మారిన మద్దతు లెక్కలు!
- సభలో తమిళనాడు ప్రాతినిధ్యం తగ్గొద్దని స్టాలిన్ ట్వీట్
- దీంతో డీలిమిటేషన్‌కు డీఎంకే మద్దతు ఇస్తున్నట్టు సంకేతాలు
- బిల్లుకు పవార్ పార్టీ మద్దతు..సుప్రియకు క్యాబినెట్ బెర్త్!!
- ఎస్పీ, జేడీయూ ఓటింగ్‌కు దూరమవ్వొచ్చని ఊహాగానాలు
- మ్యాజిక్ ఫిగర్ చేరడానికి చిన్న పార్టీలతో కేంద్రం చర్చలు
న్యూఢిల్లీ, నవంబర్ 27/(స్పెషల్ టాస్క్ బ్యూరో): నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు ఆమోదముద్ర పడటం ఖాయంగానే కనిపిస్తున్నది. వివిధ రాష్ర్టాల్లో తాజాగా మారిన రాజకీయ పరిణామాలు, మొన్నటి వరకూ బిల్లుపై తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించిన డీఎంకే, ఎన్సీపీ (ఎస్పీ) తదితర పార్టీలు కొంత మెత్తబడినట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి అవసరమైన సంఖ్యను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడగట్టే అవకాశం ఉన్నదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యేక మెజారిటీ ఇలా..
డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందాలంటే పలు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. అలా రాజ్యాంగ సవరణ కోసం ప్రవేశపెట్టే బిల్లులకు ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీ అవసరం. సభలో సభ్యుల హాజరు సగానికి (50%) పైగా ఉండాలి. హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది ఆ బిల్లుకు మద్దతు తెలపాలి. అప్పుడే ఆ బిల్లు ఆమోదం పొందుతుంది. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 540 మంది ఎంపీలు సభకు హాజరైతే.. వారిలో 360 మంది తప్పనిసరిగా బిల్లుకు మద్దతు తెలపాలి. లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభ ముందుకు వస్తుంది. రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న 245 మంది సభ్యులు సభకు హాజరైతే.. 161 మంది బిల్లుకు మద్దతు తెలపాలి. అప్పుడే ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్టంగా మారుతుంది. గత ఏప్రిల్ 17న డీలిమిటేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే సమయంలో సభలో 528 మంది సభ్యులు ఉన్నారు. అంటే కావాల్సిన మెజారిటీ 352. బిల్లుకు 298 మంది సభ్యుల మద్దతు మాత్రమే లభించింది. బిల్లుకు వ్యతిరేకంగా 230 మంది ఎంపీలు ఓటు వేశారు. ఫలితంగా అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో ఆ బిల్లు వీగిపోయింది.
ఇప్పుడు ఎన్డీయే బలమెంత??
లోక్‌సభలో ఎన్డీయేకి ప్రస్తుతం 320 (20 మంది టీఎంసీ ఎంపీలు, ఆరుగురు శివసేన ఎంపీలతో కలిపి) మంది సభ్యుల మద్దతు ఉంది. శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ-ఎస్పీ)కి చెందిన 8 మంది ఎంపీలు కూడా బిల్లుకు అనుకూలంగా ఓటేయబోతున్నట్టు ఆ పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతున్నది. ఇదే విషయమై ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని తమ 8 మంది ఎంపీలను ఆదేశిస్తూ ఆ పార్టీ ఇప్పటికే విప్ జారీచేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తమిళనాడులో కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుని, ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన డీఎంకే (22 మంది ఎంపీలు) ఈ బిల్లుపై తమకున్న సంపూర్ణ వ్యతిరేకతను కొంత సడలించింది.
