SriLanka Court | శ్రీలంక (Srilanka) లో ఏడేళ్ల క్రితం అంటే 2019లో జరిగిన మారణహోమం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈస్టర్ ఆదివారం (Easter Sunday) నాటి ఆ ఆత్మాహుతి బాంబు దాడుల (Suicide Bomb attacks) లో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో కొలంబో హైకోర్టు (Colombo High Court) త్రిసభ్య ధర్మాసనం తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. నిందితుల్లో 15 మందిని దోషులుగా నిర్ధారించి వారికి 200 నుంచి 260 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధించింది.
మంగళవారం ఈ తీర్పును ప్రకటించిన కోర్టు.. ప్రధాన నిందితుడిగా ఉన్న నౌఫర్ మౌలవితోపాటు మిగతా వారికి శిక్షలు ఖరారు చేసింది. దోషుల్లో ఒకరికి 260 ఏళ్లు, నలుగురికి 240 ఏళ్లు, ఐదుగురికి 220 ఏళ్లు, మరో ఐదుగురికి 200 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. ఇదే కేసులో సరైన ఆధారాలు లేకపోవడంతో మరో 9 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. దోషుల ఆస్తులను ప్రభుత్వపరం చేయాలని కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ కింద వీరిని దోషులుగా నిర్ధారించారు.
2019 ఏప్రిల్ 21న ఈస్టర్ పండుగ రోజున శ్రీలంకలోని మూడు చర్చిలు, మూడు విలాసవంతమైన హోటళ్లపై ఏకకాలంలో ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఐసిస్ ప్రేరణతో స్థానిక ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ‘నేషనల్ తౌహీద్ జమాత్’ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ మారణహోమంలో 45 మంది విదేశీయులు సహా సుమారు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. శ్రీలంక అంతర్యుద్ధం ముగిసిన తర్వాత దేశంలో జరిగిన అత్యంత భయంకరమైన ఉగ్రదాడిగా ఇది నిలిచిపోయింది.