మహబూబ్‌నగర్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బిగ్ మేడం ఆదేశాలతో ఓ ఉన్నతాధికారి మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణలో చక్రం తిప్పారు. బిగ్ షాడో చెప్పినట్టు వినాలని వచ్చిన ఆర్డర్లతో నిరుపేద రైతుల కడుపులు కొట్టి కోట్ల రూపాయల అక్రమాలకు తెరలేపారు. ఆదివారం ‘మల్టీ లూటీ పార్క్.. హుకూంపేటగా మారిన హకీంపేట’ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వచ్చిన కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రైతుల భూములను సేకరించిన అధికారులు ఎవరి భూమి ఎంత పోయిందో కనీసం ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వకుండా.. వాటిని బయటపెట్టకుండా పరిహారం పంపిణీ చేస్తుండటం అనుమానాలకు తావిస్తున్నది. దీనికి సంబంధించిన మొత్తం రికార్డులన్నీ తారుమారు చేసేందుకు దుద్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఎంచుకొని ‘బిగ్ మేడమ్‌కు బిగ్ గిఫ్ట్’ ఇచ్చేందుకు అంతాభాగం పంచుకున్నట్టు తెలుస్తున్నది. కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల్లో ఉండాల్సిన భూసేకరణ రికార్డులన్నీ వంట మనిషి చేతిలో ఉండటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. పరిహారం రాలేదని ఎవరైనా వికారాబాద్ కలెక్టరేట్‌కు వెళ్తే అక్కడ తెల్ల కాగితం తీసుకొని తిప్పి పంపుతున్నారు. క్షణాల్లోనే ఆ రైతు వివరాలు బిగ్ షాడోకు చేరవేసి.. వాళ్లు కలెక్టరేట్ గేటు కూడా దాటకముందే ఫోన్లు చేయించి బెదిరింపులకు దిగుతున్నారు. ‘ఏరా.. నాకు తెల్వకుండానే కలెక్టరేట్‌కు పోతే నీకు పని అవుతదా? ఇచ్చిన కాడికి తీసుకొని వెళ్లిపో’ అంటూ దబాయింపులకు దిగుతున్నట్టు సమాచారం.
అన్నీ చక్కదిద్దిన ఉన్నతాధికారి
సీఎం నియోజకవర్గంలో చేపడుతున్న మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ కోసం బిగ్ షాడో ఆదేశాలతో ఉన్నతాధికారి అన్నీ చక్కదిద్దారని అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పార్క్‌కు సంబంధించి సమాచారం కోసం సదరు అధికారికి ఫోన్ చేస్తే ‘నా దగ్గర లేదు.. ఫలానా దగ్గర ఉన్నది’ అని బదులిచ్చారు. అక్కడికి వెళితే ‘మా దగ్గర లేదు.. ఉన్నతాధికారులకు అడగండి’ అంటూ దాటవేశారు. ఈ వ్యవహారం టీజీఐఐసీ చేతిలో ఉన్నది కదా? అని సదరు జోనల్ అధికారికి ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’ పదుల సార్లు ఫోన్ చేసినా స్పందన లేదు.
బిగ్ షాడో చెప్పిన వాళ్లకే..
కొడంగల్ నియోజకవర్గం హకీంపేట, లగచర్ల, పోలేపల్లి గ్రామాల పరిధిలోని సుమారు 1368 ఎకరాలను మల్టీ పర్పస్ పార్కు కోసం సేకరించారు. పాసు పుస్తకాలు, రికార్డులను గుంజుకొని అరకొర పరిహారం ఇస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి బిగ్ షాడో చెప్పిన వాళ్లకు మాత్రమే ‘మీకు పరిహారం చెక్కు వచ్చింది.. వచ్చి తీసుకువెళ్లండి’ అని ఫోన్లు వస్తున్నాయి. అక్కడికి వెళ్తే భూమి పోయిన రైతులు తమకు ఇచ్చిన చెక్కును చూసి అవాక్కవుతున్నారు. ‘సారూ.. మా భూమి ఇంత పోయింది.. మీరు ఇచ్చేది ఇంతేనా?’ అని ప్రశ్నిస్తే ‘వెళ్లి మీ గ్రామానికి చెందిన వ్యక్తిని అడగండి’ అంటూ తిప్పిపంపుతున్నారు. సదరు బిగ్ షాడోను అడిగితే ‘నీ పరిహారం పెండింగ్‌లో ఉన్నది.. వస్తుంది లే’ అంటూ దాటవేస్తున్నాడు.
