ముషీరాబాద్, సెప్టెంబర్ 25: బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో సిబ్బందిని పెంచి పరిస్థితులను మెరుగుపర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆయన చాంబర్లో కలిసి వినతిపత్రం సమర్పించారు. హాస్టళ్లు సరిపోక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను వివరించారు.
తగిన సౌకర్యాలు కల్పించాలని, ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని కోరారు. సమయానికి వంట చేసేవారు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, జీతాలు ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగులు వదిలి వెళ్తున్నారని పేర్కొన్నారు. కాలేజీ హాస్టళ్లలో సీట్లు పెంచాలని, కొత్తగా బీసీ కాలేజీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.