బాపు భావజాలం.. ఉద్యమాల పాఠం
లెనిన్ నాయకత్వంలో రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన బోల్షివిక్ విప్లవాన్ని ప్రత్యక్షంగాచూసిన అమెరికన్ జర్నలిస్ట్ జాన్ రీడ్ ‘టెన్ డేస్ దట్ షుక్ ద వరల్డ్’ పేరుతో అక్షరబద్ధం చేశారు.లెనిన్ స్వయంగా ముందు మాట రాసిన ఈ పుస్తకం ‘ప్రపంచాన్ని కుదిపేసిన పదిరోజులు‘ పేరుతో తెలుగులోనూ అనువాదమైంది. అణచివేతకు గురైన కష్టజీవుల ఆకాంక్షల ఆధారంగా జరిగిన రష్యన్ విప్లవంచరిత్రలో నమోదైన మహత్తర ఘట్టం. ఆ విప్లవ సాహిత్యం తదనంతర కాలంలో రష్యా సమాజంపైనే కాదు ప్రపంచ దేశాల్లోని అనేక ఉద్యమాలను ఎంతలా ప్రభావితం చేసిందనేది తెలిసిందే. పంథా వేరైనా ఆ పదిరోజుల్లాగానే కేసీఆర్ పదకొండు రోజుల దీక్ష, దేశ రాజకీయ వ్యవస్థను సుధీర్ఘ కాలం కుదిపేసిన చారిత్రక పరిణామాలపైజరగాల్సినంత పరిశోధన జరగలేదు. దీక్షా దివస్ సందర్భంగా ఆనాటి పరిణామాలను గుర్తుచేసుకుందాం.
దశాబ్దాలపాటు సర్వ స్వతంత్ర దేశంలో ఆర్థిక స్వావలంబనకే కాదు, సామాజిక అస్తిత్వానికి కూడా దూరం చేయబడిన కోట్లాది జన సమూహాన్ని, ఒక కారణజన్ముడి దీక్ష, దక్షత నూతన చరిత్రలోకి నడిపించింది. ఆ ఉద్యమ ప్రస్థానాన్ని చేయాల్సినంత గ్రంథస్థం చేయలేదనేదనే చెప్పాలి. అనేక పోరాటాలు, అస్తిత్వ ఉద్యమాలు, నేతల పాత్రలపై వివిధ భాషల్లోకి అనువాదమైన పుస్తకాలు అనేకం మన రాష్ట్రంలోని గ్రంథాలయాలు, పుస్తక విక్రయ కేంద్రాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. పెరియార్, లోహియా నుంచి మొదలు దేవరాజ్ అర్స్ వరకు ఎందరి పోరాటాలో ఫిలాసఫీగా సిద్ధాంతీకరణ జరిగాయి. రాజకీయ, సామాజిక చలనశీలతను నేటికీ ప్రభావితం చేస్తున్నాయి.
కొందరి ఆలోచనలకు సిద్ధాంతీకరణ జరిగి, చరిత్రకు అనుసంధానమై దేశంలోని 150 కోట్ల జనం జీవితాల వర్తమానాలు, భవిష్యత్తు తరాలను ప్రభావితం చేసేలా స్థిరీకరణ జరిగినప్పుడు, భౌగోళికంగానే కాదు, అనేక అణచివేతల నుంచి తెలంగాణను విముక్తి వైపు నడిపించిన కేసీఆర్ కార్యాచరణను, పోరాటాన్ని, విజయాలను, ప్రసంగాలన్నింటినీ ఫిలాసఫీగా ప్రజలు ప్రేమించకుండా ఉంటారా..? తెలంగాణ చరిత్రను కేసీఆర్ అధ్యాయం లేకుండా చదవడమెలా అవివేకమో, భవిష్యత్తును నిర్మించుకోవడం కూడా అంతే అసాధ్యం. ఆర్తనాదాల సదస్సులు, ఆవేదనల ధర్నాలను మట్టి మనుషుల విస్ఫోటనంగా మలిచిన నాయకుడు కేసీఆర్. కరువు కాటు, సర్కార్ వేటుకు ఒరిగిన వారి శవయాత్రలతో శోకవనమై భీతిల్లుతున్న గ్రామాలను గర్జనలతో వెన్నుతట్టి నడిపించిన నాయకుడు కేసీఆర్.