డీలిమిటేషన్ తర్వాత కూడా పార్లమెంట్ స్థానాల్లో తమిళనాడుకు దక్కే 7.2 శాతం వాటా అలాగే ఉండేలా చూసుకోవాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇదే విషయమై ఆ పార్టీ అధినేత స్టాలిన్ తాజాగా ట్వీట్ కూడా చేశారు. తాజాగా ప్రభుత్వం ఈ బిల్లులో 50 శాతం పెంపునకు సంబంధించిన నిబంధనను చేర్చడంతో డీఎంకే సదరు బిల్లుకు అనుకూలంగా మద్దతు ఇచ్చే అవకాశమున్నదని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మద్దతుతో ఎన్డీయే బలం 350కు చేరుతుంది. ఏపీలోని వైఎస్సార్సీపీ (4 ఎంపీలు) కూడా బిల్లుకు అనుకూలంగా ఓటేయనున్నట్టు సమాచారం. ఫలితంగా ఎన్డీయే బలం 354కు చేరనున్నది. మరో ఆరు ఓట్ల కోసం ఎన్డీయే, ఇండియా కూటమిల్లో లేనటువంటి జేపీఎం, ఏఎస్ఎం, ఎంఐఎం, ఆప్‌తో పాటు స్వతంత్రుల మద్దతును కూడగట్టే అవకాశమున్నట్టు సమాచారం. కాగా, రాజ్యసభలో ఎన్డీయేకు 154 మంది సభ్యుల మద్దతు ఉంది.
ఆ ముగ్గురు ఎంపీల హాజరుపై సందిగ్ధత
లోక్‌సభలో కనీసం ముగ్గురు ఎంపీల హాజరుపై సందిగ్ధత నెలకొన్నది. టీఎంసీకి చెందిన కళ్యాణ్ బెనర్జీని జూలైలో జరిగిన వర్షాకాల సమావేశాల మిగిలిన కాలానికి సభ నుంచి సస్పెండ్ చేశారు. వచ్చే వారం జరగనున్న ఈ ప్రత్యేక సమావేశం వర్షాకాల సమావేశాల కొనసాగింపుగా ఉండనున్న కారణంగా ఆయన ఓటు వేయడానికి అనుమతి ఉంటుందో లేదో స్పష్టత లేదు. అలాగే, కశ్మీర్‌కు చెందిన స్వతంత్ర అభ్యర్థి షేక్ రషీద్, పంజాబ్‌కు చెందిన వారిస్ పంజాబ్ దే పార్టీకి చెందిన అమృత్‌పాల్ సింగ్ అనే ఇద్దరు ఎంపీలు ఇంకా జైల్లోనే ఉన్నారు. ప్రతిపక్ష కూటమిలో భాగమైన నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన అగా రుహుల్లా ఇటీవల రాజీనామా చేయడంతో ఆ పార్టీలో ఒక్కరే మిగిలారు. ఇదే సమయంలో 37 మంది సభ్యులున్న ఎస్పీ, నలుగురు సభ్యులున్న ఆర్జేడీ కూడా ఓటింగ్‌కు గైర్హాజరయ్యే అవకాశమున్నట్టు కూడా తెలుస్తోంది. దీంతో మొత్తం సభ్యుల హాజరు శాతం తగ్గడంతో, బిల్లుకు మద్దతును కూడగట్టడానికి అవసరమైన మెజార్టీ మార్కు కూడా తగ్గనున్నది. ఈ పరిణామంతో ఎన్డీయేకు సానుకూల పరిస్థితులు మరింతగా పెరిగే అవకాశమున్నట్టు రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.
క్రాస్ ఓటింగ్, గైర్హాజరీ గట్టెక్కిస్తాయా?
ఈ ఏడాది ఏప్రిల్‌లో 54 ఓట్ల తేడాతో ఓటమి పాలైన తర్వాత 540 మంది సభ్యులున్న లోక్‌సభలో సుమారు 40 ఓట్ల లోటును ఎదుర్కొంటున్న ఎన్డీయే ఈ నెల 30 నుంచి డిసెంబర్ 3 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో డీలిమిటేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు, 2026ను తిరిగి ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నది. దీంతో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), చిన్న ఎన్డీయేతర సమూహాల క్రాస్ ఓటింగ్ లేదా గైర్హాజరు నిర్ణయాత్మకంగా మారాయి. రాజ్యాంగంలోని 368 అధికరణ కింద లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్యను కాకుండా హాజరై, ఓటు వేసిన సభ్యుల సంఖ్యను బట్టి మూడింట రెండు వంతుల మెజారిటీని లెక్కిస్తారు. ఎవరు అనుకూలంగా, ఎవరు ప్రతికూలంగా ఓటు వేశారనే దాన్ని మార్చడంపైనే ఎన్డీయే లెక్కలు ఆధారపడి ఉంటాయి.
