హైదరాబాద్, ఆగస్టు16( నమస్తే తెలంగాణ)/వరంగల్/హనుమకొండ (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘పాలపిట్ట రంగు చీరలు కట్టుకొని వేలాది మంది నన్ను ఆశీర్వదించడానికి వచ్చిండ్రు. ఇక్కడి నుంచి చూస్తుంటే మా అక్కలు, మా ఆడబిడ్డలు దసరా పండుగనాడు పాలపిట్టల తీరు కనిపిస్తున్నరు. ఎన్నడన్న బతుకమ్మ చీర కట్టుకొని అమ్మగారింటికి పోయిండ్రా అక్కా.. మా అక్కలకు వచ్చే దసరాకు చిలుకపచ్చ చీరను సారె పెడుతా’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటిమాదిరిగానే గొప్పలకు పోయారు. హామీల అమలు ఊసెత్తకుండా చీర, సారెలిస్తామని చెప్పడంతో పాలపిట్ట రంగు చీరలు కట్టుకున్న మహిళామణులు రియాక్ట్ అయ్యారు. సీఎం చెప్పిన గొప్పలపై భగ్గుమన్నారు. ఇస్తామన్నవన్నీ అమలు చేయకుండా ఏదో చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకోవడమెందుకు? అని పాలపిట్ట రంగు చీరలు కట్టుకొన్న మహిళంతా ముక్తకంఠంతో నిలదీశారు.
కాంగ్రెస్ ఎగ్గొట్టిన పథకాలపైనే ఆ మహిళలు మండిపడ్డారు. ‘రేవంతన్నా.. ఎన్నికలప్పుడు రూ.500 గ్యాస్ సిలిండర్ ఇస్తమని చెప్తివి.. ఇచ్చినవా? గ్యాస్ కోసం రూ.1,000 తీసుకుంటూ రూ.500కే ఇస్తున్నామని ఎందుకు చెప్తున్నవు’ అని ఓ మహిళ నిలదీసింది. రూ.1,000 కాదు.. రూ1,050 తీసుకుంటున్నరు.. అని పక్కనే ఉన్న పాలపిట్ట రంగు చీర కట్టుకున్న మరో మహిళ వంతపాడింది. మహాలక్ష్మి పథకం కింద మహిళకొక్కంటికి నెలకు రూ.2,500 చొప్పున ఆర్థికసాయం అందిస్తామని హామీ ఇస్తివి! ఇచ్చినవా? అన్న అని పాలపిట్ట రంగు చీర కట్టిన మరో మహిళ నిలదీసింది. దివ్యాంగులు, వితంతువుల పింఛన్లు పెంచుతమని చెప్పి అధికారంలోకి వచ్చినా, ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని మరో మహిళ ప్రశ్నించింది. ‘నా బిడ్డ బర్త్ సర్టిఫికెట్లో డేట్ తప్పుపడింది. మార్చమని తిరుగుతుంటే లంచం అడుగుతున్నరు.. 3 నెలల నుంచి తిప్పుతున్నారు.. అంటూ మల్లాపురం మహిళ గట్టిగానే ఓ మీడియా కెమెరా ముందు సర్కార్ అవినీతిని కడిగిపారేసింది. రైతుబంధు సరిగా ఇస్తలేదని మరో మహిళ తెలిపింది.
ఇక్కడి ఉపాధి వదిలి.. విదేశీ భాషలపై హితబోధ
‘జర్మనీ, జపాన్, కొరియన్ నేర్చుకోండి.. ఉపాధిని పొందండి’ అంటూ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్‌రెడ్డి ములుగు సభలో పిలుపునివ్వడంపై రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేస్తామని ప్రకటించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు యువతకు విదేశీ భాషలు నేర్చకోవాలని, ఇందుకు అవసరమైన శిక్షణ ఇస్తామని మాట్లాడటంపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నా స్పందించని రేవంత్.. విదేశీ విద్యపై హితబోధ చేయడమేందని నిలదీస్తున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఏదని, జాబ్ క్యాలెండర్ ఎక్కడకు పోయిందని, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. వీటిపై మాటమాత్రమైనా సీఎం మాట్లాడకపోవడంపై యువత ఆందోళనకు గురవుతున్నది. ఆందోళనలు చేస్తే కేసుల్లో ఇరుక్కుంటారని బెదిరించడంపైనా నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగాల సాధనకు పోరాడుతామని, బ్లాక్‌మెయిల్‌కు లొంగబోమని తేల్చిచెప్పారు.
రైల్వే కోచ్, ఎయిర్‌పోర్టు తెచ్చారట!
సొంత డబ్బాతో జనంలో పలుచన అవుతున్న విషయాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగం కొనసాగింది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మామునూరు ఎయిర్‌పోర్టును తామే తెచ్చామని రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. తమ వల్లే ఈ రెండూ జరిగాయని నిస్సిగ్గుగా చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొన్న నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో వచ్చిన రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులను.. కాంగ్రెస్ ప్రభుత్వం క్రెడిట్‌గా రేవంత్‌రెడ్డి చెప్పుకోవడంపై సభలో పాల్గొన్న వారు చర్చించుకొన్నారు.
మంత్రి కొండా సురేఖ దూరం
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు దేవాదాయ మంత్రి కొండా సురేఖ మరోసారి దూరంగా ఉన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి, మంత్రి కొండా సురేఖకు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నాయి. పరకాల నియోజకవర్గంలో ఆధిప్యతం కోసం ఆ ఇద్దరూ గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరకాలలో సీఎం కార్యక్రమానికి కొండా సురేఖ హాజరు కాలేదని అధికార పార్టీలో చర్చ జరుగుతున్నది. పరకాల నియోజకవర్గానికి చెందిన హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి సైతం ఈ పర్యటనకు దూరంగానే ఉన్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో విభేదాలే దీనికి కారణమని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.
మధ్యలోనే జనం తిరుగుముఖం
పరకాలలో జరిగిన సీఎం రేవంత్‌రెడ్డి సభకు వచ్చిన జనం మధ్యలోనే ఇండ్లకు వెళ్లపోయారు. ముఖ్యమంత్రి ప్రసంగం మొదలుకాక ముందే చాలామంది ఇండ్లకు తరలివెళ్లారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలు శాఖల సిబ్బంది, పోలీసు సిబ్బంది వెళ్లిపోతున్న జనాన్ని ఆపే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగం సమయంలోనూ చాలా మంది వెళ్లిపోతూ ఉండటం కనిపించింది.
పీసీసీ చీఫ్‌గా మహేశ్‌ను నేనే చేసిన: రేవంత్‌రెడ్డి
మహేశ్‌కుమార్‌గౌడ్‌ను తానే టీపీసీసీ అధ్యక్షుడిగా చేశానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు మంత్రి పదవులు, కోదండరామ్‌కు ఎమ్మెల్సీ పదవి తానే ఇచ్చానని సొంతంగా సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. సీఎంకు, పీసీసీ చీఫ్‌నకు ఇటీవల విభేదాల నేపథ్యంలో ఇద్దరూ పాల్గొన్న కార్యక్రమంలోనే రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎప్పటిలాగే ప్రతిపక్ష నేతలపై దుర్భాషలాడుతూ మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటల రుణాలు మొత్తం మాఫీ చేసిందని, రైతు భరోసా పూర్తిగా అందించిందని మరోసారి అవాస్తవాలు చెప్పారు.