Landslides | పశ్చిమ సిక్కింలోని రింబి (Rimbi) గ్రామంలో గురువారం రాత్రి భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బురద, రాళ్లు జనావాసాలవైపు దూసుకురావడంతో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. విరామం లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల గ్యాల్షింగ్ జిల్లాలోని యక్సోమ్-తాషిడింగ్ ప్రాంతంలో ఈ కొండచరియలు విరిగిపడ్డాయి. విద్యుత్ శాఖకు చెందిన ప్రభుత్వ క్వార్టర్లతో సహా అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇలా కొండచరియలు విరిగిపడటం ఇదే మొదటిసారి కాదు. రింబి, దాని చుట్టుపక్కల ఉన్న సింగ్లిటమ్ ప్రాంతాలు గత నెల నుంచి కొండచరియలు విరిగిపడుతూనే ఉన్నాయి. దీంతో ఈ పరిస్థితికి కారణం ఏంటి అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కారణం ఏంటి?
కొండచరియలు విరిగిపడటానికి ప్రధాన కారకాలు వర్షం, వాలు, నీటిపారుదల, భూగర్భం అని సిక్కింపై జరిపిన పరిశోధన (Research on Sikkim)లో వెల్లడైంది. ఈ ప్రాంతంలో అనేక కొండచరియలు విరిగిపడటానికి వర్షమే తక్షణ కారణం. నీరు నేలలోకి, పగిలిన రాళ్లలోకి చేరినప్పుడు భూమిలోపల ఒత్తిడి పెరిగి వాలును పట్టి ఉంచే బలం తగ్గుతుంది. ఏటవాలుగా ఉన్న భూభాగంలో ఇది నేల, రాళ్లు కిందికి జారిపడటానికి కారణమవుతుంది. సిక్కిం హిమాలయ పర్వత ప్రాంతం కావడం వల్ల ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. నిటారుగా, కఠినమైన భూభాగం, టెక్టోనిక్ ప్లేట్ కదలికల వల్ల ఇక్కడ భూగర్భ నిర్మాణం సంక్లిష్టంగా ఉంటుంది.

Lanslides
ఆగస్టు నుంచి ఇక్కడ పదేపదే కొండచరియలు విరిగిపడుతున్నారు. ఆగస్టు 15న రింబిలోని 30 కుటుంబాలు, సింగ్లిటమ్లోని 8 కుటుంబాలు కలిపి మొత్తం 150 మందికి పైగా నివసించే ప్రాంతాలు ఈ విపత్తుకు గురయ్యాయి. సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ముందు జాగ్రత్త చర్యగా రింబిలోని ప్రమాదకర ప్రాంతాల నుంచి 128 మంది నివసిస్తున్న 28 ఇళ్లను ఖాళీ చేయించింది. వారిని రింబి గ్రామ పంచాయతీ కేంద్రానికి తరలించారు. దీంతో ప్రాణనష్టం తప్పింది.
నేడు, రేపు (సెప్టెంబర్ 25, 26) అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. దీంతో కొండచరియల విపత్తు పొంచి ఉంది. రింబి ప్రాంతంలో సంభవిస్తున్న కొండచరియల విపత్తకు చింతిస్తున్నానని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ (Prm Singh Tamang) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.