ఎస్పీ నుంచి క్రాస్‌ఓటింగ్?
అంచనా ప్రకారం 320 మంది ఎన్డీయే ఎంపీలతో పాటు 37 మంది ఎస్పీ లోక్‌సభ ఎంపీలు అందరూ అనుకూలంగా ఓటు వేసినప్పటికీ మొత్తం ఓట్లు 357కి చేరుకుంటాయి. ఇది పూర్తి పోలింగ్ శాతం ప్రకారం వచ్చే 360 ఓట్లకు ఇంకా మూడు ఓట్లు తక్కువ. ఎస్పీతో పాటు ఎన్డీయేతర సభ్యుల క్రాస్ ఓటింగ్ ప్రభుత్వానికి అత్యంత కీలకం కానున్నది.
గైర్హాజరు కూడా కీలకం
ఓట్ల విభజన సమయంలో ఎస్పీ ఎంపీలు లేదా చిన్న విపక్ష పార్టీలు గైర్హాజరైతే లేదా ఓటింగ్‌కు దూరంగా ఉంటే ఓటు వేసే ఎంపీల సంఖ్య తగ్గి, మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం తగ్గుతుంది. ఉదాహరణకు మొత్తం ఓటింగ్ 540 నుంచి 522 ఎంపీలకు తగ్గితే మూడింట రెండు వంతుల మెజారిటీ 348 ఓట్లకు పడిపోతుంది. దీనివల్ల విపక్ష పార్టీ ఓట్లన్నీ లేకుండానే సుమారు 354 ఓట్లతో మెజారిటీని సాధించవచ్చు.
ఎన్డీయే నంబర్ గేమ్
- లోక్‌సభలో ప్రస్తుత సభ్యులు-540
- బిల్లు ఆమోదానికి అవసరమైన మెజార్టీ-360 (540 మంది సభ్యులు ఓటేస్తే)
- ఎన్డీయే ప్రస్తుత బలం -320
- ఎన్సీపీ (శరద్ పవార్): 8
- డీఎంకే: 22 (మద్దతిచ్చే అవకాశం)
- వైసీపీ: 4 (మద్దతిచ్చే అవకాశం)
- తద్వారా పెరుగనున్న బలం: 354
- ఇంకా కావాల్సిన ఓట్లు-6
- ఏ కూటమిలో లేని జేపీఎం, ఏఎస్పీ, ఎంఐఎం, ఆప్,స్వతంత్రుల బలం-9
సభ్యులు గైర్హాజరైతే మారనున్న ఫిగర్స్
- లోక్‌సభలో ప్రస్తుత సభ్యులు-540
- ఎస్పీ (37), ఆర్జేడీ (4)తో పాటు మరో ముగ్గురు ఎంపీలు గైర్హాజరైతే లోక్‌సభలో సంఖ్య-496
- బిల్లు ఆమోదానికి అప్పుడు అవసరమైన మెజార్టీ-331
- డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ), వైఎస్ఆర్సీపీ మద్దతుతో ఎన్డీయే బలం-354
- అవసరమైన దాని కంటే ఎన్డీయే దగ్గర ఎక్కువ ఉన్న ఓట్లు-23
రాజ్యసభలో
- లోక్‌సభలో ప్రస్తుతం సభ్యులు-245
- మూడింట రెండొంతుల మెజారిటీ-161 (245 మంది ఎంపీలు ఓటేస్తే)
- రాజ్యసభలో ఎన్డీయే బలం- 154
- ఇంకా కావాల్సిన ఓట్లు-7
గత ఏప్రిల్ 17న జరిగిన ఓటింగ్ ఇలా
- సభకు హాజరైనవారు-528
- అవసరమైన ఓట్లు-352
- బిల్లుకు అనుకూలంగా- 298
- బిల్లుకు వ్యతిరేకంగా- 230
- తక్కువైన ఓట్లు- 54
- ఫలితం-వీగిపోయిన బిల్లు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

