హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): గోదావరి నదిలో భారీగా వెళ్తున్న వరద జలాలను ఎత్తిపోసి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లను నింపాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆన్ ఆఫ్ పద్ధతిలో కాకుండా 24 గంటలపాటు అన్ని మోటర్లను నడుపాలని కోరారు. రాష్ట్రంలో ఒకవైపు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, మరోవైపు గోదావరిలో భారీగా వరదనీరు పోతున్నా ఆ వరదను ఎత్తిపోసి జలాశయాలను నింపడంలో కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తున్నదని విమర్శించారు. ఈ మేరకు సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి శుక్రవారం హరీశ్‌రావు లేఖ రాశారు. అన్నపూర్ణ, రంగనాయకసాగర్ రిజర్వాయర్లు డెడ్‌స్టోరేజీలో ఉన్నాయని, 50 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న మల్లన్నసాగర్లో ప్రస్తుతం సుమారు 13 టీఎంసీల నీరే ఉన్నదని ఆ లేఖలో పేర్కొన్నారు.
మల్లన్నసాగర్‌ను పూర్తిస్థాయిలో నింపితే హైదరాబాద్ తాగునీటి అవసరాలతోపాటు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూసీ ప్రాజెక్టుకు కూడా నీటిని తరలించే అవకాశం ఉంటుందని సూచించారు. కొండపోచమ్మసాగర్‌లో 15 టీఎంసీలకు 6 టీఎంసీలే ఉన్నాయని, ఆ రిజర్వాయర్‌ను నింపితే యాదాద్రి-భువనగిరి జిల్లాలోని బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సద్వినియో గం చేసుకోవాలనే ఉద్దేశంతో 141 టీఎంసీల సామర్థ్యంతో అప్పటి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవస్థను నిర్మించారని గుర్తుచేశారు.
ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయండి
ఎల్లంపల్లి నుంచి వరదనీటిని ఎత్తిపోసి మిడ్‌మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపాలని హరీశ్‌రావు సూచించారు. ఆ రిజర్వాయర్లను నింపితే దాదాపు 5 లక్షల ఎకరాలకు ప్రయోజనం ఉంటుందని తెలిపారు. మిడ్‌మానేరు దిగువన ఉన్న లోయర్ మానేరు డ్యామ్ (ఎల్ఎండీ)లో ప్రస్తుతం సుమారు 11 టీఎంసీల నీరే ఉన్నదని, ఎల్ఎండీకి నీటిని తరలిస్తే కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయని పేర్కొన్నారు.
దీంతో పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి-భువనగిరి, మేడ్చల్-మలాజిగిరి, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని రైతులు, ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. రంగనాయకసాగర్‌లో నీరు లేక సిద్దిపేట జిల్లా నర్మెటలోని పామాయిల్ ఫ్యాక్టరీ నిర్వహణ ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. ఎల్ నినోను సాకుగా చూపి బాధ్యత నుంచి సర్కార్ తప్పించుకోవద్దని హితవు పలికారు. రాజకీయాలను పకనబెట్టి గోదావరిలో వరద నీరు అందుబాటులో ఉన్నప్పుడే దానిని ఎత్తిపోసి జలాశయాలను నింపాలని, జాప్యంచేస్తే అందుబాటులో ఉన్న నీటిని కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఆ లేఖలో పేర్కొన్నారు.