్తున్నారు. ఇందులో క్యాజువల్ వేర్, పార్టీవేర్, ఫ్యాషన్‌వేర్ దుస్తులతోపాటు చెప్పులు, బూట్లు, హ్యాండ్‌బ్యాగులు, సౌందర్య ఉత్పత్తులు… ఇలా అన్నీ పోస్ట్ చేస్తాం. హోమ్ డెకరేటివ్స్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లలాంటివీ ఇందులో మూడోవంతు ధరలో అమ్మకానికి ఉంటాయి. గ్రూపు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ 10 వేల వస్తువులు పోస్ట్ అయ్యాయి.
ఇవికాక నెలలో ఒకటిరెండు సార్లు హైదరాబాద్‌లో థ్రిఫ్టింగ్ ఈవెంట్ నిర్వహిస్తుంటాం. తెలంగాణలో ఇది తొలి థ్రిఫ్టర్స్ గ్రూప్. ఇందులోని సభ్యులంతా ఆడవాళ్లే. విద్యార్థినులు, గృహిణులు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఎంప్లాయీస్.. ఇలా విభిన్న వర్గాలకు చెందినవారు ఇందులో ఉన్నారు. వీళ్లలో ఎక్కువమంది 19 నుంచి 45 ఏండ్ల మధ్యవాళ్లు.
ఒకరి దుస్తులు ఒకరు వేసుకోవడం తప్పులాంటి మూఢనమ్మకాలుగానీ, వేరే వాళ్లు వాడినవి మనం వాడటమేంటి అన్న అహంభావం కానీ వీళ్లలో అస్సలు కనిపించవు. ఇక, మా గ్రూపులో కొంతమంది బెంగళూరుకు మారిపోవడంతో ‘బెంగళూరు థ్రిఫ్టర్స్’ అని ప్రత్యేక గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. మా స్ఫూర్తితో హైదరాబాద్‌లోనూ మరికొన్ని గ్రూపులు ఏర్పడుతున్నాయి. ఇది మంచి పరిణామం.
అందుబాటులో…
మనం రోజువారీ వాడే షాంపూలు, సబ్బులు, పేస్టుల్లాంటి వాటిలో కెమికల్స్ కలిసి ఉంటాయి. వాటిని తగ్గించుకున్నా మనం నేలను కాపాడినట్టే. అందుకే ‘ఇకో స్టూడియో’ పేరిట ఒక రసాయన రహిత ఉత్పత్తుల సంస్థను ప్రారంభించాను. కెమికల్ ఫ్రీ అనేవన్నీ ఇటీవల చాలా ఖరీదుగా అమ్ముతున్నారు. కానీ, కాలేజీ పిల్లలూ వాడగలిగేలా ఉండాలన్న ఉద్దేశంతో 5 రూపాయల నుంచి 400 రూపాయల వరకు మాత్రమే ధర ఉండేలా వీటిని తయారుచేస్తున్నాం.
సున్నిపిండి, పండ్లపొడిలాంటి వాటితోపాటు క్లెన్సర్, స్క్రబ్, ఫేస్‌మాస్క్ తదితర 60 దాకా ఉత్పత్తుల్ని ఇందులో అమ్ముతున్నాం. వీటిమీద వచ్చిన డబ్బులో 20 శాతం వీధికుక్కలను సంరక్షించే సంస్థకు ఇస్తున్నాం. ఇవన్నీ ఎందుకంటే, మార్పు అనేది చాలా చిన్నగానే మొదలవుతుంది. కానీ నిరంతరం కొనసాగించే చిన్నమార్పులే ఒక పెద్ద ప్రయోజనానికి దారితీస్తాయి. ఆ దిశగా మనం చేసే ప్రతి పనీ లెక్క వేయదగ్గదే.
ఉదాహరణకు ప్లాస్టిక్ బాక్సులకు బదులు స్టీలు బాక్సులు, ప్లాస్టిక్ బ్రష్‌ల స్థానంలో వెదురు బ్రష్‌లు వాడటం, రసాయన రహిత రంగుల్ని వినియోగించడం, పునర్వినియోగ ప్యాడ్లను కొనుక్కోవడం… ఇలా ప్రతి అడుగులోనూ నేను పర్యావరణహితాన్ని చూస్తాను. మేం హిమాలయాలకు ట్రెక్కింగ్‌కు వెళ్లినప్పుడు కూడా మా బాక్సులు, వాటర్ బాటిళ్లు పట్టుకెళ్లాం. ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధించుకున్నాం. జీరో వేస్ట్ మేనేజ్మెంట్ ట్రిప్ అది. ఇలాగే… ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే పర్యావరణాన్ని కాపాడుకోవడం అన్నది సులభం అయిపోతుంది. ఆ మార్పు దిశగా నా ప్రయాణం ఎప్పటికీ కొనసాగుతుంది!
…? లక్ష్మీహరిత ఇంద్రగంటి