Google : టెక్ దిగ్గజం గూగుల్ (Google) కు ఐర్లాండ్ (Irland) డేటా ప్రొటెక్షన్ కమిషన్ (DPC) భారీ షాకిచ్చింది. యూజర్ల లొకేషన్ డేటా (Users Location Data) ను నిర్వహించిన విధానంలో యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (GDPR) నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏకంగా 403 మిలియన్ యూరోల (403 Million Euros) (సుమారు రూ.3,700 కోట్లు) జరిమానా విధించింది. ఈ విషయాన్ని డీపీసీ అధికారికంగా ప్రకటించింది.
2018 మే 25 నుంచి 2020 ఫిబ్రవరి 4 మధ్య కాలంలో గూగుల్ తన యూజర్ల లొకేషన్ డేటాను ప్రాసెస్ చేసిన విధానం పారదర్శకంగా, చట్టబద్ధంగా లేదని డీపీసీ తన దర్యాప్తులో తేల్చింది. ముఖ్యంగా ‘వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ’, ‘లొకేషన్ హిస్టరీ’, ఆండ్రాయిడ్‌లోని ‘లొకేషన్ యాక్యురసీ’ వంటి ఫీచర్ల ద్వారా సేకరించిన డేటాను యూజర్ల ఆసక్తులను అంచనా వేయడానికి వాడుతున్నారనే విషయం వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయలేదని కమిషన్ పేర్కొన్నది. అంతేకాకుండా అవసరమైన దానికంటే ఎక్కువ కాలం డేటాను నిల్వ చేశారని ఆరోపించింది.
జరిమానాతోపాటు తమ లొకేషన్ డేటా ప్రాసెసింగ్ విధానాలను ఆరు నెలల్లోగా జీడీపీఆర్ నిబంధనలకు అనుగుణంగా మార్చుకోవాలని గూగుల్‌ను డీపీసీ ఆదేశించింది. ఐర్లాండ్ డేటా కమిషన్ ఇప్పటివరకు విధించిన జరిమానాల్లో ఇది నాలుగో అతిపెద్దది. ప్రస్తుతం గూగుల్‌పై మరో మూడు ప్రైవసీ ఉల్లంఘనలకు సంబంధించిన దర్యాప్తులు చివరి దశలో ఉన్నాయని కూడా కమిషన్ వెల్లడించింది. ఈ తీర్పుపై గూగుల్ స్పందించింది.
ఈ కేసు గతంలో తాము అనుసరించిన విధానాలకు సంబంధించినదని, 2019 నుంచే లొకేషన్ డేటా నిర్వహణలో గణనీయమైన మార్పులు చేశామని తెలిపింది. యూరోపియన్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్లు 2020లో చేసిన ఫిర్యాదుల ఆధారంగా డీపీసీ ఈ దర్యాప్తును ప్రారంభించింది. గూగుల్ యూరోపియన్ ప్రధాన కార్యాలయం ఐర్లాండ్‌లోనే ఉండటంతో ఈయూ తరఫున ప్రధాన నియంత్రణ సంస్థగా డీపీసీ వ్యవహరించింది.