Congress | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సభ అట్టర్ ఫ్లాప్ కావడంపై పార్టీ అధిష్ఠానం సీరియస్ అయినట్టు సమాచారం. దీనికి పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒంటెద్దు పొకడలే కారణమని సీనియర్లు మండిపడుతున్నారు. సభ సక్సెస్ అయితే అది తన క్రెడిట్‌గా, సక్సెస్ కాకపోతే పార్టీ ముఖ్య నేతల సహాయ నిరాకరణగా చిత్రీకరిస్తూ అధిష్ఠానం ముం దు తమను బద్నాం చేస్తున్నారని సీనియర్లు వా పోతున్నారు. పార్టీ టికెట్లు ఇచ్చేటప్పుడు తమతో సంప్రందించకుండా ఏకపక్షంగా బలహీనమైన అభ్యర్థులకు ఇప్పించి, వారి వైఫల్యాన్ని తమపైకి నెడుతున్నారని సీనియర్లు మండిపడుతున్నారు.
రాహుల్‌గాంధీ పాల్గొన్న సరూర్‌నగర్ సభకు జన సమీకరణ బాధ్యతను మల్కాజిగిరి, చేవెళ్ల, భువనగిరి అభ్యర్థులే చూసుకుంటారని తమకు చెప్పి, వారు విఫలమైతే ఆ నెపాన్ని తమపై మోపితే ఎలా అని సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కీలకమైన ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి వన్‌మాన్ షో వల్ల జరుగుతున్న పరిణామాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లడం సబబు కాదని తాము మౌనం పాటిస్తుండగా, ఆయనేమో తమను అధిష్ఠానం వద్ద బలహీన పరచడానికి ఏ అంశాన్నీ వదిలిపెట్టడం లేదని సీనియర్లు మండిపడుతున్నారు.
రాహుల్‌గాంధీ సభకు జన సమీకరణ చేయాల్సిన చేవెళ్ల అభ్యర్థి రంజిత్‌రెడ్డి, మల్కాజిగిరి అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, భువనగిరి అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వైఫల్యం కారణం కాదా? ఈ ముగ్గురికి టికెట్లు ఇప్పించింది ఎవరు? రేవంత్‌రెడ్డి కాదా? అలాంటప్పుడు ఆ తప్పిదాన్ని తమపైకి ఎలా నెడతారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. వీరిలో సునీతా మ హేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత కాంగ్రెస్‌లో చేరారని, అలాంటప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్లో స్పందన ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో ఎంతో మంది సమర్థులైన నాయకులు ఉండగా, వారిని కాదని ఎన్నికల ముందు బయటి నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చిందెవరు? సభ ఫెయిల్యూర్‌కు తామెలా కారణం అవుతామని ప్రశ్నిస్తున్నారు. పార్టీ నేతలను పక్కన పెట్టి బయటి నుంచి వచ్చిన వారిని అభ్యర్థులుగా తమపై రుద్దితే టికెట్ ఆశించిన నాయకులు కానీ, పార్టీ అధికారంలో లేకపోయినా నష్టనష్టాలు భరించి మొదటి నుంచి పార్టీనే నమ్ముకున్నవారు కానీ మనస్ఫూర్తిగా పని చేస్తారా? తప్పులన్నీ సీఎం రేవంత్‌రెడ్డి వన్‌మాన్ షోగా నడుపుకుంటూ, అధిష్టానం ముందు తమను దోషులుగా నిలబెడుతామంటే ఎలా? అని పార్టీలో అంతర్మథనం మొదలైంది. పారాచ్యూట్ నేతలకు టికెట్లు ఇవ్వద్దని, భవిష్యత్తులో పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పినా వినిపించుకున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.
రేవంత్‌రెడ్డి వన్‌మాన్ షో వల్ల పార్టీకి జరుగుతున్న నష్టాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా వినిపించుకోవడం లేదు. రేవంత్‌రెడ్డి చెప్పిందే అధిష్ఠానం వింటున్నది తప్ప తా ము చెప్పేది వినిపించుకోవడం లేదని కీలక నేతలు సైతం వాపోతున్నట్టు తెలిసింది. అయినప్పటికీ, కొందరు ముఖ్య నేతలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తే, ఎన్నికల ఖర్చులకు డబ్బులు సమకూర్చే సత్తా మీకు ఉన్నదా? అని ప్రశ్నించడంతో తాము మారుమాట్లాడలేక పోతున్నామని చెప్తున్నారు. ‘పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు దేనినీ వినదలుచుకోలేదు.. పట్టించుకోం’ అని అధిష్ఠానమే తెగేసి చెప్పడంతో రేవంత్‌రెడ్డి ఆడిందే ఆట…పాడిందే పాటగా వన్ మాన్షో సాగుతున్నదని ఒక సీనియర్ నాయకుడు ఆవేదన వ్యక్తంచేశారు.