రాష్ట్ర, జాతీయ స్థాయిలో మర్రిమానుల్లా స్థిరపడి, అంతర్జాతీయ ఆర్థిక శక్తులుగా ఎదిగిన ఆధిపత్య రాజకీయ వ్యవస్థలతో ఏ శక్తుల ఆసరాలేని కేసీఆర్ తలపడిన తీరు, సాధించిన విజయాలు స్వాతంత్య్ర భారతదేశ రాజకీయ చరిత్రలోనే ప్రత్యేక అధ్యా యం. దీక్షకు ముందు దశాబ్దన్నరపాటు నిప్పుల వంతెనపై నిర్మించి, నిలిపిన ఎత్తుగడల పోరాటం, దీక్షతో రగిలించిన మహోద్యమం, రాష్ట్ర ఏర్పాటు పరిణామాలు, అనంతరం సుస్థిర అభివృద్ధి ప్రణాళికలు, పాలనా నమూనా అన్నీ కూడా నమోదు చేసి, వివిధ భాషల్లోకి అనువాదం చేసి, సిద్ధాంతీకరించాల్సిన చారిత్రక సందర్భంలో ఉన్నాం.
చరిత్రను పరిశీలిస్తే తెలంగాణ ఆలోచనల ఆకలి ఎప్పుడూ తన వరకే పరిమితమైలేదు. సొంత అస్తిత్వానికి, ఆత్మ గౌరవానికి ఏర్పడిన ముప్పును పునాది నుం చో, పైనుంచో పాక్షికంగా అర్థం చేసుకోకుండా, అన్ని కోణాల్లో అన్వయించుకొని, దేశంలోని ఆకలినంతా ఆలింగనం చేసుకొని, షావుకారు రాజకీయాలకు చరమగీతం పాడేందుకు ప్రయత్నం చేసింది. సమాజానికి అవసరమైనప్పుడు అటో ఇటో ఎటో నడవకుండా ముందు నిలబడి అడుగులేసింది.
కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం, పోరు పాలన నేటిజెన్ జీకే కాదు, అన్ని జెనరేషన్లకు జీవిత పాఠమే. అందుకే దీక్షా దివస్ సందర్భంగా ‘కేసీఆర్ భావజాలం.. ప్రతి తరానికి దారిదీపం’ అనే సత్యం స్థిరపడే కార్యాచరణకు నాంది పలుకాలి. పోరాటాలను, పాలనా వ్యవస్థలను నిర్మించడం చేతకాని నిందాన్వేషకులు ప్రతి సమాజంలోనూ ఉంటారు.
నవంబర్ 29 అంటే ఒక తేదీ మాత్రమే కాదు. అదొక భావోద్వేగ జ్ఞాపకం. సకలజనులకూ స్పూర్తి సందర్భం. దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో 1929లో జతీంద్రనాథ్ దాస్, 1932లో గాంధీ, ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం 1952లో పొట్టి శ్రీరాములు, ప్రత్యేక పంజాబ్ రాష్ట్రం కోసం 1961లో మాస్టర్ తారాసింగ్, 1969లో దర్శన్ సింగ్, మణిపూర్‌లో మానవ హక్కుల పరిరక్షణ కోసం 2000-16లో ఇరోమ్ షర్మిల, 2006లో సింగూర్ భూపోరాటంలో భాగంగా మమతా బెనర్జీ, అవినీతికి వ్యతిరేకంగా 2011లో అన్నా హజారే ఆమరణ దీక్షల లక్ష్యాలు చరిత్రలో నిలిచిపోయాయి.
స్వాతంత్య్రానికి పూర్వం గాంధీ దీక్షను పక్కన పెడితే, ఇండిపెండెంట్ ఇండియాలో కేసీఆర్ దీక్ష ప్రభావం, లక్ష్యం, సాధించిన విజయం ఎంతో ప్రత్యేకం. ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంగా చెప్పుకొనే చరిత్ర. 2009 నవంబర్ 29న మొదలైన కేసీఆర్ దీక్ష పార్లమెంట్ లోపల, వెలుపల నిప్పుల వర్షాన్ని కురిపించింది.
అంతిమంగా నెత్తుటి నదులను శాశ్వతంగా ఆపింది. ఇంతటి చారిత్రక వైభవాన్ని యువతరం మదిన తలవడమే కాదు, దేశం ముందు కేసీఆర్ నిలిపిన ప్రశ్నలకూ సమాధానం కోసం అన్వేషించాలి. మోదీ మూడో విడత సర్కార్, మూడేండ్ల రేవంత్ సర్కార్ తెలంగాణపై మూకుమ్మడి దాడిని ప్రజలు పూర్తిగా అనుభవించారు.
వీధుల్లో వీరంగమాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డిని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. జర్మన్ రచయిత బెర్టోల్డ్ బ్రెహ్ట్ ‘నియంతలను వ్యతిరేకించవద్దు, వెక్కిరించండి’ అని అన్నట్టుగా మోదీ అధ్వాన పాలనపై నవతరం సోషల్ మీడియాలో ఆటాడుకుంటున్నది. ఈ చారిత్రక సందర్భంలో దీక్షా దివస్ ద్వారా తెలంగాణ బాపు కేసీఆర్ అందించిన ఫిలాసఫీని జెన్-జీతోపాటు జనరేషన్లు అన్నీ అందిపుచ్చుకోవాలి.
(వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్)
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

