హైదరాబాద్, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ): అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పల్లెలకే దూరమయ్యారు. కేవలం రాజధానికే పరిమితమవుతున్నారు. ప్రజలను పట్టించుకోవడమే మానేశారు. ‘మా ఎమ్మెల్యే కనిపించడం లేదు’ అని కార్యకర్తలు ఏకంగా వాల్‌పోస్టర్లు వేస్తున్నారు. వెతికి పెట్టమని పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలా 80 శాతం మంది హస్తం ఎమ్మెల్యేలు నెలల తరబడి నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో జమీందార్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారని, ప్రజలను కలుసుకోవడమే లేదు’ అని ఇటీవల పార్టీ సమావేశంలో సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం దానిని రుజువు చేస్తున్నది. శాసనసభ్యుల తీరుపై స్వయంగా ముఖ్యమంత్రే ‘జమీందారీ పోకడలు’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేయడం అధికార పార్టీలోని ఎమ్మెల్యేల తీరకు అద్దం పడుతున్నది. అధికార పార్టీ ఎమ్మెల్యే గడప తొకకుండా గ్రామాల్లో ఏ పనీ ముందుకు సాగకూడదు. రాబోయే డీలిమిటేషన్ పిడుగు ఎవరి స్థానాన్ని మింగేస్తున్నదోనన్న అనిశ్చితి, నియోజకవర్గాల అభివృద్ధి నిధుల విడుదలలో జాప్యం, ధాన్యం కొనుగోళ్లు-సాగు సమస్యలతో రగులుతున్న రైతన్నల ఆగ్రహం ఎమ్మెల్యేలను వెంటాడుతున్నది. దీనికితోడు ఒకసారి పర్యటిస్తేనే లక్షల ఖర్చు తడిసి మోపెడవుతుండటం, మరోవైపు స్థానిక సమస్యలను చెప్పుకొందామంటే సీఎం అపాయింట్మెంట్ దకని నిస్సహాయత నేపథ్యంలో ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కే పరిమితం చేస్తున్నట్టు సమాచారం.
రేపు సీటు ఉంటుందో? లేదో!
నియోజకవర్గాల పునర్విభజన అంశం ఎమ్మెల్యేలకు నిద్రలేకుండా చేస్తున్నది. 2026 జనాభా గణన తర్వాతే డీలిమిటేషన్ జరుగుతుందని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలైనా తమ నియోజకవర్గం ఏ రూపంలో చుట్టుకుంటుందో అనే ఆందోళనలో ఎమ్మెల్యేలు ఉన్నారు. నియోజవర్గం ఉంటుందా? లేక పక సెగ్మెంట్లో కలిసిపోతుందో? అనే భయం చాలామందిని వెంటాడుతున్నది. ఒకవేళ నియోజకవర్గం అలాగే ఉన్నా.. రిజర్వేషన్ల ఖరారులో ఎటుపోతుందో? అనే అనుమానం వారిని పీడిస్తున్నది. ఇప్పటికే గెలుపు కోసం రూ.కోట్లకు కోట్లు ఖర్చు చేసి ఆర్థికభారంతో సమమతం అవుతున్నట్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే తన వ్యక్తిగత బాధను వెల్లడించారు. రిజర్వేషన్లు ఖరారైతే, ఈ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంగా ఉండదు.. ‘రేపు ఉండని స్థానం కోసం ఇప్పుడే డబ్బు, సమ యం, శక్తి ఎందుకు వెచ్చించాలి’ అని సదరు ఎమ్మెల్యే తన అభిప్రాయం వ్యక్తంచేశారు. మెజారిటీ ఎమ్మెల్యేల్లో ఇదే తరహా ఆలోచన బలంగా నాటుకుపోయింది.
100 సార్లు ఫోన్ చేసినా..
ఎమ్మెల్యేలను గ్రామాలకు దూరం చేస్తున్న మరో అతిపెద్ద కారణం నిధుల కొరతేనని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) కింద 2025-26 బడ్జెట్లో ఒకో సెగ్మెంట్‌కు రూ.5 కోట్లు కేటాయించినా, ఆ నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్టు తెలిపారు. ‘నిలదీసి నిధులు అడిగే ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడమే లేదని, సీఎం సలహాదారు వేంనరేందర్‌రెడ్డిని కలిసి మాట్లాడాలని సూచిస్తున్నారని, కానీ, 100 సార్లు ఫోన్ చేసినా నరేందర్‌రెడ్డి ఫోన్ ఎత్తరు?’ అని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు నూటికి నూరుపాళ్లు నిజమేనని ఉత్తర తెలంగాణకు చెందిన మరో ఎమ్మెల్యే చెప్పారు. ప్రజా సమస్యలను పట్టుకొని నేరుగా సీఎంను కలిసి పరిషారం అడుగుదామన్నా, చాలామంది ఎమ్మెల్యేలకు ఆ అవకాశం సైతం సులభంగా దకడం లేదన్న ఫిర్యాదులు గట్టిగా వినిపిస్తున్నాయి. సీఎం పాలనా బాధ్యతలు, ఢిల్లీ పర్యటనలు, పార్టీ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండటంతో, నియోజకవర్గ సమస్యలు నేరుగా చెప్పుకొనేందుకు ఆయనకు తీరిక దొరుకడం లేదని నేతలు వాపోతున్నారు.
