హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ)/వెంగళరావునగర్: పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఉచితంగా అందించాలన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నేడు కార్యరూపం దాల్చుతున్నది. కేసీఆర్ హయాంలో రూపుదిద్దుకొన్న సనత్‌నగర్ టిమ్స్ సోమవారం ప్రారంభంకానున్నది. సనత్‌నగర్ ఛాతి దవాఖాన ప్రాంగణంలో అత్యాధునిక దవాఖానను నిర్మించాలని తలపెట్టిన నాటి సీఎం కేసీఆర్ 2022 ఏప్రిల్ 26న టిమ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందుకు అవసరమైన నిధులు కేటాయించి వేగంగా నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ఏడాదికే అసెంబ్లీ ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో టిమ్స్ నిర్మాణం అనుకున్న దానికంటే ఆలస్యమైంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ చాలాకాలంపాటు టిమ్స్ నిర్మాణాలను పట్టించుకోలేదు. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రశ్నించడంతో ఎట్టకేలకు మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి. కేసీఆర్ శంకుస్థాపన చేసి, నిర్మాణం ప్రారంభించిన టిమ్స్‌ను ఇప్పుడు కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకొంటున్నది. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం టిమ్స్‌ను ప్రారంభించనున్నారు. గచ్చిబౌలి, అల్వాల్, కొత్తపేటతోపాటు సనత్‌నగర్‌లోనూ టిమ్స్ దవాఖానల నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు.
ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో 1,070 కోట్లతో శంకుస్థాపన
ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతి దవాఖాన ప్రాంగణంలోని 22.6 ఎకరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం టిమ్స్ కోసం ఎంపిక చేసింది. హాస్పిటల్ నిర్మాణానికి 2022 ఏప్రిల్ 26న నాటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. సుమారు రూ.1,070 కోట్ల భారీ వ్యయంతో జీ+14 (గ్రౌండ్ ప్లస్ 14 అంతస్తులు) బహుళ అంతస్తుల భవన నిర్మాణాన్ని అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మాణం చేపట్టారు.
సఫలీకృతమైన ఓపీ ట్రయల్ రన్
ఈ ఏడాది మే నుంచే రోజువారీ ఓపీ సేవల ట్రయల్ రన్ ప్రారంభించారు. ప్రస్తుతం ప్రతిరోజూ 200 నుంచి 250 మందికిపైగా రోగులు ట్రయల్న్ ద్వారా ఉచిత వైద్య పరీక్షలు, ప్రాథమిక చికిత్సలు, ఔషధాలు పొందుతున్నారు.
అవయవ మార్పిడి చికిత్సతోపాటు 37 ప్రత్యేక వైద్య విభాగాలు
సనత్‌నగర్ టిమ్స్ ప్రధానంగా నాలుగు కీలకమైన వైద్య విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నది. కార్డియాక్ (గుండె సంబంధిత), నెఫ్రాలజీ-యూరాలజీ (మూత్రపిండాల సంబంధిత), ట్రామాకేర్, ప్రత్యేకంగా అవయవ మార్పిడీ (ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్) చికిత్సలకు ఇది ప్రధాన కేంద్రంగా నిలువనున్నది. వీటితోపాటు అనుబంధంగా మరో 37 ప్రత్యేక వైద్య విభాగాలు ఇకడ ఏర్పాటుచేసుకొని, అన్ని రకాల సంక్లిష్ట రోగాలకు ఒకేచోట అత్యుత్తమ చికిత్స అందించడానికి సిద్ధంగా ఉన్నాయి.
సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధం
కేసీఆర్ కలల సాకారంగా రూపుదిద్దుకున్న సనత్‌నగర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎంసీఆర్టిమ్స్) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా సోమవారం అధికారికంగా ప్రారంభమై ప్రజలకు అందుబాటులోకి రానున్నది. నిమ్స్ తరహాలోనే స్వయం ప్రతిపత్తి (అటానమీ) హోదా కలిగిన ఈ దవాఖానకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు తొలి ఐదు నుంచి ఆరేండ్లపాటు ప్రభుత్వమే గ్రాంట్ల రూపంలో నిధులు అందించనున్నది. ఈ దవాఖాన హైదరాబాద్ నగర ప్రజలతోపాటు చుట్టుపకల జిల్లాల పేద ప్రజలకు వరప్రదాయినిగా అందుబాటులోకి రాబోతుండటంపై పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష
సనత్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్) దవాఖాన భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆదివారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి టిమ్స్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. టిమ్స్ ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వ వైద్యరంగంలో కీలక మైలురాయి అవుతుందని చెప్పారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావులేకుండా పోలీసు శాఖతోపాటు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
దవాఖాన పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, తాగునీరు, విద్యుత్తు సరఫరాలో ఎలాంటి అంతరాయం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంట్రెన్స్, ఎగ్జిట్ మార్గాలు, బందోబస్తు, జనసముదాయ నియంత్రణ, ట్రాఫిక్, అత్యవసర సమయాల్లో స్పందించే విధానాలను ఆయా శాఖలు ముందుగానే మరోసారి సమీక్షించుకోవాలని సూచించారు. సమావేశంలో వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జకారియా చోంగ్తు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ, టిమ్స్ డైరెక్టర్ నరేంద్రకుమార్, మెడికల్ సూపరింటెండెంట్ మహబూబ్‌ఖాన్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ఐఆండ్‌పీఆర్ కమిషనర్ ముకుంద్‌రెడ్డి, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
1,082 పడకల సామర్థ్యం, విడతల వారీ ప్రణాళిక
ఈ దవాఖానను మొత్తం 1,082 పడకల భారీ సామర్థ్యంతో రూపకల్పన చేశారు. అంతర్గత నిర్మాణాలు, అత్యాధునిక వైద్య పరికరాల అమరిక సవాలుతో కూడుకున్నది కావడంతో గతంలో అనుకున్న డిసెంబర్ 9, ఉగాది ప్రారంభోత్సవ గడువులు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ క్రమంలో సేవల లభ్యతను వేగవంతం చేసేందుకు అధికారులు విడతల వారీ ప్రణాళికను సిద్ధంచేశారు. మొదటి విడత కింద 582 పడకలను అందుబాటులోకి తెస్తూ, మిగిలిన 500 పడకలను అక్టోబర్ నాటికి పూర్తిస్థాయిలో సిద్ధం చేయడానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.