చక్రం తిప్పిన ఉన్నతాధికారి
ఇండస్ట్రియల్ పార్కు కోసం భూసేకరణ జరిగినప్పుడు ఓ ఉన్నతాధికారి అంతా తానే దగ్గరుండి చూసుకున్నాడనే చర్చ నడుస్తున్నది. బిగ్ షాడో, సదరు ఉన్నతాధికారి కలిసి పరిహారం ఎవరికి ఇవ్వాలో? ఎంత ఇవ్వాలో? డిసైడ్ చేసినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన రికార్డులన్నీ దుద్యాల తహసీల్దార్ కార్యాలయం నుంచి రహస్యంగా తెప్పించుకున్నారు. ఈ రికార్డులన్నిటినీ తమకు అనుకూలంగా మార్చే బాధ్యతను ఇక్కడి తహసీల్దార్‌కు అప్పజెప్పినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు ఎవరికి వెళ్లాయో ఆరా తీస్తే మొత్తం కుంభకోణం బయటపడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాగా ప్రొసీడింగ్స్ ఇస్తే ఎక్కడ కోర్టుకు పోతారోననే భయంతో ఉన్నతాధికారులు పథకం ప్రకారం రైతులకు ఎలాంటి ఆధారం లేకుండా చేసి అడ్డగోలుగా పరిహారం మెక్కి బిగ్ మేడమ్‌కు బిగ్ గిఫ్ట్ ఇస్తున్నట్టు సమాచారం. అన్నీ తానై చక్రం తిప్పిన ఉన్నతాధికారి ఇటీవలే తాను కోరుకున్న చోటుకు బదిలీ అయి వెళ్లిపోయినట్టు తెలిసింది. అన్నీ చక్కదిద్దినందుకే తాను కోరుకున్న పోస్టింగ్ వచ్చిందని అధికారవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
రికార్డులన్నీ బిగ్ షాడో చేతుల్లో
నిర్వాసితుల జాబితా, పరిహారం వివరాలు, ప్రొసీడింగ్స్, సర్వే రిపోర్ట్లన్నీ బిగ్ షాడో చేతిలో కనిపించడం నిర్వాసితులను నివ్వెరపరుస్తున్నది. నిర్వాసితులు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వని రికార్డులు బిగ్ షాడో చేతిలో ప్రత్యక్షమయ్యాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నిజమైన రైతులకు పరిహారం ఇప్పించాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. నిర్వాసితులకు న్యాయం చేయకపోతే భారీ ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
తహసీల్దార్ ఆఫీస్‌లోనే తారుమారు
భూ సేకరణ రికార్డులన్నీ దుద్యాల తహసీల్దార్ కేంద్రంగా తారుమారవుతున్నట్టు తెలుస్తున్నది. ఇక్కడి అధికారులంతా బిగ్ షాడో కనుసన్నల్లో నడుస్తున్నట్టు బలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ రెవెన్యూ అధికారి ఈ పరిహారం కుంభకోణంలో తన పాత్ర ఏమీ లేదని తెలియజేసేందుకు అన్ని పార్టీల నేతలతో సఖ్యతగా మెదులుతున్నారని, అవసరం లేకున్నా అన్ని పార్టీల నేతలకు ఫోన్లు చేసి ఏదో సమాచారం చెప్తున్నట్టు నటిస్తున్నాడని, కానీ చేయాల్సినదంతా లోలోపల చేస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయంలో ఏ చిన్న కాగితం అడిగినా ‘ఇక్కడ ఏదీ లేదు’ అని చేతులెత్తేస్తున్నారు. అదే బిగ్ షాడో చెప్తే క్షణాల్లో కుర్చీ వేసి మరీ పనులు చేసి పెడుతున్నారనే ఆరోపణలున్నాయి.