నిధుల కటకట.. ఎమ్మెల్యేల నిస్సహాయత
తమకు హక్కుగా రావాల్సిన సీడీపీ నిధులు పక్కకుపోయాయని, సీఎం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తున్నదని మరో ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సీఎంను బతిమిలాడుకొంటే ఆయన ఇచ్చే ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్ )పైనే ఆధారపడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్డీఎఫ్ నిధులు రూ.50 లక్షల నుంచి రూ.ఒక కోటి ఇవ్వడమే గగనంగా చెప్పుకొంటున్నారని, తీరా పనులు చేశాక బిల్లుల విడులలో కూడా ఇబ్బందులు తప్పడం లేదని సదరు ఎమ్మెల్యే తన అనుభవాన్ని చెప్పారు. సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా బహిరంగంగానే తమ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని, మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే బిల్లులు వస్తున్నాయని ఆరోపించారు.
చల్లారని రైతుల ఆగ్రహజ్వాల
వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభం పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నది. ఈ వానకాలం పలు జిల్లాల్లో సాధారణం కంటే వర్షపాతం భారీగా తగ్గి, వరిసాగు గణనీయంగా పడిపోయే అవకాశం ఉన్నదని వ్యవసాయ శాఖే అంచనా వేస్తున్నది. ఎల్ నినో ప్రభావాన్ని ఎదురొనేందుకు ప్రభు త్వం మూడు దశల కాంటింజెన్సీ ప్రణాళిక ప్రకటించినా, క్షేత్రస్థాయిలో రైతుల ఆగ్రహం మాత్రం చల్లారడం లేదు. తాము గ్రామాల్లోకి వెళ్లగానే రైతులు ముందుగా ధాన్యం నిల్వలనే చూపిస్తున్నారని దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే వివరించారు. ఇలాంటి ఆగ్రహావేశాల మధ్య నియోజకవర్గాల్లో అడుగుపెడితే నిలదీతలు, నిరసనలు తప్పవన్న భయంతో ఎమ్మెల్యేలు గ్రామాల ముఖం చూడటానికే జంకుతున్నారు.
మావోళ్లు జమీందార్లు
‘ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో జమీందార్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ప్రజలను కలుసుకోవడమే లేదు’ అని ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారని తెలిసింది. ఈ విషయం ఇప్పుడు ఆ పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కూడా ఎమ్మెల్యేలు సరిగా ప్రచారం చేయడం లేదని, కొన్నిచోట్ల ప్రత్యర్థి పార్టీ నేతలతో లోపాయికారీగా చేతులు కలుపుతున్నారని కూడా సీఎం ఆక్షేపించినట్టు తెలిసింది. ఇది కేవలం అంతర్గత అసంతృప్తికే పరిమితం కాలేదు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై గౌరవం సన్నగిల్లుతున్నదని ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడం, ఆయన మాటలకు మద్దతుగా జడ్చర్ల యువ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో అంతర్గత అసంతృప్తిని బహిర్గతం చేస్తున్నది.
ఒక్కసారికే రూ.5 లక్షల ఖర్చు
రాజకీయ, పరిపాలనా కారణాలతోపాటు ఆర్థిక భారం కూడా తమను వెనకి లాగుతున్నదని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తన మనోగతం చెప్పారు. వాహనాల కాన్వాయ్, భద్రతా సిబ్బంది, కార్యకర్తల ఏర్పాట్లు, భోజన వసతి ఖర్చులు కలిపి నియోజకవర్గంలో ఒకసారి పూర్తిస్థాయిలో పర్యటించాలంటే కనీసం రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని ఆ ఎమ్మెల్యేనే స్వయంగా చెప్పడం గమనార్హం. ప్రభుత్వ నిధులే సకాలంలో అందని పరిస్థితుల్లో, సొంత జేబు నుంచి అంత మొత్తం ఎలా సమకూర్చుకోగలమని, నెలకు కనీసం 10 రోజులు నియోజకవర్గంలో తిరిగితే రూ.30 లక్షలకు పైగా ఖర్చు వస్తునదని తెలిపారు. రాబడి లేకుండా, భవిష్యత్తు నియోజకవర్గం ఏమిటో తెలియకుండా ఇంత ఖర్చు చేయలేమని వారు చెప్తున్నారు. ఆర్థిక భారాన్ని మోయలేకే నెలల తరబడి నియోజకవర్గానికి దూరంగా ఉండిపోతున్నామని, తన తీరుగానే చాలామంది ఎమ్మెల్యేలు ఆలోచన చేస్తున్నారని సదరు ఎమ్మెల్యే ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’తో తన అభిప్రాయాలను పంచుకున్నారు.