నాగర్కర్నూల్, సెప్టెంబర్ 23 : జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయాలని గత కొన్ని రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనలు, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న నిరంతర ఒత్తిడి ఫలించాయని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. కొద్దిసేపటి క్రితం జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి సాగునీటిని విడుదల చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. జూరాల నీటి కోసం రైతులు రోడ్డెక్కారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది. రైతుల ఆందోళనలు, బీఆర్ఎస్ పోరాటం ఫలితంగానే ప్రభుత్వం దిగివచ్చి జూరాల గేట్లు ఎత్తాల్సి వచ్చిందని,ఇది అన్నదాతల పోరాట విజయం” అని మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
రైతుల పంటలను కాపాడేందుకు సాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. నీటి కోసం రైతులు ఆందోళన చేసే పరిస్థితి రావడం బాధాకరమన్నారు. “రైతుల సమస్యలపై బీఆర్ఎస్ ఎప్పుడూ రాజీపడదు. రైతుల పక్షాన ఎంతటి పోరాటానికైనా బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుంది. జూరాల ఆయకట్టు పరిధిలోని ప్రతి ఎకరాకు అవసరమైన సాగునీరు అందే వరకు ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షించాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
జూరాల నీటి కోసం పోరాడిన రైతులకు, వారికి అండగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు మర్రి జనార్దన్ రెడ్డి అభినందనలు తెలిపారు.“నీళ్లు అడిగితే రైతులను అణచివేయడం కాదు.. వారి సమస్యలను పరిష్కరించాలి. రైతుల ఐక్య పోరాటం ముందు ఏ ప్రభుత్వం అయినా స్పందించాల్సిందే. జూరాల గేట్లు ఎత్తడం అన్నదాతల పట్టుదలకు నిదర్శనం” అని మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు.